Krishna Kowshik
Krishna Kowshik
విధుల్లో మానసిక ఒత్తిడి, ఇంట్లో సమస్యలు వెరసి పోలీసులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నెల జీతం అందకపోవడంతో చాంద్రాయణ గుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హోం గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న రవీందర్ ఈఎంఐలు, కుటుంబ ఖర్చులు ఉండటంతో మనస్తాపానికి గురై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. 55 శాతం కాలిన గాయాలతో తొలుత ఉస్మానియాకు ఆ తర్వాత డీఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి రవీందర్ కన్నుమూశాడు. రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదోని పట్టణానికి చెందిన కానిస్టేబుల్ సందీప్ కుమార్ బుధవారం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇప్పుడు తాజాగా మరో కానిస్టేబుల్.. తన ప్రాణాలను తీసుకున్నాడు.
కర్నూలుకు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. విధుల్లో ఉండగా బలవన్మరణానికి పాల్పడ్డాడు. కర్నూల్ లోకాయుక్త కోర్టులో హెడ్ కానిస్టేబుల్ బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడ్ని సత్యనారాయణగా గుర్తించారు. లోకాయుక్త కోర్టు భవనంలో విధులను నిర్వహిస్తున్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ తన దగ్గర ఉన్న గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాత్రూములోకి వెళ్లిన ఆయన గన్ తో కాల్చుకున్నాడు. పెద్ద శబ్దం రావడంతో తోటి ఉద్యోగులు వెళ్లి చూడగా.. రక్తపు మడుగుల్లో పడి ఉన్నాడు. ఆయన మృతిపై కారణాలు తెలియాల్సి ఉంది. సత్యనారాయణ మెడికల్ లీవ్‌లో ఉండి.. శుక్రవారమే విధుల్లోకి చేరారు. కొన్ని గంటలకే ఇలా చేసుకున్నారు. అంతలోనే ఆత్మహత్యకు చేసుకోవడంపై అనుమానాలకు రేకెత్తిస్తున్నాయి. అతని తండ్రి పోలీస్ అధికారిగా పనిచేసి పదవి విరమణ చేశారు. సత్యనారాయణకు భార్య, కుమార్తె, కొడుకు ఉన్నారు.