iDreamPost
android-app
ios-app

రామకృష్ణ లేఖ.. ఆక్రోశానికి ప్రతీక

  • Published Feb 05, 2022 | 11:34 AM Updated Updated Feb 05, 2022 | 11:34 AM
రామకృష్ణ లేఖ.. ఆక్రోశానికి ప్రతీక

పీఆర్సీ పై ఉద్యోగులు చేసిన ఆందోళనలో భాగంగా గురువారం విజయవాడలో నిర్వహించిన ర్యాలీని భగ్నం చేసేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేసిందని విమర్శించి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ప్రభుత్వంపై తన అక్కసును వెళ్లగక్కారు. ఉద్యోగుల ఆందోళనకు సంబంధించి ఆయన సీఎం జగన్‎మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఉద్యోగులను అడ్డుకోవడానికి మీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేసిందని, అయినప్పటికీ భారీ ఎత్తున ఛలో విజయవాడ జయప్రదమైందని లేఖలో ఆయన పేర్కొన్నారు.

జెండాలు వేరైనా.. అజెండాలు ఒకటే..

రాష్ట్రంలో ప్రతిపక్షాల జెండాలు వేరైనా వారందరిదీ చంద్రబాబునాయుడి అజెండాయేనని మరోసారి రుజువైంది. ఉద్యోగుల ఆందోళనపై టీడీపీ స్పందించిన దానికి జిరాక్స్ కాపీలా మొన్న జనసేన, నిన్న సీపీఐ ప్రతి స్పందించిన తీరే అందుకు ఉదాహరణ. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మొన్న విడుదల చేసిన ప్రకటనలో ఉద్యోగులను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారని, లాఠీఛార్జి చేశారని పచ్చి అబద్దాలను వల్లించారు. నిన్న రామకృష్ణ రాసిన లేఖలో ప్రభుత్వం ర్యాలీని భగ్నం చేయబోయిందని రాసేశారు. వీరిద్దరూ ఒకరు ప్రకటన రూపంలో, మరొకరు లేఖ ద్వారా ఒకరోజు వ్యవధిలో ఒకేలా స్పందించడం గమనార్హం. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు ఉద్యోగుల ర్యాలీని విజయవంతం చేయడానికి టీడీపీ, జనసేన, సీపీఐ తలో చేయి వేసి జనాన్ని తరలించాయని ఇప్పటికే వైఎస్సార్ సీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అందుకే ఉద్యోగులు సైతం ఆశ్చర్యపోయే స్థాయి ర్యాలీ విజయవంతం అయిందని చెబుతున్నారు.

ప్రభుత్వం నిర్భందిస్తే ఆ ప్రదర్శన సాధ్యం అయ్యేనా?

పవన్ కల్యాణ్, రామకృష్ణ ఆరోపిస్తున్నట్టు ప్రభుత్వం ఛలో విజయవాడకు వెళ్లే ఉద్యోగులను ఎక్కడికక్కడ నిర్భందిస్తే ఆ ప్రదర్శన సక్సెస్ అయి ఉండేదా అని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, వారిని తమ కుటుంబ సభ్యులుగా భావించి వారి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రుల కమిటీ చెబుతున్నా ప్రతిపక్షాలు వారిని రెచ్చగొట్టాలని చూడడం దారుణమని అంటున్నారు. రాష్ట్రానికి ఏమైనా సమస్యలు వస్తే వాటి పరిష్కారానికి సూచనలు, సలహాలు ఇవ్వాలి గాని ఇలా దిగజారుడు రాజకీయాలు చేయడం దురదృష్టకరమని అధికార పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : రేపటిలోగా అన్ని సమస్యలు పరిష్కారమవుతాయ్ – సజ్జల