iDreamPost
iDreamPost
కరోనా వ్యాప్తి విషయంలో ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ, కేరళ రాష్ట్ర్రాలు అందరికీ పాఠం నేర్పుతున్నాయా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. ఏడు నెలల క్రితం కరోనా మొదట్లో ఉన్న భయం, ఆందోళన ఇప్పుడు జనంలో కన్పించడం లేదు. నిజానికి ప్రభుత్వాలు కూడా ఆందోళన చెందొద్దు, అప్రమత్తంగా ఉండండి అనే మొత్తుకుంటున్నాయి. కానీ జనం ఆందోళన మాత్రమే విడిచిపెట్టారు. అప్రమత్తత విషయంలో నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఇదే ముప్పు పెంచబోతోందన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవున్నాయి. కరోనా తగ్గిపోయిందన్న భావనలో గుంపులుగుంపులుగా చేరిన చోటల్లా తిరిగి మళ్ళీ కరోనా పాజిటివ్ కేసులు విజృంభిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఐసీయూ బెడ్లు అవసరం పెరగడాన్ని నిపుణులు నిదర్శనంగా చూపుతున్నారు.
జాతీయ సగటును పరిశీలిస్తే సుమారు రెండు శాతం మందికి కోవిడ్ వైరస్ సీరియస్‌గా పరిగణిస్తోంది. అంటే వారికి ఐసీయూలో చికిత్స అందించాల్సి వస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 70 లక్షలకు పైబడి కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయి కేసులకే పెద్ద ఎత్తున వైద్య రంగం కిందామీదా పడింది. 138 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఎక్కువ మందికి పాజిటివ్ భారిన పడితే, ఆమేరకు సీరియస్ అయ్యేవాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. అంటే ఐసీయూ బెడ్లు ఎక్కువగానే అవసరం అవుతాయి. ఆ లెక్కన మరోసారి వైద్యరంగంపై ఒత్తిడి తప్పకపోవచ్చు.
నిజానికి దేశ రాజధాని ఢిల్లీతోపాటు, కేరళ రాష్ట్రాల్లో కరోనా కట్టడి తరువాత దేశ వ్యాప్తంగా నిబంధనలు సడలించినట్టే అక్కడ కూడా సడలింపులు ఇచ్చారు. అయితే అనూహ్యంగా కోవిడ్ పాజిటివ్ భారిన పడి ఐసీయూ అవసరం అవుతున్న వారి సంఖ్య అక్కడ పెరుగుతూ వస్తోంది. ఇది ఆందోళనకర స్థాయిలోనే ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిని కరోనా సెకెండ్ వేవ్‌గా అభివర్ణిస్తున్నారు. ఇదే పరిస్థితి దేశ వ్యాప్తంగా ఉత్పన్నమైతే ఏంటి పరిస్థితి అన్న ప్రశ్న ఎదురవుతోంది. ఈ రెండు చోట్లా కేసుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టాక, తిరిగి పెరుగుతున్నాయని వివరిస్తున్నారు.
దీనికి ప్రధాన కారణంగా జనం ఏ మాత్రం జాగ్రత్తలు పాటించకుండా గుంపులు గుంపులుగా చేరడమేనని వివరిస్తున్నారు నిపుణులు. కేరళలో ఓనం పండుగ తరువాత పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఇప్పుడు ఉ«భయ తెలుగు రాష్ట్రాల్లోనూ పండుగల సీజన్ ప్రారంభమైంది. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో వినాయక చవితి చల్లగానే సాగిపోయింది. అయితే లాక్డౌన్ నిబంధనలు పూర్తిగా ఎత్తివేసిన తరువాత ఇప్పుడు దసరా పండుగ రానుంది. అలాగే ఆ వెనుకే దీపావళి, బతుకమ్మ, క్రిస్మస్, సంక్రాంతి పండుగలు వరుసగా రోజుల వ్యవధిలోనే రానున్నాయి. వీటి నేపథ్యంలో ప్రజలు ఎప్పటిలాగే గుంపులుగా ఒక్క చోటుకు చేరితే తీవ్రపరిణామాలే ఎదుర్కొవాల్సి వస్తుందని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రస్తుతం అన్నీ తెరుచుకున్నప్పటికీ ప్రభుత్వ పరంగా నిబంధనలను కఠినంగానే అమలు చేస్తున్నారు. పదేళ్ళలోపు చిన్నారులు, ఆరవయ్యేళ్ళలోపు పెద్దలను జనసమూహాలు ఉండే చోటుకు అధికారికంగా అనుమతించడం లేదు. అయితే అనధికారికంగా జనం మూగే∙చోట్ల పరిస్థితి ఏంటనన్నదానికి సమాధానం దొరకడం కష్టమే. ప్రభుత్వం ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రజల నుంచి తగిన సహకారం లేకపోతే కోవిడ్‌ను పూర్తిస్థాయిలో నిర్మూలించడం సాధ్యం కాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రభుత్వం, అధికార యంత్రాంగానికి సహకరించి భారీగా జనం పోగయ్యేందుకు అవకాశం ఇవ్వకుండా తగు జాగ్రత్తలు పాటిస్తేనే కోవిడ్ సెకెండ్ వేవ్‌ను అరికట్టగలుగుతాము. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్దపడాలన్న హెచ్చరికలను నిఫుణులు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ వైరస్ మ్యుటేషన్లకు భిన్నంగా మన దేశంలో పెద్దగా మ్యుటేషన్లు చోటు చేసుకోలేదని ఐసీయంఆర్‌తో పాటు పలువురు నిపుణుల బృందం స్పష్టం చేస్తోంది. అతి ఎక్కువగా మ్యుటేషన్లు చోటు చేసుకుంటే వ్యాక్సిన్ రూపకల్పనలో ఇబ్బందులు ఎదురవుతుందని కొందరు నిపుణులు అంచనా వేసారు. అయితే మన దేశంలో పెద్దగా మ్యుటేషన్స్ చోటు చేసుకోకపోవడం పట్ల ఊపిరి పీల్చుకుంటున్నారు. అలాగే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే సుమారు ముప్పైకోట్ల మందికి వ్యాక్సినేషన్ జరిగే విధంగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించి దేశ ప్రజల్లో భరోసాను పెంచడం ఊరట గలిగించే అవశంగానే చూడాల్సిన అవసరం ఉంది.