iDreamPost
iDreamPost
మినీ మున్సిపోల్స్.. తెలంగాణలో అత్యంత వివాదం రేపిన ఎన్నికలివి. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోవడంతో అసలు ఎన్నికలు అవసరమా అని అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. ప్రస్తుతానికి ఎన్నికలను వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. గవర్నర్ కు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. హైకోర్టుకు కూడా వెళ్లింది. కానీ ఎన్నికలను వాయిదా వేయాలని తాము చెప్పలేమని కోర్టు చెప్పింది. ఇంత జరుగుతున్నా తెలంగాణ సర్కారు ఎన్నికలకే మొగ్గు చూపింది. ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో డ్యూటీ చేసేందుకు అధికారులు కూడా భయపడుతున్నారు. మరోవైపు ప్రచారమూ నామమాత్రంగానే సాగింది. దీంతో ఓటింగ్ ఎంతమేరకు నమోదవుతుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
సాగర్ ఉప ఎన్నిక తర్వాత మారిన సీన్
కరోనా టైంలోనే జీహెచ్ఎంసీ, దుబ్బాక, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అయితే అప్పటికి అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో కరోనా ఫస్ట్ వేవ్ తగ్గిపోయింది. కేసులు కూడా భారీగా పడిపోయాయి. కానీ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అప్పటికే దేశంలో కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. తెలంగాణలో రోజూ కరోనా బారిన పడే వారి ఎక్కువయ్యారు. అయినా అవేమీ పట్టించుకోకుండా అధికార టీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు ప్రచారం చేశాయి. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడిగాయి. ఇదే సమయంలో కరోనా కూడా ఇంటింటికీ పాకింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ తర్వాత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ లీడర్లు.. ఎంతో మంది కరోనా బారిన పడ్డారు. నల్గొండలో వేలాది కేసులు వచ్చాయి. దీంతో ప్రభుత్వంపై, ఎన్నికల సంఘంపై విమర్శలు వెల్లువెత్తాయి.
Also Read : లెక్కింపునకు ముందే తిరుపతి ఫలితాన్ని తేల్చిన టీడీపీ అనుకూల మీడియా
ముందే నోటిఫికేషన్
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 17న జరగాల్సి ఉండగా.. 15వ తేదీన మున్సిపల్ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, సిద్దిపేట, జడ్చర్ల, అచ్చంపేట, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఏప్రిల్ 30న పోలింగ్ జరుగుతుందని ప్రకటించింది. ఇలా హడావుడిగా నోటిఫికేషన్ ఇవ్వడంపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. సాగర్ ఎన్నికల ఫలితాల ప్రభావం.. మున్సిపల్ ఎన్నికలపై పడకూడదని టీఆర్ఎస్ ఈ వ్యూహం పన్నింది. సాగర్ రిజల్ట్ రాకముందే పోలింగ్ జరిగేలా.. సాగర్ రిజల్ట్ వచ్చాక మున్సిపాలిటీల కౌంటింగ్ ఉండేలా చూసుకుంది. ఈ క్రమంలో ఎన్నికలు జరిగే దాకా రాష్ట్రంలో కరోనా ఆంక్షలు పెట్టకూడదని భావించింది. అయితే కేసీఆర్, కేటీఆర్ కరోనా బారిన పడటం, రాష్ట్రంలో కేసులు భారీగా పెరిగిపోవడంతో టీఆర్ఎస్ సర్కారు రూటు మార్చింది. రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించింది. కానీ ఎన్నికలు మాత్రం ఆపలేదు. పోలింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేవంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా జాగ్రత్తలతో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తామని ఎస్ఈసీకి లెటర్ రాసింది.
ప్రచారం.. నామమాత్రం..
టీఆర్ఎస్ ప్రధాన నేతలు, కింది స్థాయి లీడర్లు కరోనా బారిన పడటంతో ప్రచారం చప్పగా సాగింది. ఎక్కడా ఎన్నికల హడావుడి కనిపించలేదు. అక్కడక్కడా మాత్రమే లీడర్లు ప్రచారం చేస్తూ కనిపించారు. ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కేసులు భారీగా నమోదవడంతో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసేందుకు భయపడ్డారు. ప్రచారం చేయకుండా ఇంటికే పరిమితమైతే ఓట్లు రావని, అలాగని ప్రచారానికి వెళ్తే వైరస్ అంటుంకుంటుందేమోనని ఆందోళన చెందారు. అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం అవసరమా అని టీఆర్ఎస్ లీడర్లే ప్రశ్నించారు. కరోనాకు భయపడి ప్రచారానికి కార్యకర్తలు కూడా రాలేదు. స్వయానా లీడర్లు ఫోన్లు చేసి పిలిచినా పట్టించుకోలేదు. డబ్బులు ఇచ్చినా ప్రచారానికి ఎవరూ రావలేదని స్థానిక లీడర్లు చెప్పారు. దీంతో ప్రచారం కేవలం నామమాత్రంగా సాగింది. సాగర్ ఎన్నికల జోష్ మున్సిపల్ ఎన్నికల్లో కనిపించలేదు.
ఓటింగ్ పై ప్రభావం
ప్రస్తుత ఎన్నికలపై లీడర్లే ఆసక్తి చూపనప్పుడు.. ఇక జనం ఏం ఆసక్తి చూపుతారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. నిజానికి ప్రచారానికి వస్తున్న లీడర్లను చాలా చోట్ల ఓటర్లు అడ్డుకున్నారు. కాలనీలు, ఇళ్ల ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బోర్డులు పెట్టారు. ‘మా ఇంటికి ప్రచారానికి రావొద్దు. మా ప్రాణాలు మాకు ముఖ్యం’.. ‘మీరు వద్దు. మీ ఓటు వద్దు. మా ప్రాణం మాకు ముద్దు’ అంటూ ఇంకొందరు వరంగల్ సిటీలో ఫ్లెక్సీలు పెట్టారు. మరి ప్రచారానికే రావద్దని అంటున్న ప్రజలు.. ఇక ఓటు వేసేందుకు వస్తారా అనే ఆందోళన అభ్యర్థులు, లీడర్లలో పెరుగుతోంది. ఇది ఓటింగ్ పై ఎంత మేర ప్రభావం చూపుతుందోనని లెక్కలు వేసుకుంటున్నారు. ఓటింగ్ శాతం తగ్గితే.. ఒకటీ రెండు ఓట్లతోనే ఓడిపోతామని, ఓటర్లను ఎలాగైనా పోలింగ్ కేంద్రాలకు తీసుకురావాలని లీడర్లు భావిస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు ఈ విషయంలో చాలా ముందున్నారు. కాలనీల వారీగా కింది స్థాయి నాయకులను ఇన్ చార్జులుగా పెట్టి.. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చే బాధ్యలను అప్పగించారు. మరికొందరైతే ఓటర్లకు తాయిలాలు ఇచ్చేస్తున్నారు. ఓటుకు ఇంత అని ముట్టజెబుతున్నారు. ఇవి ఎంత మేర పని చేస్తాయనేది రేపు సాయంత్రానికి తేలిపోనుంది.
Also Read : దీదీ దే బెంగాల్.. ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే..