iDreamPost
iDreamPost
ఈమధ్య పెద్ద స్టార్లకే ఓపెనింగ్స్ రాక తలకిందులవుతుంటే అనసూయ ప్రధాన పాత్రలో నటించిన దర్జాని థియేటర్లలో తీసుకురావడం సాహసమే. అందులోనూ గత వారం వచ్చిన ది వారియర్, నిన్న విడుదలైన థాంక్ యుతో పాటు మరికొన్ని చిత్రాలు పోటీలో ఉన్నప్పటికీ నిర్మాతలు రిస్క్ కి రెడీ అయ్యారు. సునీల్ మరో కీలక పాత్ర పోషించడం మాస్ ని కొంత మేర ఆకట్టుకుంది. ముఖ్యంగా ట్రైలర్ ని కమర్షియల్ గా కట్ చేయడం బిసి సెంటర్ జనాన్ని టార్గెట్ చేసింది. పుష్పలో భార్యాభర్తలుగా నటించిన అనసూయ సునీల్ ల కాంబినేషన్ ఇందులో ఏం చేసింది, దర్జా టైటిల్ కు తగ్గట్టు పెత్తనం చేసిందా లేదా రిపోర్ట్ లో చూసేద్దాం పదండి
బందరులో జరిగే కథ ఇది. కనకమహాలక్ష్మి అలియాస్ కనకం(అనసూయ) భయంకరమైన లేడీ డాన్. తన అక్రమ వ్యాపారాలకు ఎవరు అడ్డం వచ్చినా కనికరం లేకుండా నిర్ధాక్షిణ్యంగా చంపేస్తుంది పోలీసులైనా సరే. కనకం తమ్ముడు గణేష్(అరుణ్ వర్మ) ప్రేమలో మోసపోయి అనూహ్య రీతిలో చనిపోతాడు. దీంతో మరో సోదరుడు రంగ(సమ్ము) పగతో రగిలిపోతాడు. అప్పుడు సీన్లోకి ఎంటరవుతాడు ఏసిపి శివ శంకర్ (సునీల్). రాగానే కనకంతో తలపడతాడు. గణేష్ చావు కేసుకి విచారణ మొదలుపెడతాడు. అసలు ఈ హత్య ఎలా జరిగింది, కనకం బ్యాచ్ దీనికి ఎలా ప్రతీకారం తీర్చుకుంది, శివ శంకర్ కు ఈ మొత్తం వ్యవహారానికి కనెక్షన్ ఏంటనేది సినిమాలో చూడాలి
అనసూయ, సునీల్ లు యాక్టింగ్ పరంగా దర్జాకున్న ప్రధాన బలం. కథ చాలా రొటీన్ గా సాగుతుంది. ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం శ్రీహరి సినిమాలను గుర్తుచేసేలా మరీ అవుట్ డేటెడ్ స్క్రీన్ ప్లేతో దర్శకుడు సలీం మాలిక్ ఎలాంటి ప్రత్యేకత చూపలేకపోయాడు. ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ కొంత వరకు కాపాడింది కానీ సినిమా బాగుందని చెప్పడానికి అదొక్కటే సరిపోలేదు. కొన్ని యాక్షన్ ఎపిసోడ్లు, ఇంటర్వెల్ బ్లాక్ పర్లేదనిపించినా ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం థియేటర్ కంటెంట్ అనిపించే మెటీరియల్ ఇందులో లేదు. బొత్తిగా టైం పాస్ కావడం లేదు సునీల్ అనసూయలను చూస్తూ టైం పాస్ చేసేస్తాం అనుకుంటే తప్ప దర్జా అర్జెంట్ గా చూడాల్సిన బ్యాచ్ లో చేరలేదు