iDreamPost
android-app
ios-app

మనకూ ఒక రజనీకాంత్‌ ఉన్నారు… కండక్టర్‌ నుంచి ఎమ్మెల్యే అయిన ప్రకాశం జిల్లా నేత..

మనకూ ఒక రజనీకాంత్‌ ఉన్నారు… కండక్టర్‌ నుంచి ఎమ్మెల్యే అయిన ప్రకాశం జిల్లా నేత..

సౌత్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ గురించి తెలియనివారుండరు. ఆయన పయనం అందరికీ ఆదర్శం. బస్‌ కండక్టర్‌గా జీవితం మొదలు పెట్టి భారతదేశ సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు రజనీకాంత్‌. సినిమాల్లో రజనీకాంత్‌ ప్రస్థానం మాదిరిగానే.. రాజకీయాల్లోనూ అదే ప్రస్థానంతో ఎదిగిన నేత ఒకరు ఉన్నారు. ఆ నేత తెలుగువాడు కావడం విశేషం. ఏపీఎస్‌ఆర్టీసీ బస్‌ కండక్టర్‌ నుంచి అంచెలంచెలుగా ఎదిగి గ్రానైట్‌ వ్యాపారిగా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచారు ప్రకాశం జిల్లాకు చెందిన బూచేపల్లి సుబ్బారెడ్డి.

కండక్టర్‌ నుంచి ఎమ్మెల్యేగా..

గ్రానైట్‌ పరిశ్రమకు పేరుగాంచిన చీమకుర్తికి చెందిన బూచేపల్లి సుబ్బారెడ్డి.. బస్‌ కండక్టర్‌గా పని చేశారు. ఆ తర్వాత గ్రానైట్‌ వ్యాపారంలోకి వెళ్లారు. వ్యాపార గురువు శిద్ధా రాఘవరావు వద్ద వ్యాపారంలో ఓనమాలు దిద్దారు. 2004లో దర్శి కాంగ్రెస్‌ టిక్కెట్‌ కోసం ప్రయత్నించారు. అయితే కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే, వైఎస్‌కు బంధువైన సానికొమ్ము పిచ్చిరెడ్డికే పార్టీ టిక్కెట్‌ దక్కింది. బూచేపల్లి సుబ్బారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ తరఫున బాలకృష్ణ స్నేహితుడు కదిరి బాబూరావు తొలిసారి దర్శి నుంచి బరిలో నిలుచున్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజా ప్రస్థానం పాదయాత్రలో ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ దర్శిలో ఓడిపోయింది. స్వతంత్ర అభ్యర్థి అయిన బూచేపల్లి సుబ్బారెడ్డి సంచలన విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వైఎస్‌ కుటుంబానికి సన్నిహిత నేతగా ఎదిగారు.

మూలాలు మరిచిపోని అరుదైన నేత…

ఎంత ఎత్తు ఎదిగినా.. మూలాలు మరిచిపోకూడదనే మాటను పాటించిన నేత బూచేపల్లి సుబ్బారెడ్డి. కండక్టర్‌గా పని చేసి, ఆ తర్వాత ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగినా కూడా తన గతాన్ని మాత్రం బూచేపల్లి మరువలేదు. ఏపీఎస్‌ ఆర్టీసీ ఎంప్లాయిస్‌ గౌరవ అధ్యక్షుడుగా పని చేశారు. ఒంగోలు బస్‌స్టాండ్‌లో సిబ్బంది సౌకర్యార్థం భవనం నిర్మించి ఇచ్చారు. జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సౌమ్యుడుగా పేరొందిన సుబ్బారెడ్డిని పార్టీలకు అతీతంగా ఇప్పటికీ అందరూ అభిమానిస్తారు, గౌరవిస్తారు. చీమకుర్తిలో తన సతీమణి బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి (బీవీఎస్‌ఆర్‌) పేరుతో ఇంజనీరింగ్‌ కాలేజీని ఏర్పాటు చేశారు. కిడ్నీలు విఫలం కావడంతో 2019 మే 12వ తేదీన సుబ్బారెడ్డి మరణించారు. ఆగస్టు 14న సుబ్బారెడ్డి జయంతిని ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు.

Also Read : తోట త్రిమూర్తుల స్థానాన్ని భర్తీ చేసిన టీడీపీ .. రామచంద్రాపురంలో ఆసక్తికర పోరు..!

కుటుంబ సభ్యులు ప్రజా ప్రతినిధులే…

తనతోపాటు తన కుటుంబాన్ని ప్రజా జీవితంలోకి తీసుకొచ్చారు సుబ్బారెడ్డి. 2004–2009 మధ్య సుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చిన్నకుమారుడు బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి చీమకుర్తి ఎంపీపీగా పని చేశారు. 2009లో దర్శి నుంచి తన కుమారుడు శివప్రసాద్‌ రెడ్డి చేత పోటీ చేయించారు సుబ్బారెడ్డి. 33 ఏళ్ల వయస్సులో శివప్రసాద్‌ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.

పీఆర్‌పీ తరఫున మద్ధిశెట్టి వేణుగోపాల్, టీడీపీ తరఫున మన్నెం వెంకట రమణ పోటీ చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన కదిరిబాబూ రావు తన సొంత నియోజకవర్గమైన కనిగిరి నుంచి బరిలో దిగారు. అయితే పరిశీలన దశలో ఆయన నామినేషన్‌ చెల్లకుండా పోయింది.

శివప్రసాద్‌ ఎమ్మెల్యేగా ఉన్న 2009–2014 మధ్యలో ఆయన తల్లి బూచేపల్లి వెంకాయమ్మ చీమకుర్తి ఎంపీపీగా పని చేశారు. 2014లో వైసీపీ తరఫున పోటీ చేసిన శివప్రసాద్‌ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తన తండ్రి వ్యాపార గురువు శిద్ధా రాఘవరావుతో తలపడ్డారు. 1374 ఓట్ల స్వల్ప మెజారిటీతో శిద్ధా రాఘవరావు విజయం సాధించారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా మారినా కూడా బూచేపల్లి, శిద్ధాలు ఆదర్శంతమైన రాజకీయాలు చేశారు.

వ్యక్తిగత కారణాలతో శివప్రసాద్‌ రెడ్డి 2019లో పోటీ దూరంగా ఉన్నారు. అయితే అభ్యర్థిని సూచించే బాధ్యతను వైఎస్‌ జగన్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిపై ఉంచారు. ఈ సమయంలో 2009లో పీఆర్‌పీ తరఫున పోటీ చేసిన మద్ధిశెట్టి వేణుగోపాల్‌ను శివప్రసాద్‌ రెడ్డి సూచించారు. ఆయన విజయానికి పని చేశారు. తాజాగా జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో బూచేపల్లి వెంకాయమ్మ జడ్పీటీసీగా పోటీ చేశారు. వైసీపీ ప్రకాశం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిత్వాన్ని ఆమె దక్కించుకున్నారు. మెజారిటీ స్థానాలు వైసీపీ గెలుచుకోవడం, వెంకాయమ్మ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ అవడం లాంఛనమే.

Also Read : “పోతుల ” రీఎంట్రీతో కందుకూరులో ఏం జరగబోతోంది..?