iDreamPost
android-app
ios-app

చర్చల్లో చిత్తశుద్ధి ముఖ్యంకానీ ఎక్కడ జరిగితే ఏమిటి?

  • Published Feb 09, 2022 | 2:27 PM Updated Updated Feb 09, 2022 | 2:27 PM
చర్చల్లో చిత్తశుద్ధి ముఖ్యంకానీ ఎక్కడ జరిగితే ఏమిటి?

సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి సంబంధించి ఫిల్మ్ చాంబర్‌తో మాత్రమే ఏపీ ప్రభుత్వం చర్చలు జరపాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గురువారం సినీ పరిశ్రమ ప్రముఖులతో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చర్చలు జరుపనున్న నేపథ్యంలో నారాయణ చేసిన వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి. చర్చలు ప్రారంభం కాకముందే నారాయణ ఒక నిర్ణయానికి వచ్చేసి వ్యక్తులతో చర్చలు జరిపితే రావణ కాష్టం మాదిరిగా సమస్య రగులుతూనే ఉంటుందని అనడం చిత్రంగా ఉంది. ప్రభుత్వం డివైడ్ అండ్ రూల్ పాలసీని ఆపాలని డిమాండ్ చేసి ఆయన జగన్ సర్కారుపై తనకున్న అక్కసును బయట పెట్టుకున్నారు.

సినీ పరిశ్రమను విభజించి సీఎం ఏం బావుకుంటారు?

సామాన్యుల మేలు కోరి ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను తగ్గించింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై ఒక కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఆ మధ్య చిరంజీవితో సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించిన ముఖ్యమంత్రి జగన్.. ఇప్పుడు పరిశ్రమ ప్రముఖులతో భేటీ కావాలనుకోవడాన్ని నారాయణ తప్పుపట్టడం దేనికో అర్థం కాదు. సినీ పరిశ్రమలో చీలికలు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందంటూ నిర్హేతుక ఆరోపణలు చేయడం ఏమిటి? దానివల్ల ప్రభుత్వానికి కానీ, సీఎంకు కానీ ఒనగూరే ప్రయోజనం ఏమిటి?

సీఎం వ్యాఖ్యలు నిజమనిపించేలా నారాయణ ధోరణి…

జగనన్న చేదోడు లబ్ధిదారులకు సొమ్ము జమ చేసే సందర్భంగా మంగళవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాల తీరును ఎండగడుతూ చేసిన ప్రసంగం నిజం అని నిరూపించేలా నారాయణ ధోరణి ఉంది. ఎర్ర జెండాల వెనుక పచ్చ ఎజెండా ఉందని ఆయన వ్యాఖ్యానించినట్టుగానే రాష్ట్రంలో పరిస్థితి ఉంది. ఉద్యోగుల్లో విభజన తీసుకొచ్చి సమస్య పరిష్కారమైనట్టు చెప్తున్నారని, ఉద్యోగుల మాదిరే.. సినీ పరిశ్రమ పరిస్థితి తయారవుతోందని నారాయణ కామెంట్ చేయడమే ఇందుకు నిదర్శనం.

పచ్చ ప్రచారానికి ఎర్ర నేతృత్వమా?

చంద్రబాబు శాసిస్తే.. మిగిలిన పార్టీలు పాటిస్తాయి అన్నట్టు ఉంది రాష్ట్రంలో రాజకీయం. ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు సఫలమై సమస్య పరిష్కారం కావడాన్ని తట్టుకోలేకపోతున్న చంద్రబాబు అన్ని పార్టీల నేతలతో సర్కారుపై అడ్డగోలు విమర్శలు చేయిస్తున్నారు. టీడీపీ నేతలతోపాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్, సీపీఐ రామకృష్ణ చర్చల సందర్భంగా ప్రభుత్వం ఉద్యోగులను బెదిరించినట్టు నిరాధార ఆరోపణలు చేశారు. ఇప్పుడు నారాయణ అదే పల్లవి అందుకున్నారు. దానికి తన సృజనాత్మకను జోడించి సినీ పరిశ్రమలో చీలికకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు ఎర్ర రంగు పులుముతున్నారు. అసలు ఉద్యోగుల్లో చీలిక తీసుకొచ్చిందే సీపీఐ. ఆ పార్టీ అనుబంధ విభాగమే చర్చల సందర్భంగా తలఊపి బయటకు వచ్చాక ప్లేట్ ఫిరాయించింది. దాన్ని పట్టుకొని పచ్చ రచ్చ మొదలు పెట్టారు. నారాయణ దానికి దరువు వేయడమే కాకుండా సినీ పరిశ్రమలో చీలికలు అంటూ వ్యాఖ్యలు చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అని వైఎస్సార్ సీపీ నేతలు విమర్శిస్తున్నారు. చర్చల్లో చిత్తశుద్ధి ముఖ్యంకాని అవి ఎక్కడ జరిగితే ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా సానుకూల దృక్పథంతో ఉండే సీఎం జగన్ సినిమా రంగ సమస్యలను పరిష్కరిస్తారని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు.