iDreamPost
iDreamPost
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న మహమ్మరి కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో కూడా అలజడి సృష్టిస్తోంది. జలుబు, దగ్గుతో మొదలై తీవ్ర జ్వరం వరకూ వెళ్లి చివరకు ప్రాణాంతకమవుతున్న ఈ మహమ్మరిని ఆదిలోనే అడ్డుకునేందుకు ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం కరోనా పై పత్య్రేక దృష్టి సారించింది.
కరోనా లక్షణాలుతో ఎవరైనా బాధపడుతుంటే ముందుగానే తెలుసుకునేందుకు వాలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేయించింది. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించింది.
కరోనా లక్షణాలు ఉన్న వారికి అందించే వైద్యాన్ని ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మొత్తం 14 రకాల జబ్బులను ఇందులో చేర్చారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ ఎ.మల్లికార్జున్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డిలు ఉత్తర్వులు జారీ చేశారు.
ఎవరైనా కరోనా లక్షణాలతో ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్న ఆసుపత్రుల్లో చేరితే వారికి ఉచితంగా చికిత్స అందనుంది. అందు కోసం ప్రత్యేక వార్డులు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆయా ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేసింది. వైరస్ అనుమానిత లక్షణాలతో ఉన్న వారికి వైద్యం అందిస్తే వైద్య ఖర్చుతోపాటు అదనంగా 10 వేలు, పాజిటివ్ కేసులకు వైద్యం చేస్తే… అదనంగా 20 వేల రూపాయలు చెల్లిస్తామని ప్రభుత్వం ఆస్పత్రులకు సర్కులర్ జారీ చేసింది.