iDreamPost
iDreamPost
కోవిడ్ 19 పాజిటివ్‌లు ఉధృతంగా నమోదు కావడానికి భిన్నమైన విషయం ఇది. భారీగా కేసులు నమోదవ్వడం ప్రారంభమయ్యాక గత 24 గంటల్లో అత్యంత కనిష్టానికి అంటే 1916 కేసులు మాత్రమే బైటపడ్డాయి. ఇది తేలిగ్గా ఊపిరి పీల్చుకునే అంశంగానే భావిస్తున్నప్పటికీ భవిష్యత్తు ముప్పునకు ఇది సంకేతంగా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వైద్య పరిభాషలో ఏ అంటు వ్యాధికైనా కర్వ్ అనేది ఉంటుంది. ఈ క్రమంలో వ్యాధి వ్యాపించడం, ఉధృతంగా విస్తృతం కావడం, తగ్గుతూ ఉండడం, ఆ తరువాత మళ్ళీ విరుచుకు పడడం అనేది సహజంగానే జరుగుతూ ఉంటుంది. ఇదే విషయంలో గతంలోనూ అనేక అంటు వ్యాధుల విషయంలో నిపుణులు గుర్తించారు. సరిగ్గా ఇదే పరిస్థితి కోవిడ్ 19 విషయంలో కూడా జరుగుతుందని చెబుతున్నారు. ఇప్పటికే యూరప్ దేశాల మొత్తం సెకెండ్ వేవ్‌ను చవిచూస్తున్నాయి. కోవిడ్ పాజిటివ్‌లు అత్యంత భారీగా నమోదైన ఏప్రియల్, మే, జూన్ నెలలను మించి ఇప్పుడక్కడ పాజిటివ్‌లు, మరణాలు నమోదు కావడాన్ని ఉదాహరణగా చూపుతన్నారు. ప్రస్తుతం యూరప్ దేశాల్లో శీతాకాలం కొనసాగుతోంది. ఇది కూడా వైరస్ విజృంభణకు ఒక ప్రధాన కారణమంటున్నారు.
నవంబరు నుంచి మన దేశంలోని చాలా ప్రాంతాల్లో శీతగాలులు ప్రారంభమవుతాయి. ఇవి దాదాపు జనవరి దాటిన తరువాత కూడా ఇవి కొనసాగుతాయి. ప్రకృతి సహజసిద్ధంగా శీతాకాలం అంటే వ్యాధలు ప్రభలే కాలంగానే పరిగణిస్తారు. అందులోౖనూ వైరస్ సంబంధిత వ్యాధులు అత్యంత సహజంగానే ఈ సమయంలో విజృంభిస్తుంటాయి. దీనిని తోడు నవంబర్ – జనవరిల మధ్యనే అనేక పండుగలు కూడా వస్తాయి. జనం గుమిగూడేందుకు అత్యధికశాతం అవకాశాలు కూడా ఉంటాయి. ఇటువంటి పరిస్థితులనే అంచనా వేస్తున్న నిపుణులు, ప్రస్తుతం కేసులు గణనీయంగా తగ్గుతున్నప్పటికీ భవిష్యత్తులో భారీగా పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు.
అమెరికా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక్క ట్రంప్ చేసిన రాజకీయ ప్రసంగాలకు గుమిగూడిన జనంలోనే 30వేల మందికి కోవిడ్ వ్యాపించిందని, అందులో 700 మంది వరకు మృత్యువాత పడ్డారని ఒక పరిశోధన తేల్చింది. ఇదే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే పండుగలు, వివాహాది శుభకార్యాలు, సమావేశాలు.. ఇలా దేన్ని పరిగణనలోకి తీసుకున్నా కోవిడ్ వైరస్ వ్యాపించేందుకు అత్యధికంలో అత్యధికంగా అవకాశం ఏర్పడుతుందనడం కాదనలేనిది.
ఇదిలా ఉండగా ఏపీలో మొత్తం గుర్తించిన పాజిటివ్‌లు 8.27 లక్షలకు చేరుకుంది. వీరిలో 7.98 లక్షల మంది కోలుకుని ఇంటికి చేరుకున్నారు. 22,500 మంది వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.