iDreamPost
iDreamPost
కరోనా సెకండ్ వేవ్ ఊహించిన దాని కన్నా ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. ఆఖరి దశలో ఇంకో వారం పది రోజులు షూటింగ్ బాలన్స్ ఉన్న సినిమాలను సైతం వదలడం లేదు. యూనిట్ సభ్యుల్లో ఎవరో ఒకరు పాజిటివ్ బారిన పడుతూ అంతటా భయాన్ని సృష్టిస్తున్నారు. వైరస్ ఎక్కడి నుంచి ఎవరికీ ఎలా వస్తుందో పసిగట్టి అరికట్టడం అసాధ్యం కనక క్యాన్సిల్ చేయడం మినహా నిర్మాతలకు వేరే దారి కనిపించడం లేదు. దీని వల్ల కాల్ షీట్స్ తో పాటు ఆ రోజుకు సంబంధించిన ఏర్పాట్లు, సెట్టింగులు తదితర ఖర్చులన్నీ భరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో దిక్కు తోచని అయోమయం టాలీవుడ్ లో నెలకొన్న మాట వాస్తవం.
తాజాగా టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మూవీస్ గా చెప్పుకుంటున్న ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లు సైతం షూట్ లను వాయిదా వేసుకోక తప్పలేదు. ఇప్పటికే ఎన్నో అడ్డంకులు, పోస్ట్ పోన్లు, రీ షెడ్యూల్స్ చేసుకుంటూ వచ్చిన ఈ సినిమాలను దురదృష్టం వదలడం లేదు. పోనీ కరోనా ముప్పు పూర్తిగా ఎప్పుడు తొలగిపోతుందంటే దానికీ ఎవరిదగ్గరా సమాధానం లేదు. మే 1 నుంచి 18 వయసు దాటిన అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ఇకపై కొంత పాజిటివ్ గా ఉండొచ్చు. కాకపోతే ఇంత జనాభాకు సరిపడా డోసులు వస్తాయా అంటే ఎవరూ చెప్పలేరు. అందరికీ అందేందుకు కొంత సమయం అయితే పట్టొచ్చు.
ఆర్ఆర్ఆర్ కు సంబంధించి ఓ ఎపిసోడ్, కొంత ప్యాచ్ వర్క్, రాధే శ్యామ్ కొన్ని సీన్లు ఒక పాట మాత్రమే పెండింగ్ ఉన్నట్టుగా తెలిసింది. ఈ నెలలో అయిపోతుందనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇలా బ్రేక్ పడింది. ఇక ఏప్రిల్ పై అందరూ ఆశలు వదులుకోవాల్సిందే. మే నుంచి కుదుటపడితే సంతోషమే. అలా కాకుండా పెద్దగా మార్పు లేకపోతే మాత్రం ఎప్పుడో ప్లాన్ చేసుకున్న రిలీజ్ డేట్లలో కూడా మార్పులు తప్పవు. మరోవైపు సినిమాలు లేక థియేటర్లు ఎగ్జిబిటర్లు అలో లక్ష్మణా అంటున్నారు. వకీల్ సాబ్ కూడా చాలా డ్రాప్ అయ్యింది. హిస్టరీ రిపీట్స్ తరహాలో గత ఏడాది ఏప్రిల్ సిచువేషన్ మళ్ళీ రిపీట్ కావడమే విషాదం