Idream media
Idream media
కొత్త కరోనా రూపంలో ప్రపంచానికి కొంగొత్త సవాళ్లు ఎదురుకానున్నాయా..? వాటిని ముందస్తుగా ఎదుర్కోకపోతే మళ్లీ ముప్పు తప్పదా..? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. బ్రిటన్‌లో పంజా విసురుతున్న కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కొవిడ్-19 కారక కరోనా వైరస్ రూపాంతరం చెంది వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ 70 శాతం వేగంగా వ్యాపిస్తోందని బ్రిటన్ తెలిపింది. ఈ నేపథ్యంలో భారత్ సహా ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, బల్గేరియా, బెల్జియం, ఆస్ట్రియా, కెనడా, ఇటలీ లాంటి దేశాలు ఇప్పటికే యూకే విమానాల రాకపోకలను నిషేధించాయి.
ఇప్పటివరకూ ఉన్న కరోనా వైరస్ వల్ల సంవత్సర కాలంలో 7 కోట్ల మందికి పైగా వ్యాధి బారిన పడ్డారు. ఏడాదిగా పీడిస్తున్న ఈ మహమ్మారి తలలు వంచేందుకు ఇప్పటికీ సరైన వ్యాక్సిన్ జనజీవనంలోకి అడుగుపెట్టలేదు. ఇప్పడిప్పుడే కోవిడ్ తీవ్రత నుంచి ఊపిరి పీల్చుకుంటున్న జనాలను బ్రిటన్‌లో వెలుగు చూసిన ఓ కొత్త రకం కరోనా వైరస్ మళ్లీ వణుకు పుట్టిస్తోంది. ఈ కొత్త వైరస్ కరోనా వైరస్ కంటే వేగంగా వ్యాపిస్తోంది. దీనివల్ల బ్రిటన్‌లో పరిస్థితి చేయి దాటి పోవడంతో లండన్‌తోపాటు ఆగ్నేయ ఇంగ్లండ్‌లో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. కరోనా వ్యాక్సిన్ దేశమంతా సప్లై అయ్యే వరకూ కొన్ని నెలలపాటూ నిబంధనలు కొనసాగుతాయని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదేశించారు . క్రిస్‌మస్ సంబరాలను సైతం రద్దు చేస్తూ ఇంట్లోనే ఉండాలని సూచించారు.
అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు యూకే నుంచి విమానాల రాకపోకలను నిషేధించాయి. బ్రిటన్ నుంచే వచ్చే విమానాలపై నిషేధం విధించాలని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. బ్రిటన్‌లో వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ కొత్త మ్యుటేషన్ సూపర్ స్ప్రెడర్‌లా ఉందని సోమవారం ఆయన ట్వీట్ చేశారు. తక్షణమే ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని కేజ్రీవాల్ కోరారు. ఇదిలా ఉండగా.. యూకే నుంచి వచ్చే విమానాలపై భారత ప్రభుత్వం విధించిన నిషేధం డిసెంబర్ 22 అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. గత వారం రోజులుగా యూకే నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. జర్మనీ, ఇటలీ, బెల్జియం, ఆస్ట్రియా, సౌదీ అరేబియా, చెక్ రిపబ్లిక్ తదితర దేశాలు కూడా యూకే నుంచి విమానాలను నిలిపివేశాయి. ఆస్ట్రేలియాలో బ్రిటన్ తరహా కరోనా వైరస్ కేసులు రెండు నమోదైనట్లు అక్కడి అధికారులు తెలిపారు.
మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ .. తెలంగాణ అప్రమత్తం
బ్రిటన్ ను వణికిస్తున్న కరోనా కొత్త వైరస్ ప్రభావం భారత్ పై పడింది. ముంబైతో పాటు రాష్ట్రంలోని అన్ని మేజర్ సిటీస్ లో రాత్రి కర్ఫ్యూని మహారాష్ట్ర ప్రభుత్వం విధించింది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని తెలిపింది. జనవరి 5 వరకు ఈ కర్ఫ్యూని అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. కొత్త రకం వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ వైద్య శాఖ కూడా అప్రమత్తమైంది. గడిచిన వారం రోజులుగా విదేశాల నుంచి వచ్చిన వారిని ట్రాక్ చేసే పనిలో నిమగ్నమైంది. అలాంటి ప్రయాణికులను గుర్తించి పరీక్షలు నిర్వహించనుంది. అటు శంషాబాద్ ఎయిర్‌పోర్టులను మరోసారి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (RGIA)లో కరోనా సర్వేలెన్స్ చేస్తూ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు అక్కడే ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించనున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని, కొవిడ్-19 లక్షణాలున్న వారిని గుర్తించి నేరుగా హాస్పిటళ్లకు తరలించి చికిత్స అందించనున్నారు. నెగిటివ్ వచ్చినా.. వారం రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని ప్రయాణికులకు సూచిస్తున్నారు.