Idream media
Idream media
ఒక ఉద్యోగి జీవితాంతం సామాజిక సేవ చేసినందుకు అతని /ఆమె జీవిత చరమాంక దశలో సామాజిక భద్రత కింద కల్పించిన హక్కే ” పెన్షన్”. పాత పెన్షన్ విధానంలో ఉద్యోగి చివరి జీతంలో 50% పెన్షన్ గా ఇస్తారు. దీనికి అదనంగా కరువు భత్యం, గ్రాడ్యూడిటీ మరియు కమ్యూటేషన్ వస్తుంది. పాత పెన్షన్ విధానంలో ఉద్యోగి చనిపోతే అతని జీవిత భాగస్వామి (భార్య లేదా భర్త)కి,లేదా వారి పై ఆధారపడ్డ పిల్లలకు కుటుంబ పెన్షన్ వస్తుంది. నూతన పెన్షన్ విధానమును పరిశీలిస్తే సి.పి.ఎస్ ఉద్యోగి జీతంలో మూల వేతనం మరియు కరువు భత్యంలో నుండి 10 శాతమును మినహాయించి,దానికి సమానమైన మొత్తమును(ఈ ఆర్థిక సంవత్సరం నుండి 14 శాతం కు పెంపుదల) ప్రభుత్వం కలిపి నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటేడ్ లో ఉంచి PFRDA కింద ఫండ్ మేనేజర్ల ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు.
సి.పి.ఎస్ ఉద్యోగులు పెన్షన్ పొందే విధానం:
కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంలో ఉద్యోగి మరణించినప్పుడు అతని పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ (PRAN)లో జమ అయిన మొత్తం 100 శాతం చెల్లించినప్పటికీ, జీవిత భాగస్వాములకు కుటుంబ పెన్షన్ వర్తించదు.CPS ఉద్యోగి స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తే అతని PRANలో జమ అయిన మొత్తము నుండి 20 శాతం మాత్రమే చెల్లించి మిగిలిన మొత్తానికి సంబంధించి పెన్షన్ ను నిర్ధారించి స్టాక్ మార్కెట్లో షేర్ల రూపంలో పెట్టుబడి పెడతారు. సర్వీస్ పూర్తిచేసి పదవీ విరమణ చేసినప్పుడు PRANలో జమ అయిన మొత్తంలో నుండి 60శాతం చెల్లించి మిగిలిన మొత్తానికి పెన్షన్ ను నిర్ధారించి స్టాక్ మార్కెట్లో షేర్ల రూపంలో పెట్టుబడి పెడతారు. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోబడే CPS ఉద్యోగికి తన పెన్షన్ అందడమే ఈ వ్యతిరేకతకు కారణం.
CPS అంటే నో పెన్షన్ స్కీమ్:
నూతన పెన్షన్ పథకం CPS ప్రవేశపెట్టిన మొదట్లో పాలకులు ఉద్యోగులకు మీరు రిటైర్డ్ అయినప్పుడు భారీ మొత్తంలో అమౌంటు వస్తుందని భ్రమలు కల్పించారు.నూతన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం అమల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఒక ఉపాధ్యాయుడు మరణముతో ఆ కుటుంబానికి పెన్షన్ రాకపోవడంతో ఉపాధ్యాయ,ఉద్యోగులకు అందులోని డొల్లతనం అర్థమై సి పి ఎస్ అంటే “నో పెన్షన్ స్కీమ్” గా ఉద్యోగులు భావించడం జరిగింది.
సంఘాల పోరాటాలతో సాధించిన పాక్షిక విజయం:
ఉద్యోగుల పోరాటాలతో 26 ఆగస్టు 2016 నుండి ఆంధ్రప్రదేశ్,హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు నూతన విధానంలో “డెత్ కం గ్రాడ్యూడిటి” న 1 సెప్టెంబర్ 2014 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారికి వర్తింపజేస్తూ మార్పులు చేశారు.
ఎన్నికల సంవత్సరంలో ఉద్ధృతమైన సి.పి.ఎస్ వ్యతిరేక ఉద్యమం :
2008 సంవత్సరంలో CPS రద్దు ఉద్యమం ప్రారంభమై,CPS పరిధిలోని ఉద్యోగులు మరణిస్తే అతి తక్కువగా 1000 రూపాయల లోపు పెన్షన్ రావడం అంటే దాదాపు “నో పెన్షన్” గా మారడంతో 2016 చివరినాటికి తీవ్ర రూపం దాల్చి,ఎన్నికల సంవత్సరంలో ధర్నాలు,పాదయాత్రలు వంటి నిరసన కార్యక్రమాలతో ఉద్ధృతంగా సాగింది. అప్పటివరకు విడిగా పోరాటం చేస్తున్న ఉపాధ్యాయ సంఘాలు అన్నీ FAPTO గా ఏర్పడటంతో పాటు,ఉద్యోగ ఉపాధ్యాయ ఐక్యవేదిక JAC గా ఏర్పడి వివిధ రూపాలలో CPS రద్దు కోసం పోరాటం చేయడం జరిగింది.అయితే నాటి అధికార తెలుగుదేశం పార్టీ ఈ పోరాటాలలో భాగంగా ధర్నాకు పిలుపునిస్తే ఉపాధ్యాయ సంఘాల నాయకుల,కార్యకర్తల ఇళ్లపై ముందు రోజు రాత్రే దాడిచేసి పోలీసులు అరెస్టు చేయించడం వంటి చర్యలు ఉద్యోగస్తులలో ప్రభుత్వం పట్ల పెరుగుతున్న అసంతృప్తిని దృష్టిలో పెట్టుకొని నాటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గారి ఆధ్వర్యంలో సిపిఎస్ రద్దు అంశాల పరిశీలనకు కోసం ఒక కమిటీని వేసి చేతులు దులుపుకుంది.
సిపిఎస్ రద్దు 2019 శాసనసభ ఎన్నికలలో రాజకీయ నినాదంగా మారడం :
వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదటి రోజు నుండి ప్రతి బహిరంగ సభలో ఉద్యోగస్థుల పాలిట శాపంగా మారిన CPS రద్దు చేస్తానని ప్రకటించడంతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది.దీనితో ఉద్యోగస్థుల లో వైసిపి పార్టీ పట్ల ఏర్పడుతున్న సానుకూలతను గ్రహించి రాజకీయ నష్టాన్ని తగ్గించుకోవడానికి CPS రద్దుపై S.P.టక్కర్ కమిటీని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నియమించింది. కమిటీ నివేదికను ప్రభుత్వానికి సకాలంలో అందించిన ఆ ప్రతిపాదనలను ఆమోదించటం గాని,బహిర్గత పరచడం కానీ నాటి తెలుగుదేశ ప్రభుత్వం చెయ్యలేదు.
ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ కూడా మేనిఫెస్టోలో CPS రద్దును చేర్చినప్పటికీ ఉద్యోగులు చంద్రబాబు నాయుడు గారిని నమ్మలేదు. అన్ని రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోలో సిపిఎస్ రద్దును చేర్చడంతో ఉద్యోగస్థులు శాసనసభ ఎన్నికల్లో సిపిఎస్ రద్దును రాజకీయ నినాదంగా మార్చి, ప్రయోజనం పొందాలనే తమ కోరికను సాధించడంలో సఫలీకృతమయ్యారు.CPS వ్యతిరేకత ఫలితంగానే శాసనసభ-2019 ఎన్నికలలో ఉద్యోగ,ఉపాధ్యాయ వర్గాలు మాత్రమే వేసే పోస్టల్ బ్యాలెట్ లో దాదాపు 70 శాతం వైయస్సార్ పార్టీకి పోలై అధికారము తెలుగుదేశం పార్టీ నుండి వైసిపి హస్తగతం అయ్యింది.
సిపిఎస్ రద్దు కోసం నూతన వైసిపి ప్రభుత్వం చేస్తున్న కసరత్తు :
వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే క్యాబినెట్ లో CPS రద్దును అంగీకరిస్తూ, S.P.టక్కర్ కమిటీ రిపోర్ట్ ను అధ్యయనం చేయటానికి ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నియమించింది. ముగ్గురు మంత్రుల స్థాయి గ్రూప్ కు సలహా ఇవ్వటానికి అధికారులతో వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేసి ఈనెల 4వ తేదీ న ముందుగా నిర్ణయించినట్లు కాకుండా కాల పరిమితిని 30 జూన్ 2020 నుండి 31 మార్చి 2020 కు కుదించటం జరిగింది.
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే CPS రద్దు అవుతుందని ఆశించినప్పటికీ సాంకేతికపరమైన అడ్డంకులతో ఆరు నెలల కాలయాపన జరగడంతో ఉద్యోగ వర్గాలలో ఆందోళన నెలకొన్నది.కనీసం బడ్జెట్ సమావేశాలలోనైనా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమును రద్దు పరుస్తూ చట్టం చెయ్యాలని సుమారుగా లక్షా 75 వేల మంది CPS ఉద్యోగులతో పాటు, వైసీపీ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయ ఉద్యోగులు సుమారుగా లక్ష 30 వేల మంది కూడా తమ రెండు సంవత్సరాల అప్రెంటిస్ కాలం ముగిసిన తర్వాత సిపిఎస్ పరిధిలోకి వస్తారు.కాబట్టి రాష్ట్రంలో మూడు లక్షలకు పైగా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరే విధంగా CPS ను రద్దు చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకుంటే CPS ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల హృదయాలలో జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత స్థానం సాధిస్తారనటం అనేది వాస్తవం.