iDreamPost
android-app
ios-app

ఇండియన్ క్రికెట్ యంగ్ లెజెండ్… పిలిచేయండి టీమ్ లోకి…!

ఇండియన్ క్రికెట్ యంగ్ లెజెండ్… పిలిచేయండి టీమ్ లోకి…!

ఏ మాత్రం బెరుకు లేదు, ఏ మాత్రం కంగారు లేదు, ఆడిన షాట్ మీద నమ్మకం, ఆడిన ప్రతీ బంతి మీద నియంత్రణ, బౌలర్ ఎవరైనా సరే అలజడి లేదు, సహచరుల వికెట్ లు పడుతున్నా మీకు నేనున్నా అంటూ, క్రికెట్ లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆటగాడిగా, క్రికెట్ ను పూర్తిగా చదివేసిన ప్రొఫెసర్ లా, బ్యాటింగ్ లో మాస్టర్స్ డిగ్రీ చేసినట్టుగా, బౌలర్ ను పూర్తిగా చదివేసినట్టుగా, గ్రౌండ్ మీద ఒక మ్యాప్ వేసుకున్నట్టు, ఆడే ప్రతీ షాట్ కొలత వేసుకున్నట్టు… బౌలింగ్ కు అనుకూలిస్తుంది అనుకున్న పిచ్ మీద ఆ కుర్రాడు ఆడుతున్న ఆట ప్రత్యర్ధిని కూడా నివ్వెర పరిచింది.

అతని పేరే రుతురాజ్ దశరద్ గైక్వాడ్… ఐపిఎల్ లో ఆడటం పెద్ద విషయం కాదు… ఊపితే సిక్స్ లేదా అవుట్ అన్నట్టు ఆడతారు ఆటగాళ్ళు… కాని గైక్వాడ్ ఆట అందరి కంటే భిన్నం, ఐపిఎల్ లో క్రిస్ గేల్, డివిలియర్స్, వార్నర్, వాట్సన్ ఇలా ఎందరో క్రికెట్ లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆటగాళ్ళను మించి అతను ఆడిన ఆట క్రికెట్ చూసే ప్రేక్షకులను మైమరిపించింది. ఫస్ట్ బాల్ ఫోర్ తో మొదలు పెట్టి లాస్ట్ బాల్ సిక్స్ తో ముగించాడు. 20 ఓవర్ల పాటు క్రీజ్ లో నిలిచి ప్రతీ బంతిని చాలా కంట్రోల్ గా ఆడాడు.

ఒక్క బాల్ మాత్రమె అతనికి టాప్ ఎడ్జ్ అయి కీపర్ మీద నుంచి వెళ్ళింది గాని 5 సిక్సులు, 9 ఫోర్లలో ఏ ఒక్క షాట్ కూడా అతని కంట్రోల్ లో లేకుండా సింగిల్ కూడా వెళ్ళలేదు. ఆడినంత సేపు కూడా ప్రతీ బంతిని అంచనా వేసుకున్నాడు, ఫీల్డర్ ను చెక్ చేసుకుంటూ, చాలా జాగ్రత్తగా ఆడాడు. 60 బంతుల్లో 101 పరుగులు చేసాడు. సహచర ఓపెనర్ డుప్లేసిస్ క్రీజ్ లో నిలబడినట్టే నిలబడి, అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సీనియర్ ఓపెనర్ రైనా కూడా తక్కువ పరుగులకే అవుట్ అయ్యాడు.

ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన మోయీన్ అలీ తో కలిసి అర్ధ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసిన గైక్వాడ్, ఆ తర్వాత జడేజా తో కలిసి రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఎవరు అవుట్ అవుతున్నా సరే తన ఆటలో మాత్రం ఏ మార్పు లేకుండా విరుచుకుపడ్డాడు. సిక్సులు కొట్టిన విధానం చూసి క్రికెట్ అభిమానులు పండుగ చేసుకున్నారు. 20 వ ఓవర్లో 95 పరుగుల సమయంలో జడేజా స్ట్రైకర్ గా ఉండగా నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్నాడు. జడేజా భారీ షాట్ లతో ప్రత్యర్ధి మీద విరుచుకు పడుతున్నాడు. ఆ ఓవర్లో చివరి రెండు బంతులు మాత్రమే గైక్వాడ్ కు వచ్చాయి.

సెంచరీ చేస్తాడా లేదా అనుకుని అభిమానులు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయినా సరే అతనిలో మాత్రం ఏ మాత్రం బెరుకు లేదు. అటు ఇటు అయితే సెంచరీ మిస్ అవుతాను అనే కంగారు లేదు. సీనియర్ జడేజాతో నవ్వుతూ మాట్లాడాడు. ఒక బంతి ఓవర్ బౌన్స్ అయింది. అయినా సరే చివరి బంతిని చాలా పక్కాగా ఆడాడు. బలం అంతా ప్రయోగించి బాదాడు. ఏది ఏమైనా సరే అతని ఆట చూసిన క్రికెట్ విశ్లేషకులు చెప్పే మాట ఒక్కటే. ఇండియన్ క్రికెట్ కు కాబోయే వెన్నుముఖ అతడు. రోహిత్ శర్మ వారసుడుగా టీంలోకి రావాల్సిందే అనే కామెంట్ వినపడుతుంది. ఈ సీజన్ ఐపిఎల్ రెండో భాగం మొదటి మ్యాచ్ లో కూడా అతను చాలా బాగా ఆకట్టుకున్నాడు. ఆల్ ది బెస్ట్ గైక్వాడ్