iDreamPost
android-app
ios-app

సీపీఐ రామకృష్ణ స్వరం మారింది..! బాబుపై విమర్శలు.. జగన్‌పై పొగడ్తలు..

సీపీఐ రామకృష్ణ స్వరం మారింది..! బాబుపై విమర్శలు.. జగన్‌పై పొగడ్తలు..

సీపీఐ రామకృష్ణ స్వరం మార్చారా..? చంద్రబాబుకు సన్నిహితంగా ఉన్న ఈ కామ్రేడ్‌ ఆయనకు దూరంగా జరుగుతున్నారా..? అంటే తాజాగా రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు నిజమేనంటున్నాయి. వివిధ అంశాలపై రామకృష్ణ తన మనసులోని మాటను బయటపెట్టారు. కరోనా వ్యాప్తికి కుంభమేళా నిర్వహించడం, ఎన్నికలు జరపడమే కారణాలని ప్రధాని మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు.

బాబుపై విమర్శలు.. జగన్‌పై పొగడ్తలు..

అదే సమయంలో తాజా రాజకీయ పరిణామాలపై కూడా రామకృష్ణ మాట్లాడారు. జూమ్‌ మహానాడులో కేంద్రానికి దశల వారీగా మద్ధతు తెలుపుతామని టీడీపీ తీర్మానం చేయడాన్ని రామకృష్ణ తప్పుబట్టారు. అసలు ఈ తీర్మానమే హాస్యాస్పదమని విమర్శించారు. దశల వారీగా మద్ధతు అంటే.. ఏ ఏ అంశాలలో తెలుపుతారో టీడీపీ చెప్పగలదా..? అని ప్రశ్నించారు. జగన్‌మోహన్‌ రెడ్డిని తిడుతూ.. మోదీని పొగుడుతామంటే వినే జనం పిచ్చోళ్లుకాదన్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ రాష్ట్రాన్ని నాశసనం చేసిందని మండిపడ్డారు. రాజకీయం అంటే వాస్తవ పరిస్థితిని ధైర్యంగా మాట్లాడగలగాలని పరోక్షంగా చంద్రబాబుకు చురకలు అంటించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలకు సంక్షేమ పథకాలైనా ఇస్తున్నారని.. మోదీ ఆ పని కూడా చేయడం లేదంటూ ధ్వజమెత్తారు రామకృష్ణ.

గతానికి భిన్నం…

2019 ఎన్నికల్లో జనసేన పార్టీలో కలసి సీపీఐ, సీపీఎం పార్టీలు పోటీ చేశాయి. ఎన్నికల తర్వాత జనసేనాని బీజేపీ పంచన చేరగా.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు స్వంతంత్రంగా వ్యవహరిస్తుండగా.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి అయిన రామకృష్ణ చంద్రబాబు తనా అంటే తందానా అంటున్నారు. ఎన్నికల ముగిసిన తంతు.. రామకృష్ణ చంద్రబాబు మాట్లాడే ప్రతి అంశానికి మద్ధతుగా మాట్లాడుతున్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలను కూడా తోసిరాజని అభివృద్ధి వికేంద్రీకరణను వ్యతిరేకించారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతికి జై కొట్టారు. బాబు చేసిన ప్రతి ఉద్యమంలోనూ రామకృష్ణ పాల్గొన్నారు. ఆయన వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వచ్చినా.. ఏ మాత్రం వెనుకంజ వేయలేదు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్‌ కోసమే రామకృష్ణ.. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు.

బాబుతో పని కాదనుకున్నారా..?

బాబుతో స్నేహం ద్వారా కుమారుడు రాజకీయ భవిష్యత్‌కు బాటలు వేయాలని భావించిన రామకృష్ణకు.. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ భవిష్యత్‌పై క్లారిటీ వచ్చినట్లుంది. స్థానిక ఫలితాల తర్వాత నుంచి మెల్లగా చంద్రబాబుకు దూరం జరగడం ప్రారంభించారు రామకృష్ణ. అదే సమయంలో టీడీపీలో నాయకత్వ మార్పును ఆ పార్టీ శ్రేణులు కోరుకున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ను దించాలంటూ చంద్రబాబుతోనే పలువురు కార్యకర్తలు కుండబద్ధలు కొట్టారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి నేతలు.. జూనియర్‌ ఎన్టీఆర్‌కు కీలక బాధ్యతలు అప్పగించాల్సిన సమయం వచ్చిందని మనసులోని మాటను బయటపెట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో రామకృష్ణ.. చంద్రబాబుకు దూరంగా జరుగుతున్నారనేది ఓ విశ్లేషణ.