iDreamPost
android-app
ios-app

WHO కూడా భ‌య‌పెడుతోంది కానీ..!

WHO కూడా భ‌య‌పెడుతోంది కానీ..!

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ శంషాబాద్ ఎయిర్ పోర్టును బుధ‌వారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. కేంద్రం నుంచి వ‌చ్చిన ఆదేశాల నేప‌థ్యంలో ఆమె ఈ త‌నిఖీ చేసిన‌ట్లు తెలుస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ క‌ల‌క‌లం నేప‌థ్యంలో ఎయిర్ పోర్టులో ఎటువంటి చ‌ర్య‌లు తీసుకున్నారు, విదేశాల నుంచి వ‌స్తున్న ప్ర‌యాణికుల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉంటున్నారా లేదా అనేది ప‌రిశీలించారు. ఎయిర్ పోర్టులోని కొవిడ్ సెంట‌ర్ల‌ను త‌నిఖీ చేశారు. అంతేకాదు.. గురువారం నుంచి వ‌చ్చే విదేశీ ప్ర‌యాణికుల‌కు ఆర్టీపీసీఆర్ త‌ప్ప‌నిస‌రి చేశారు.

అలాగే, తెలంగాణ మునిసిప‌ల్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి ట్విట్ట‌ర్ ద్వారా బుధ‌వారం ఓ సందేశం పంపారు. ట్యాంక్ బండ్ పై ఈ ఆదివారం అంటే అయిదో తేదీన సండే ఫ‌న్ డే నిర్వ‌హించ‌డం లేద‌ని దాని సారాంశం. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేర‌కు సెప్టెంబ‌ర్ 12 నుంచి ప్ర‌తీ వారం ట్యాంక్ బండ్ పై ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ప్ర‌తీ ఆదివారం భారీ సంఖ్య‌లో న‌గ‌ర‌వాసులు ఇక్క‌డికి వ‌చ్చి సంద‌డి చేస్తున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు. అయితే.. ఈ వారం నుంచి ఈ కార్య‌క్ర‌మం ర‌ద్దు చేస్తున్న‌ట్లు అక‌స్మాత్తుగా ప్ర‌క‌టించారు. అందుకు కార‌ణం ఒమిక్రాన్ క‌ల‌క‌లం.

డబ్ల్యూహెచ్ ఓ ఏం చెబుతోంది..

పై రెండు ఘ‌ట‌న‌లూ.. క‌రోనా ప్రారంభం నాటి రోజులు మ‌ళ్లీ వ‌స్తున్నాయా.. అనే విధంగానే ఉన్నాయి. కొత్త వేరియంట్ తో రాష్ట్రాలు అప్ర‌మ‌త్తం అవుతున్నాయి. స్థానికంగా త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ఇప్పుడు వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ హెచ్చ‌రిక‌లు భ‌య‌పెట్టేలానే ఉన్నాయి. డెల్టా కంటే ఇది అత్యంత వేగంగా సోకే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ వో ప్రతినిధులు సైతం పేర్కొంటున్నారు. సౌతాఫ్రికా నుంచి ఇండియాకు వచ్చిన వ్యక్తులను పరీక్షించగా కొందరికి పాజిటివ్ వచ్చింది. అయితే వారిలో ఉన్న ఒమిక్రాన్ కాదని తేల్చారు. అయినా ఇతర దేశాల నుంచి వచ్చేవారిపై కఠిన నిబంధనలు విధించనున్నారు.

Also Read : YSR Aarogyasri Scheme – ఎగువ మధ్య తరగతికి ఆరోగ్యశ్రీ.. పరిమితిని పెంచిన జగన్ సర్కార్

నిపుణుల భిన్న స్వ‌రం

సౌతాఫ్రికాలోని బోట్స్ వానాలో ‘ఒమిక్రాన్’ ను గుర్తించారు. ఆ తరువాత యూకెలోని ఇద్దరిలో ఈ వేరియంట్ ను గుర్తించినట్లు ఆ దేశం తెలిపింది. భారత్ లో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదని కేంద్రం తెలిపింది. అయితే సౌతాఫ్రికాలో ఒమిక్రాన్ సోకిన వారికి అనారోగ్యం బారిన పడ్డారని మరణాలు సంభవించలేదని అక్కడి వైద్యులు తెలిపారు. అంతేకాకుండా ఇది సోకిన వారిలో స్వల్ప లక్షణాలు ఉంటాయని ప్రాణాంతకం కాదని దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ చైర్ పర్సన్ డాక్టర్ ఏంజిలిక్ కొట్టి తెలిపారు. ప్రస్తుతం ఉన్న స్థాయిలో ఆందోళన చెందాల్సిన అవరం లేదని అయితే రూపాంతరం చెందితే మాత్రం ప్రాణాంతకంగా మారనుందని అంటున్నారు.

వ్యాక్సిన్లు ర‌క్ష‌ణ ఇస్తాయా అనేది చెప్ప‌లేర‌ట‌

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాత్రం భిన్నంగా స్పందించింది. ఒమిక్రాన్ వ్యాప్తి ఇప్పుడే మొదలైంది. దీని నుంచి వ్యాక్సిన్లు రక్షిస్తాయా..? లేదా..? అనే ది ఇప్పుడే చెప్పలేం. కానీ దాని వ్యాప్తి మాత్రం వేగంగానే ఉంది. అయితే లక్షణాలు తక్కువగానే ఉన్నాయని మాత్రం కొట్టిపారేయలేం. కరోనా జాగ్రత్తలు మాత్రం పాటించాల్సి ఉంటుంది. పాతవాటికంటే ఇది తీవ్ర అనారోగ్యానికి గురిచేస్తుందా..? లేదా అనే విషయం కూడా చూడాలి. మరోవైపు దీనిపై వ్యాక్సిన్ల ప్రభావం ఎంత ఉంటుందనేది కూడా అంచనా వేస్తున్నారు. అయితే తేలికగా తీసుకొని నిర్లక్ష్యం చేస్తే పెద్ద ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే కొందరు వైద్య నిపుణులు మాత్రం రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్నా ఇది ఒమిక్రాన్ సోకే అవకాశాలు ఎక్కువే ఉన్నాయని అంటున్నారు. కానీ ప్రపంచవ్యాప్త డేటా మాత్రం అప్పుడే తొందరపాటు వద్దని అంటోంది. కనీసం రెండు వారాలు వెయిట్ చేస్తే దాని ప్రభావం చెప్పొచ్చని అంటున్నారు.

కంగారు పడొద్దు..

” డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ సోకిన వారిలో ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉంటుంది. డెల్టా వేరియంట్ లాంటి పరిస్థితులు మాత్రం లేవు. అయితే అక్కడి రిపోర్టులు చూస్తే మాత్రం వ్యాప్తి ఉందని అర్థమవుతోంది. కానీ అంత ప్రమాదకరం కాదని తెలుస్తోంది. కనుక ప్రజలు అనవసరమైన వదంతులు నమ్మి కంగారు పడొద్దు. ఇది చాలా ప్రమాదకరం అని చెప్పడానికి ఏం లేదు. అయితే ఇది వేగంగా వ్యాప్తి చెందుతోన్న కారణంగా కరోనా నిబంధనలు మాత్రం పాటించాలి”. అని డా. సమీరన్ పాండా, ఐసీఎమ్‌ఆర్ ఎపిడెమియోలజిస్ట్ చీఫ్ అంటున్నారు.

Also Read : Omicron Virus – కరోనా కొత్త వైరస్ ఒమిక్రాన్ ప్రభావం ఎంత, మన దేశంలోనూ మళ్లీ సమస్యలు తప్పవా?