iDreamPost
android-app
ios-app

కరోనా దెబ్బకు ముంబాయ్ మరో న్యూయార్క్ అయిపోయిందా ?

  • Published May 29, 2020 | 8:08 AM Updated Updated May 29, 2020 | 8:08 AM
కరోనా దెబ్బకు  ముంబాయ్  మరో న్యూయార్క్ అయిపోయిందా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. దేశం మొత్తం మీద మహారాష్ట్రలో కేసులు విపరీతంగా పెరిగిపోతోంది. తాజా సమాచారం ప్రకారం దేశంలో సుమారు 1.7 లక్షల కేసులు రిజస్టర్ అయ్యాయి. ఇందులో మహారాష్ట్రలోనే దాదాపు 60 వేల కేసులున్నాయి. ఈ మొత్తం కేసుల్లో సుమారు 38 వేల కేవలం ముంబాయ్ నగరంలోనే రిజస్టరవ్వటం గమనార్హం. మహారాష్ట్రలో చనిపోయిన 1900 మందిలో సుమారు వెయ్యిమంది ముంబాయ్ లోనే ఉన్నాయని లెక్కలు చెబుతోంది. కనబడుతున్న లెక్కల ప్రకారం ముంబాయ్ కూడా మరో న్యూయార్క్ అయిపోతోందనే ఆందోళన పెరిగిపోతోంది.

కేసుల తీవ్రత పెరిగిపోతుడటంతో ఎన్ని ఆసుపత్రులున్నా సరిపోవటం లేదు. ఒకవైపు ఆసుపత్రులు లేకపోవటం మరోవైపు మార్చురీలు లేకపోవటంతో ఉన్నతాధికారులకు ఏమి చేయాలో దిక్కుతోచటం లేదు. అందుకనే ఎంతో పాపులరైన కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ లో కూడా చనిపోయిన వారిని జిప్ బ్యాగుల్లో ప్యాక్ చేసి ఆసుపత్రి క్యారిడార్టలోనే ఉంచేస్తున్నారు. ఈ ఆసుపత్రిలో మార్చురీలో మృతదేహాలు నిండిపోవటంతో వేరే దారిలేక డెడ్ బాడీస్ ను క్యారిడార్లలోనే వదిలేస్తున్నారు.

కేఈఎం ఆసుపత్రిలోని ఉద్యోగ సంఘాల నేత సంతోష్ ధూరి మాట్లాడుతూ తక్షణమే ఆసుపత్రికి ఆక్సిజన్ సౌకర్యం ఉన్న వందలాది బెడ్లు అవసరమన్నాడు. తమ ఆసుపత్రిలోని మార్చురీలో 27 మృతదేహాలను మాత్రమే భద్రపరచగలమని చెప్పాడు. అలాంటిది ఇపుడు మార్చురీ ఫుల్లయిపోవటంతో చేసేది లేక క్యారిడార్లలోనే ఉంచేస్తున్నట్లు చెప్పాడు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే మాట్లాడుతూ రాష్ట్రానికి తక్షణమే ఆక్సిజన్ సౌకర్యాలున్న 10 వేల పడకలు అవసరమని చెప్పాడు. ఆక్సిజన్ సిలండర్లు అవసరమైనన్ని లేకపోవటంతో ముగ్గురు పేషంట్లకు ఒకటే ఆక్సిజన్ సిలిండర్లను అమర్చుతున్నట్లు మంత్రి చెప్పటం గమనార్హం.

ముంబయిలో 21 వేల పడకల సామర్ధ్యం కలిగిన 70 ఆసుపత్రులుంటే కరోనా వైరస్ రోగులతో అన్నీ నిండిపోయాయి. మరో 20 వేల పడకలున్న 1500 ప్రైవేటు ఆసుపత్రులు కూడా వైరస్ పేషంట్లతోనే దాదాపు నిండిపోయాయి. అందుకనే యుద్ధ ప్రాతిపదికన మరో 10 వేల బెడ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి చెప్పాడు. బెడ్లు ఏర్పాటు కష్టం ఏమీ కాదని కాకపోతే ప్రతి బెడ్డుకు ఓ ఆక్సిజన్ సిలండర్ సౌకర్యం ఏర్పాటు చేయటమే కష్టంగా ఉందన్నాడు. ఇటువంటి పరిస్ధితుల వల్ల ముంబాయ్ కూడా మరో న్యూయార్క్ అయిపోయిందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఒకపుడు న్యూయార్క్ లో కూడా అచ్చం ఇవే పరిస్ధితులు కనిపించాయి.