iDreamPost
android-app
ios-app

CS Sameer Sharma, PRC – ఫిట్‌మెంట్‌ ఎంతో చెప్పిన సీఎస్‌ శర్మ

CS Sameer Sharma, PRC – ఫిట్‌మెంట్‌ ఎంతో చెప్పిన సీఎస్‌ శర్మ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న పీఆర్‌సీ అమలు తుది దశకు వచ్చింది. ఈ రోజు సీఎం వైఎస్‌ జగన్‌కు సీఎస్‌ సమీర్‌ శర్మ నేతృత్వంలోని కమిటీ పీఆర్‌సీ నివేదికను అందజేసింది. అనంతరం సీఎస్‌ సమీర్‌ శర్మ మీడియాతో మాట్లాడారు. పీఆర్‌సీ నివేదికలోని అంశాలను వివరించారు. దీంతో ఫిట్‌మెంట్‌ ఎంత ఉంటుదనే అంశంపై ఉద్యోగులకు ఓ స్పష్టత వచ్చింది. వివిధ రాష్ట్రాలు అమలు చేసిన పీఆర్‌సీలను పరిశీలించిన తర్వాత.. ఫిట్‌మెంట్‌ను సిఫార్సు చేశామని సీఎస్‌ తెలిపారు. 14.29 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫార్సు చేశామని తెలిపారు.

సచివాలయ ఉద్యోగులకు పీఆర్‌సీ అమలు..

దేశంలో తొలిసారి ఏపీలో అమలు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు సీఎం వైఎస్‌ జగన్‌ పెద్దపీట వేస్తున్నారు. సచివాలయాలు ఏర్పాటు చేసి రెండేళ్లు అయింది. ఉద్యోగుల ప్రొబేషనరీ కాలం కూడా ముగిసింది. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు కూడా పీఆర్‌సీ అమలు చేయాలని జగన్‌ సర్కార్‌ నిర్ణయించినట్లుగా ఉంది. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా.. సచివాలయ ఉద్యోగులకు కూడా పీఆర్‌సీ అమలు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. వీరితోపాటు హోం గార్డులకు కూడా పీఆర్‌సీ అమలు చేయాలని కమిటీ తన నివేదికలో పొందుపరిచింది.

10 వేల కోట్ల భారం..

కమిటీ చేసిన సిఫార్సుల ప్రకారం 14.29 శాతం ఫిట్‌మెంట్‌ను అమలు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా 9 నుంచి 10 వేల కోట్ల రూపాయల భారం పడనుందని సీఎస్‌ సమీర్‌ శర్మ తెలిపారు. పీఆర్‌సీ నివేదికను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. పీఆర్‌సీపై 72 గంటల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోందని తెలిపారు.

Also Read : సీఎం చేతిలో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగుల్లో ఉత్కంఠ..