Idream media
Idream media
కాలం మారినా కమ్యూనిస్టులు మారరు. వాళ్ల పిల్లలంతా అమెరికాలో చదువుకుంటూ వున్నా ప్రపంచంలో వస్తున్న మార్పులు అర్థంకావు. పిడివాదంతో పట్టువిడుపులు లేకుండా మాట్లాడుతుంటారు. బిగ్‌బాస్‌ని బ్రోతల్ హౌస్‌తో పోల్చడం సీపీఐ నారాయణకి తగని పని. ఎందుకంటే అక్కడ పాల్గొంటున్న వాళ్లలో చాలా మందికి కుటుంబాలున్నాయి, పిల్లలున్నారు. వాళ్లని గాయపరచడం కరెక్ట్ కాదు. కౌగలించుకోడానికి, ముద్దులు పెట్టుకోడానికి బిగ్‌బాస్ హౌస్ అక్కర్లేదు. బయట చాలా ప్రపంచముంది. కెమెరాలు కూడా వుండవు.
ఇది మన సంస్కృతి కాదు అనుకునే వాళ్లు నారాయణతో పాటు చాలా మంది వున్నారు. ఇదే రాబోయే సంస్కృతి అనుకునే వాళ్లు అంతకు మించి వున్నారు. సంస్కృతి అనేది నదిలోని నీళ్లలా మారుతూ వుంటుంది. కొత్తవి వస్తే , పాతవి వెళుతూ వుంటాయి. దీన్ని అర్థం చేసుకోకపోతే మన ప్రమేయం లేకుండానే మనం తాలిబన్లగా మారుతున్నామని అర్థం. మన దేశంలో కూడా తాలిబన్ల సంఖ్య తక్కువేం కాదు. అయితే ఇంకా ఆధిపత్య స్థాయికి రాలేదు , అంతే.
విదేశాల నుంచి లక్షలాది మంది పంపే డబ్బు మాత్రం మనకి కావాలి. అక్కడ్నుంచి వచ్చే సంస్కృతి అక్కర్లేదు అంటే కుదరదు. 25 ఏళ్ల క్రితం KFCని తరిమేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు అనంతపురం లాంటి చిన్న వూళ్లో కూడా KFC వుంది. బెంగళూరులో అందాల పోటీలు నిషేధించాలని ధర్నాలు చేశారు. ఈ తరం వాళ్లకి అది వింటే కామెడీగా వుంటుంది. బిగ్‌బాస్‌ని వద్దంటాం సరే , యూట్యూబ్, ఫేస్‌బుక్, గేమ్స్ , షార్ట్ వీడియోస్ వీటి సంగతేంటి? పబ్జీని తరిమేశారు. ఇంకో రూపంలో వచ్చింది.
బిగ్‌బాస్ ఒక సైకలాజికల్ గేమ్. బయట ఏం జరుగుతోందో అక్కడ అదే. తొందరగా స్నేహం, అంతే స్థాయిలో శత్రుత్వం, గ్రూపులు కట్టడం. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పడం. కార్పొరేట్ ఉద్యోగాలు, డిజిటల్ స్నేహాలు వచ్చిన తర్వాత పరస్పర నమ్మకం , విశ్వాసం పోయింది. తెలిసో తెలియక అందరూ గేమ్ ఆడుతున్నారు. వ్యాపారాల్లో, ఆఫీసుల్లో జరుగుతున్నది ఇదే. అక్కడ సందర్భం వస్తేనే మేకప్ తుడిచేసుకుని అసలు రూపం చూపుతారు. బిగ్‌బాస్‌లో నటించడానికి వీల్లేదు. బిగ్‌బాస్ ఊరుకోడు. ఏదీ ఒక టాస్క్ పెడతాడు.
చెక్క కుర్చీలో కూచొని , గోడ గడియారాన్ని చూసుకుంటూ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే కాలం పోయింది. బయట బతకాలంటే యుద్ధం చేయాలి. విపరీతమైన పోటీ. కెరీర్‌లో ఎదగాలంటే తెలివి వుండాలి, ఎత్తుగడలుండాలి. ఉద్యోగ నైపుణ్యం వుంటే చాలదు. ఇంకా చాలా స్కిల్స్ కావాలి. వృద్ధాప్యమే నాయకత్వ అర్హత అనుకోడానికి ఈ ప్రపంచం రాజకీయ పార్టీ కాదు. అది ఒక కమర్షి యల్ వరల్డ్. నారాయణ అనుకుంటున్న ప్రపంచం ఆయన ఊహల్లో వుంది. వాస్తవంలో కాదు. ఇప్పటి పిల్లలకి విప్లవం అనే పదానికి అర్థం కూడా తెలియదు. వెజిటబుల్ పలావ్‌కి అది షార్ట్ కట్ అని అనుకోగలరు.
బిగ్‌బాస్‌లో చూడాల్సింది మానవ ప్రవర్తన, కొత్త తరం ఆలోచనా సరళి. వాళ్ల హగ్‌లు కాదు. ఇప్పటి పిల్లల్లో అది కామన్. మన కాలంలో లాగా జండర్ పరిధి స్నేహాలు కాదు. జండర్‌ని పట్టించుకోరు. మనో వికారాలు అంటని వాళ్లు. ఒకవేళ ఎవరి మీదైనా ఇష్టం వుంటే Openగా చెబుతారు. మనలా కవిత్వంతో కూడిన పొడుగాటి ప్రేమలేఖలు వాళ్లకవసరం లేదు. నచ్చితే డేటింగ్ చేస్తారు. ok అనుకుంటే పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత ఏదైనా తేడా వస్తే విడిపోతారు. పాతకాలంలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ షష్టిపూర్తి వరకూ జీవించి మళ్లీ పెళ్లి చేసుకోరు.
నచ్చినా నచ్చకపోయినా దీన్ని ఆమోదించాలి. శిలావిగ్రహాల్లా అడ్డు తగులుతామంటే పక్కకు తోసేస్తారు. అన్ని కాలాల్లో యువతరం ఇలాగే వుంటుంది, అంతకు ముందున్న అభిప్రాయాలకు విరుద్ధంగా.
మా కాలంలో AISF జెండాలు మోసి రోడ్ల మీద ధర్నాలు చేశాం. భుజాలు కాయిలు కాశాయి. కళ్లు కూడా కాయలు. 40 ఏళ్లలో రాయలసీమకు సరిపడా నీళ్లైనా తెచ్చుకోగలిగామా?
కాలంతో పాటు మారని వాళ్లు టీవీల్లో ప్రవచనకారులుగా మిగిలిపోతారు.