iDreamPost
android-app
ios-app

పలుకులా..? పడగలా ..?

పలుకులా..? పడగలా ..?

ఆకాశమే హద్దుగా భూముల ధరలు పెరగడంతో ఆడపిల్లల పెళ్లిళ్ల సందర్భంగా కట్నం కింద రెండు కోట్లు ఇస్తామన్న వాళ్లు.. ఆ మేరకు ధర పలుకుతున్నందున ఎకరం భూమి ఇచ్చారు. ఇప్పుడు అక్కడ ధరలు పడిపోవడంతో మీ భూమి వద్దు.. ఇస్తామన్న రెండు కోట్లు ఇవ్వండి అని కొందరు అల్లుళ్ల నుంచి ఒత్తిడి వస్తోందని ఆడపిల్లల కుటుంబీకులు వాపోతున్నారు.
(ఆంధ్రప్రదేశ్ అమరావతి ప్రాంతంలో)

– ఆర్కే

కట్నం ఇవ్వడం తీసుకోవడం రెండూ నేరమే. అలా ఆడపిల్లల్ని, వారి తల్లిదండ్రుల్ని ఇబ్బందులు పెడుతున్నవారి మీద మీరు బాధ్యతాయుత మీడియాగా ‘రిపోర్ట్’ చేయండి, ఏం చేయాలో సిస్టమే ‘డిసైడ్’ చేస్తుంది. అంతే కానీ, కట్నాల కోసమైనా రాజధానిని మార్చకూడదు అన్నట్టు ఈ రాతలేంటి ?

ఆంధ్రప్రదేశ్ రాజధానిని మార్చడం వెనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న కులద్వేషమే ప్రధాన కారణమన్నట్టు గత వారమే ధ్వజమెత్తారు. ‘చరిత్రలో ఒక జాతి సామూహిక ఆత్మహత్యకు ఈ తరం సాక్షీభూతంగా నిలవబోతోందా ?’ అంటూ పోయిన ఆదివారం ప్రశ్నించిన ఆర్కే ఈ వారం, విశ్వనాధ సత్యనారాయణ వారి ‘వేయి పడగలు’ నవల నుంచి “ఒక జాతి చచ్చిపోయినా పర్వాలేదు గానీ జీవచ్ఛవంలా ఉండిపోకూడదు’’ అనే వ్యాక్యాని అర్కే తన కొత్త పలుకుల పడగల్లో ఉటంకించారు. 2014 ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు – “‘పులివెందుల/కడప సంస్కృతి ఎక్కడ విశాఖపట్నానికి వస్తుందోనని విశాఖవాసులు భయపడ్తున్నారు. కడప నుంచి వందల సంఖ్యలో మనుషులు దిగి ఎన్నికలరోజు గొడవలు చేసేందుకు చూస్తున్నారు’ అంటూ అడ్డమైన ప్రచారాలు చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రచారాన్ని కొంచెం మార్చి ‘విశాఖ రాజధాని అయితే కడప జిల్లా వారి పెత్తనం పెరిగిపోయే ప్రమాదముందని వారు భయపడుతున్నార’న్నట్టుగా ‘కొత్త’ ప్రచారాన్ని మొదలుపెట్టారు. మరో వైపు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఇప్పటివరకు శాసనసభకు ఎన్నికైన వారిలో, మైనారిటీ వర్గాలకు చెందిన ఏకైక వ్యక్తి రెహమాన్ – “విశాఖలో కార్యనిర్వాహక రాజధాని అనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించి చరిత్రహీనుణ్ణి కాదల్చుకోలేదు” అంటూ తెలుగుదేశం పార్టీకే మొన్న రాజీనామా చేశారు.
ఇవంతా చూస్తుంటే తమకు ‘రాజధాని వద్దు’ అంటూ విశాఖపట్నంలో కొందరు ‘సామాన్య జనం’ రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు, కాగడాలతో ర్యాలీలు చేయడానికి ‘రంగం’ సిద్ధమైనట్టుంది.

వారానికొక సారి దాదాపు సగం పేజీ నిండా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే అవకాశం మరో ఏ జర్నలిస్టుకు ఉన్నా ఇదే రాజధాని అంశాన్ని పట్టుకుని కూర్చుని ఉండేవారు కాదు. ఒక వేళ ఆ విషయం పైనే అంతలా రాయాల్సి వచ్చినా దాన్ని ఒక సామాజికవర్గానికి మాత్రమే ముడిపెట్టే రాతలు కాకుండా కాస్త నిర్మాణాత్మకంగా రాజధాని మార్పుపై లాభనష్టాలు వివరించేవారు. భారతదేశ వ్యాప్తంగా ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్ వంటివాటి పైన ఇన్ని ఉద్యమాలు, చర్చలు జరుగుతుంటే అవన్నీ వదిలేసి – ఒక్క రాజధాని మార్పు గురించి; దాన్నీ కులాల మధ్య కుంపట్లు పెట్టేందుకు ఉపయోగిస్తున్న ‘దమ్మున్న జర్నలిజం’ తెలుగు రాష్ట్రాలు చేసుకున్న ‘అదృష్టం’.

ఏది ఏమైనా – ఈ రెండు వారాల తన పలుకులతో ఆర్కే ఒక నిజాన్ని నిగ్గు తేల్చాడు. అదేమిటంటే – ‘అమరావతి నుంచి రాష్ట్ర రాజధాని మార్పు – కేవలం ఒక సామాజికవర్గానికి మాత్రమే నష్టాన్ని కలిగిస్తుంది’ అని.