iDreamPost
iDreamPost
నేటి రాజకీయాల్లో సిద్ధాంతాలు పాటించాలని కోరుకోవడం, ఎన్ని విభేదాలు, వైరుధ్యాలు ఉన్నా ప్రత్యర్థులను గౌరవించాలని ఆశించడం అత్యాశే అవుతుంది. అయితే మిగతా పార్టీల పరిస్థితి ఎలా ఉన్నా.. సిద్ధాంతాలు..వామపక్ష భావాలు పునాదిగా పనిచేసే కమ్యూనిస్టు పార్టీల నేతలు ఇప్పటికీ వాటిని అనుసరిస్తున్నారన్న భావన ఉండేది. కానీ ఉభయ కమ్యూనిస్టు పార్టీల్లో ఒకటైన సీపీఐ రాష్ట్ర నేతలు తాము కూడా ఇతర పార్టీల నేతల్లాంటివారమేనని తమ మాటలు, చేతలతో నిరూపిస్తున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎప్పుడో టీడీపీ మద్దతుదారుడిగా మారిపోతే.. తాజాగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ తన సహజ సిద్ధమైన వాచాలత్వంతో వామపక్షవాదులు, సభ్య సమాజం హర్షించలేని రీతిలో మాటలు తూలారు. సంస్కారాన్ని వదిలేసి ముఖ్యమంత్రి సతీమణిని కూడా తన విమర్శల రొచ్చులోకి లాగారు.
మహిళలను కించపరచడమే..
తిరుపతి సీపీఐ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన నారాయణ.. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, డ్రగ్స్, విద్యుత్ సంక్షోభం, మోదీ ప్రభుత్వ విధానాలపై స్పందించారు. ఒక పార్టీ నేతగా రాష్ట్ర, జాతీయ అంశాలపై ఆయన తన అభిప్రాయాలు, అభ్యంతరాలు వ్యక్తం చేయడంలో తప్పులేదు. ప్రభుత్వ విధానాలను ఆక్షేపించడం, ఆరోపణలు చేయడంలో కూడా అభ్యంతరం లేదు. కానీ ఈ సందర్బంగా ఆయన ముఖ్యమంత్రి జగన్ సతీమణిని ఇందులోకి లాగడం తీవ్ర అభ్యంతరకరమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయంగా సీఎంను, ఇతర ప్రభుత్వ ప్రతినిధులను ఎంతైనా విమర్శించవచ్చు.
Also Read : TDP Ayyanna Patrudu – అయ్యన్నపాత్రుడు ఇక అంతేనా..?
కానీ వీటితో ఏమాత్రం సంబంధంలేని మహిళను, ఏకంగా సీఎం సతీమణిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆయనలోని సంస్కారహీనతను, నోటి దురుసుతనాన్ని బయటపెట్టాయి. ఉచ్చనీచాలు, విచక్షణ మరిచి మాటలు తూలడం సీనియర్ నేత అయిన నారాయణ స్థాయిని దిగజార్చిందని అంటున్నారు. సీఎంను ఎన్నైనా అనవచ్చు.. కానీ రాజకీయాలతో సంబంధం లేని ఆయన సతీమణిని ప్రస్తావించాల్సిన అవసరం ఏం వచ్చిందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నారాయణ వ్యాఖ్యలు మొత్తం మహిళాలోకాన్ని కించపరిచేలా ఉన్నాయి. అసలు నారాయణకు మతి ఉందా..? అనే సందేహం కూడా అయన చేసిన వ్యాఖ్యల వల్ల కలుగుతోంది.
సిద్ధాంతాలు టీడీపీకి తాకట్టు
సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే సీపీఐ పార్టీని గతంలో నారాయణ, ఇప్పుడు రామకృష్ణ టీడీపీకి తాకట్టు పెట్టేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లో టీడీపీ నేతలు ఇటీవలి కాలంలో హద్దులు మీరి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ఆ పార్టీకి వంతపాడుతున్న సీపీఐ నేతలు విమర్శలు, ఆరోపణల్లోనూ టీడీపీ నేతలనే అనుసరిస్తున్నారు. సీపీఐ నారాయణ మరింత రెచ్చిపోయి.. సీఎం సతీమణిపై అనుచిత వ్యాఖ్యలతో తన స్థాయిని తానే దిగజార్చుకున్నారు. వ్యక్తిగతంగా, ఒక జాతీయ పార్టీ నేత స్థాయిని కోల్పోయి పాతాళంలోకి జారిపోయారు. రాజకీయ విమర్శలు చేసేముందు, ఎదుటివారి గురించి మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలని సభ్యతను కూడా మర్చిపోయి.. నారాయణపైనే కాదు ఆ పార్టీపైనా గౌరవభావాన్ని పోగొట్టినట్లు అయ్యింది.
Also Read : Maoist RK – మావోయిస్టు అగ్రనేత ఆర్‌కే ఇక లేరు..?