iDreamPost
android-app
ios-app

తీర్మానానికి – రద్దుకి మధ్యన శాసన మండలి పరిస్థితి ఏంటి?

  • Published Jan 28, 2020 | 12:49 PM Updated Updated Jan 28, 2020 | 12:49 PM
తీర్మానానికి – రద్దుకి మధ్యన శాసన మండలి పరిస్థితి ఏంటి?

నాటకీయంగా అత్యంత వేగంగా జరిగిన పరిణామాలతో ఎట్టకేలకు శాసన సభలో, మండలి రద్దు తీర్మానం సి.యం జగన్ ప్రవేశ పెట్టడం , దీనిపై సుదీర్ఘంగా సభలో చర్చిండం , తరువాత తీర్మానాన్ని ఓటింగ్ ద్వారా ఆమోదించడం చక చక జరిగిపోయాయి. ఇక వ్యవహారం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్ళిపోయింది. కేంద్ర హోం శాఖ పరిశీలన తరువాత, పార్లమెంటులో ఆమోదం పొంది , తరువాత రాష్ట్రపతి ఆమోదించిన నాడు అధికారికంగా మండలి రద్దు అయినట్టు భావించాలి. అయితే ఈ వ్యవహారం ఎన్ని రోజులు పడుతుంది. ఈ లోపు శాసనమండలి అధికారాలు కానీ , ఎమ్మెల్సీ సభ్యుల అధికారాలకు కానీ ఉన్న శక్తి ఎంటి? అనే అంశాలపై తీవ్ర చర్చ నడుస్తుంది. తెలుగుదేశం సభ్యులు మండలి రద్దు అవడానికి ఏడాది పైనే సమయం పడుతుందని అప్పటి వరకు మండలికి ఎలాంటి డోఖా లేదని వాదిస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం మండలి రద్దు వచ్చే బడ్జెట్ సమావేశల్లోనే పూర్తి చేయాలని చూస్తోంది. 1985లో రామారావు కూడా మండలి రద్దు చేసినప్పుడు, కేంద్రం మూడు నెలల్లో రద్దు ప్రక్రియ పూర్తి చేసిందని నాడు జరిగినట్టే నేడు జరుగుతుందని చెప్పుకొస్తున్నారు .

అయితే రాష్ట్ర పతి నుండి ఆమోదముద్ర వచ్చే వరకు సాంకేతికంగా మండలి రద్దు అవ్వనట్టే భావించాలి కనుక రాబోయే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలతో పాటు మండలి సమావేశాలు జరుగుతాయా లేదా అనే మీమాంశ రాజకీయ వర్గాల్లో ఉంది. తెలుగుదేశం మాత్రం ఇంకా రాష్ట్రపతి నుండి మండలి రద్దుకి ఆమోద ముద్ర పడలేదు కాబట్టి మండలి యధావిధిగా జరుగుతుందనే వాదన వినిపిస్తుంది. అయితే తెలుగుదేశం వాదనతో ప్రభుత్వం విభేదిస్తు మండలి రద్దు తీర్మానానికి ముందు క్యాబినేట్ రిజల్యుషన్ అయిందని ఆ రిజల్యుషన్ అసెంబ్లీలో 2/3 మెజారిటితో తీర్మానం చేసి గవర్నర్ గారికి పంపటం జరిగిందని, ఆ తీర్మానంపై గవర్నర్ గారి సంతకం అవుతుందని, ఆ తరువాత కేంద్ర హోం శాఖకు వెళుతుందని, ఇక్కడ గవర్నర్ ఆమోదం తరువాతే కేంద్రానికి వెళ్ళే ప్రక్రియ జరుగుతుందని చెబుతున్నారు.

ఇదిలావుంటే అసల అసెంబ్లీ గాని మండలి గాని సమావేశం అవ్వాలంటే నోటిఫై చేసేది గవర్నర్ గారే, ఆ నోటిఫై చేయటానికి క్యాబినేట్ ద్వారా గవర్నర్ గారికి సభ నిర్వహించుకుంటాం అని రిజల్యుషన్ ద్వారా విజ్ఞప్తి చేసుకోవాలి. మరి క్యాబినెట్ ఏ మండలి రద్దు కి తీర్మానం చేసిన తరువాత మళ్ళీ అదే క్యాబినెట్ ఎలా మండలి నిర్వహించుకుంటాం అని రిజల్యుషన్ ఇవ్వగలగుతుంది అనేది ప్రశ్న. అలాగే గవర్నర్ గారు రద్దుకు ఆమోదిస్తు తీర్మానంపై సంతకం చేసి కేంద్రానికి పంపిన తరువాత మండలి సమావేశాలకి ఎలా నోటిఫై చేసి ఆహ్వానిస్తారనేది కూడా ప్రశ్నే.. ఇది సాంకేతికంగా కుదిరే పనే కాదు, మండలి సమావేశాలు ఇక జరిగే అవకాశాలు కనిపించడంలేదు . అలాగే మండలి రద్దుకు తీర్మానం జరిగినా అది రాష్ట్రపతి ఆమోదం పొందే రోజు వరకు వారు మండలి సభ్యులే.. వారికి జీత భత్యాలు కూడా వస్తాయి. కానీ మండలి ఏర్పాటు చేసి సభ నిర్వహించటం అనేది జరగదని రాజకీయ విశ్లేషకుల మాట.

శాసనమండలి,శాసన సభల ను ప్రభుత్వ సూచన మేరకు గవర్నర్ “ప్రోరోగ్” చెస్తారు . మళ్ళీ సమావేశాలు జరగాలంటే ప్రభుత్వ సూచన మేరకు గవర్నర్ నోటిఫికేషన్ ఇస్తారు. ప్రభుత్వం ఏ సభను సమావేశం పరచాలనుకుంటుందో అదే సభకు నోటిఫికేషన్ ఇస్తారు.

ఉదాహరణకు 1983 మార్చ్ లో శాసనమండలిని రద్దు చేస్తూ ఎన్టీఆర్ ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. కేంద్రం నిర్ణయం తీసుకోవటం ఆలస్యమవటంతో మండలి సమావేశాలు జరిగాయి .1984 మార్చ్ 25న మండలిని ప్రోరోగ్ చేశారు.. అప్పటి నుంచి మండలి రద్దుకు 1985 మే నెలలో ఆమోద ముద్ర వేసేవరకు ఒక్క సమావేశం కూడా జరగలేదు,శాసనసభ పలుసార్లు సమావేశమయ్యింది.

ఇక పొతే ప్రభుత్వం తీసుకున్న మండలి రద్దు నిర్ణయాన్ని విభేదిస్తూ కొంత మంది శాసన మండలిని రాజ్యసభగా పోలుస్తూ విమర్శలు చేయటం కనిపిస్తు ఉంది. ఇవన్ని రాజ్యాంగం పట్ల సరైన అవగాహన లేని మాటలే. నిజానికి శాసన మండలి కి రాజ్యసభకు మధ్య చాలానే వ్యత్యాసం ఉంది. రాజ్యంగం ప్రకారం ఒక రాష్ట్రానికి శాసన మండలి ఉండాలా వద్దా అని నిర్ణయించే హక్కు ఆ రాష్ట్ర శాసన సభకు ఉంది. కానీ రాజ్యసభ ఉనికి మీద నిర్ణయం తీసుకునే హక్కు పార్లమెంటు కు ఉండదు. రాజ్యసభకు ఒక రాజ్యాంగ బద్దమైన హోదా ఉంది. అలాగే లోక్ సభ తో సమానమైన లెజిస్లేటివ్ అధికారాలు ఉన్నాయి. రాజ్యసభ అనేది రాష్ట్రాల సభగా ఫెడరల్ హౌస్ గా చూస్తారు అందుకే రాజ్య సభకు చైర్మన్ గా ఉప రాష్ట్ర పతి ఉంటారు కాని మండలకి చెర్మన్ గా ఉప గవర్నర్ ఉండరు అంటేనే వీటి మధ్యన వ్యత్యాసం గమనించవచ్చు. 

కొందరు టీడీపీ నేతలు రాజ్యసభకు ఉన్న హక్కులు శాసనమండలికి కూడా ఉన్నాయి అని వాదిస్తున్నారు… మండలిని రాజ్యసభతో పోల్చటం వారి తెలియనితనం కాదు కానీ రాజకీయ తెంపరితనం.. ఎమ్మెల్సీ లకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటుహక్కు ఉండదు అన్న సంగతి కూడా తెలియకుండా రాజ్యాంగం,సభా హక్కుల గురించి మాట్లాడుతున్నారు అనుకోలేము… ఎదో ఒకటి వాదించి ప్రజలు దృష్టిని ఆకర్షించటానికి ఈ ఎత్తుగడలు.

తెలుగుదేశం మండలి ఉనికిపై ఎన్ని మాట్లాడినా రాజ్యంగం ప్రకారం గా చూస్తే శాసన మండలి అస్థిత్వం ఇంకా ప్రశ్నార్ధకంగానే కనిపిస్తుంది. రాజ్యంగంలో ఉన్న ఆర్టికల్ 169 ఆధారంగా రాష్ట్రాలకి ఉన్న హక్కుల దృష్ట్యా రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సెషన్లో ఈ బిల్లుని ఆమోదించే సూచనలు కనిపిస్తున్నాయి. అప్పటివరకు సాంకేతికంగా మండలి సభ్యులు రాజ్యాంగం ప్రకారం వచ్చిన హక్కులు అనుభవిస్తారే తప్ప ఇక వారికి మండలికి వచ్చి సమావేశల్లో పాల్గొనే అవకాశం లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైన బలం ఉంది అని ప్రభుత్వంతో తెలుగుదేశం పెట్టుకున్న పేచీ చివరికి వారి సభ్యులని రాజకీయ నిరుద్యోగులుగా మార్చేసిందనేది కాదలేని అంశం. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం అన్ని విధాలుగా ప్రభుత్వానికే లాభం అనే వాదన వినిపిస్తుంది. ప్రభుత్వం విసిరిన వలలో చంద్రబాబు ఇరుక్కున్నారా లేక చంద్రబాబే ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి సభ్యులని నష్ట పోయారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపొయింది.