iDreamPost
iDreamPost
వైరస్ ద్వారా ప్రబలే వ్యాధుల విషయంలో అలల మాదిరిగా (వేవ్స్) జనసమూహాలపై విజృంభిస్తుంటుంది.. ఇది నిపుణులు చెబుతున్నమాట. అంటే వ్యాధి రావడం, వ్యాప్తిచెందడం, విస్తృతంగా వ్యాపించడం, తరువాత కొంచెం తగ్గుముఖం పట్టడం.. ఆ తరువాత మళ్ళీ తిరగబడడం అనే ఈ సైకిల్‌ను నిపుణులు వేవ్‌గా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్ 19 పట్ల కూడా వైద్య రంగ నిపుణులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వ్యాధిని గురించి ఇప్పటి వరకు వచ్చిన అన్ని నివేదికలు, విశ్లేషణలు సైతం దీనిని ఖరారు చేస్తున్నారు. కోవిడ్ విషయంలో ముందుగానే బాధితులుగా నిలబడ్డవి యూరప్ దేశాలు. ఆ తరువాత ఆసియా, ఆఫ్రికా దేశాలు వరుస జాబితాలో ఉన్నాయి. మరణాల లెక్కల విషయంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ వ్యాధి వ్యాప్తి విఫంలో వేవ్స్ అన్ని దేశాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు యూరప్‌దేశాల్లో వ్యాధి తన విస్తృతస్థాయిని ప్రదర్శిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో అమెరికాలాంటి దేశాల్లో నిముషానికి ఒకరు మృత్యువాత పడుతున్నారని వివరిస్తున్నారు.
తరువాత వరుసలో ఉన్న ఆఫ్రికా, ఆసియా దేశాలు కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొవాల్సిందేనా? అన్న అనుమానాలు ఇప్పుడు ఎక్కువవతున్నాయి. యూరప్ వంటి దేశాలతో పోలిస్తే ఆసియా, ఆఫ్రికాల్లో మరణాల రేటు తక్కువగా ఉందని అంచనాలు చెబుతున్నాయి. అయినప్పటికీ ఈ లెక్కలపై భిన్నాభిప్రాయాలు కూడా లేకపోలేదు. పోస్ట్‌కోవిడ్ సింప్టమ్స్ కారణంగా మృతి చెందిన వారిని కోవిడ్ మృతుల్లో చేర్చలేదన్న వాదన ఒకటి విస్తృతంగా విన్పిస్తోంది. అందువల్లనే ఆసియా, ఆఫ్రికా దేశాల్లో మరణాల సంఖ్య తక్కువగా ఉంటోందని వివరిస్తున్నారు. నిజానికి కోవిడ్ చికిత్సను ఆయా దేశాల ప్రభుత్వాల పరిధిలోని ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో తొలత 28 రోజులు, ఆ తరువాత 15, కొన్నాళ్ళకు 7 రోజులకు కుదించారు. ఆ తరువాత కూడా కోవిడ్ సంబంధిత లక్షణాలతో మృతి చెందినప్పటికీ ఆ మృతులను కోవిడ్ మృతులుగా పరిగణించలేదని పలువురు నిక్కచ్చిగానే చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వాలు ఎక్కడా నోరుమెదపడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం ఎన్నో వేవ్ దశలో కోవిడ్ ఉందన్న దానిపై కూడా అనేక అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఏదో ఒక వేవ్ నడుస్తూనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ ఇదే నిజమైన పరిస్థితుల్లో యూరప్ గుణపాఠాన్ని గుర్తెరిగి అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత అన్ని దేశాలపైనా ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు.
వ్యాక్సిన్ కోసం ఇప్పటికే ధనికదేశాలు, ఇతర దేశాల మధ్య అప్రకటిత పోటీ నెలకొంది. ధనిక దేశాలు తమ దేశ జనాభాకంటే కొన్ని రెట్లు ఎక్కువ వ్యాక్సిన్‌ల కోసం ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చినట్లుగా సోషల్ మీడియా కోడైకూస్తోంది. దీనిపై డబ్లు్యహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ ఈ ధోరణి కరెక్టు కాదని, తద్వారా వ్యాక్సిన్ ధరలను పెంచడం తప్పితే కోవిడ్‌ను ఏ మాత్రం అడ్డుకోలేమని తేల్చి చెప్పేసారు. వ్యాక్సిన్ ఇంకా రాకుండానే ఈతరహా పోటీ ఉంటే, రేపు వచ్చాక ఇక పరిస్థితి ఎలా ఉంటుందో? అంచనా వేయడం కూడా కష్టమే.
ఇటువంటి తరుణంలో అప్రమత్తత ఒక్కడే మార్గమని, ఈ అప్రమత్తత కోవిడ్ పూర్తిగా కనుమరుగయ్యేంత వరకు కొనసాగాల్సిందేనని నిపుణులు తేల్చిచెప్పేస్తున్నారు. అంటే మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం, జన సమూహాలకు దూరంగా ఉండడం, ఏ మాత్రం లక్షణాలు ఉన్నా అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించడం వంటివి భవిష్యత్తులో కూడా కొనసాగించాల్సి రావొచ్చని కుండబద్దలు కొట్టేస్తున్నారు.