iDreamPost
android-app
ios-app

టీడీపీ మొద‌లుపెట్టింది.. సీపీఐ సాగిస్తోంది..!

టీడీపీ మొద‌లుపెట్టింది.. సీపీఐ సాగిస్తోంది..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో టీడీపీ, సీపీఐ రాజ‌కీయాలు విచిత్రంగా ఉంటున్నాయి. అనుకోని చేస్తున్నాయో, యాధృచ్చిక‌మో ఒకే స‌బ్బెక్టును ఎంచుకుంటున్నాయి. పంచాయ‌తీ ఎన్నిక‌లు, దేవాల‌యాల‌పై దాడులు, రాజ‌ధానులు, పోల‌వ‌రం, ర‌ఘురామ‌కృష్ణంరాజు.. ఇలా అంశం ఏదైనా రెండు పార్టీలూ ఒకే స్టాండ్ పై నిల‌బ‌డుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఆస్తి పెంపు అంశాన్నిరాజ‌కీయం చేస్తున్నాయి.

ఏపీలో ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీతో ఎవ‌రూ క‌లిసి రావ‌డం లేదు. మ‌హానాడు లో కేంద్రానికి మ‌ద్ద‌తుగా టీడీపీ తీర్మాణం చేయ‌డాన్ని మిన‌హా ఆ పార్టీ ప్ర‌భుత్వ వ్య‌తిరేక నిర్ణ‌యాల‌కు సీపీఐ కూడా ఒత్తాసు ప‌లుకుతూ వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో టీడీపీ, సీపీఐ క‌వ‌ల పిల్ల‌ల‌న్న విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. పేద ప్రజలు, రాష్ట్ర సమస్యల కోసం పోరాటాలు చేసేవి.. వామపక్షాలు. కానీ రామకృష్ణ ఇప్పుడు అందుకు విరుద్ధంగా టీడీపీ కోసం పోరాటం చేస్తున్నార‌ని వైసీపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో కూడా ఆ పార్టీ అలాగే వ్య‌వ‌హ‌రించింది. గ‌తంలో ప్రాజెక్టు వద్దకు వంద మందితో వెళ్లి రచ్చ చేసింది.

ఆస్తి ప‌న్నుపెంచ‌మ‌ని మాటిచ్చి ప్ర‌భుత్వం ఇప్పుడు ప‌న్ను పెంచిందంటూ ఆరోపిస్తూ తెలుగుదేశం ప్ర‌క‌ట‌న‌లు చేస్తోంది. నాలుగు రోజుల క్రితం ప‌లు చోట్ల ఆందోళ‌న కూడా చేప‌ట్టింది. ఇప్పుడు దానికి కొన‌సాగింపుగా సీపీఐ కూడా ఆందోళ‌న బాట ప‌ట్టింది. రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. సమావేశం లో పాల్గున్న సీపీఐ రామకృష్ణ, సీపీఎం మధు, టీడీపీ గద్దె రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ స‌మావేశంలో సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ… ప్రభుత్వం అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరిక‌లు జారీ చేశారు. మున్సిపల్ ఎలక్షన్ సమయంలో పన్నులు పెంచబోమని చెప్పి…ఎన్నికలు ముగిశాక పన్నులు పెంచడం ఎంత వరకు సబబు అని ప్ర‌శ్నించారు.

టీడీపీ, సీపీఐ ఆరోప‌ణ‌లపై తాజాగా వైసీపీ మంత్రి బొత్స మాట్లాడుతూ, “కొత్తగా పన్నులు పెంచారని మాట్లాడుతున్నారు. మీ మనసాక్షిగా చెప్పండి. ఎన్నికల ముందు పన్నుల గురించి ప్రకటన చేయలేదా?. గతంలో అసెంబ్లీలో తానే మాట్లాడాను. ప్రతిపక్ష సభ్యులు కూడా పన్నుల గురించి మాట్లాడారు కదా? ఈ రోజు మేం కొత్తగా తీసుకువచ్చినట్లు పత్రికలు కథనాలు రాస్తున్నాయి.” అని వ్యాఖ్యానించారు. నివాసం ఉన్న భవనాలకు 0.10 నుంచి 0.50 వరకు, నివాసం కాని భవనాలకు 0.20 నుంచి 2 శాతం వరకు పన్నులు వసూలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలపై భారం పడటానికి వీల్లేదని, వారికి మంచి చేసేందుకు 15 శాతానికి మించకుండా పన్ను ఉండేలా చట్టాన్ని చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ సూచించారని.. ఆ ప్రకారమే చట్టం చేశామని బొత్స వెల్లడించారు. ఇదిలా ఉంటే, ఆస్తి ప‌న్ను పెంచారంటూ టీడీపీ ప్రారంభించిన పోరాటాన్ని సీపీఐ కొన‌సాగిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Also Read : పశ్చిమ టీడీపీని పలకరించేవారే లేరు..పార్టీ ఆఫీసు కూడా వెలవెల