మ‌ళ్లీ లాక్‌డౌన్‌ క‌ష్టాలు

క‌రోనా పోలేదు. లాక్‌డౌన్ మ‌ళ్లీ వ‌చ్చింది. అనంత‌పురంలో ఉద‌యం 11 దాటితే అన్నీ బంద్‌. కొంచెం కొంచెంగా తేరుకుంటున్న ప‌ట్ట‌ణం మ‌ళ్లీ దిగాలు ప‌డింది. జీవించాలంటే రోడ్డు మీద‌కి వెళ్లాలి. రోడ్డెక్కితే క‌రోనా వ‌స్తుంది. ఇదో ఊపిరాడ‌ని స్థితి.

ఏ రోజుకారోజు జీవించే వాళ్ల‌కి ముంద‌స్తు జాగ్ర‌త్త ప‌డాల‌న్నా వీలు కాదు. మా ఇంటి ద‌గ్గ‌ర జొన్న రొట్టెలు చేసే కుటుంబం ఉంది. సాయంత్రం ఐదు నుంచి రాత్రి ప‌ది గంట‌ల వ‌ర‌కు అమ్మేవాళ్లు. మొత్తం ఆరుగురు బ‌తికేవాళ్లు. లాక్‌డౌన్ ఎత్తే స‌రికి కొంచెం ఆశ చిగురించింది. ఇప్పుడు ఆశ‌లు వ‌దులుకుని ప‌ల్లెటూరికి వెళ్లిపోయారు.

దూర ప్రాంతాల్లో ప‌నులు చేసుకుంటున్న వాళ్లంతా సొంత ఊళ్లు చేరే స‌రికి ప‌ల్లె మీద ఒత్తిడి పెరిగింది. ఉన్న ప‌నులే త‌క్కువ‌, ఇప్పుడు కూలీల సంఖ్య పెరిగింది. గొడ‌వ‌లు రాజ‌కీయాలు మొద‌ల‌య్యాయి. కొత్త విష‌యం ఏమంటే అనంత‌పురం జిల్లాలోని మారుమూల గ్రామాల్లో కూడా లేబ‌ర్ కాంట్రాక్ట‌ర్లు పుట్టుకొచ్చారు.

నాలుగైదు గ్రామాల్లో ఉన్న కూలీలంతా అత‌ని పెత్త‌నం కింద ఉంటారు. రైతుల‌కి కూలీల అవ‌స‌ర‌మైతే నేరుగా మాట్లాడే ప‌రిస్థితి లేదు. కాంట్రాక్టర్‌తో మాట్లాడితే ఆటోల్లో అత‌నే పంపిస్తాడు. ఫోన్ పేలో ముందే డ‌బ్బు ట్రాన్స్‌ఫ‌ర్‌ చేయాలి.

టిఫెన్ సెంట‌ర్లు ,పానీపూరి బ‌ళ్లు , బ‌జ్జీలు బండి మీద అమ్మేవాళ్లు ఎంత దెబ్బ తిన్నారంటే ఇప్ప‌ట్లో వాళ్లు కోలుకోవ‌డం అసాధ్యం. వీళ్ల‌కి ఫైనాన్స్ ఇచ్చిన చిన్న వ్యాపారులు దివాళా తీశారు. వీళ్ల ద‌గ్గ‌ర రూ.10 వేలు అప్పు కావాలంటే రూ.9 వేలు చేతికిస్తారు. ప్ర‌తిరోజు వంద రూపాయ‌లు వంద రోజులు క‌ట్టాలి. క‌రోనా విశ్వ‌రూపం ఎవ‌రికీ తెలియ‌దు కాబ‌ట్టి అంద‌రూ మునిగిపోయారు.

పానీపూరి, జిలేబీ , స‌మోసా సెంట‌ర్ల వాళ్లంతా ఎక్కువ‌గా రాజ‌స్థాన్ నుంచి వ‌చ్చారు. స్వ‌త‌హాగా పొదుపుగా జీవించే త‌త్వం ఉన్న వాళ్లు కాబ‌ట్టి కొంత కాలం త‌ట్టుకున్నారు. శ‌క్తి చాల‌క రాజ‌స్థాన్ వెళ్లిపోయారు.

ప‌ట్ట‌ణంలోని స్ల‌మ్స్ , దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి జీవించే కాల‌నీల్లో కొన్ని వంద‌ల‌ ఇళ్లు ఖాళీగా క‌నిపిస్తున్నాయి. ఉన్న వాళ్లు అద్దె ఇవ్వ‌లేని స్థితి. ఖాళీ చేయిస్తే కొత్త వాళ్లు రారు.

పెళ్లిళ్ల సీజ‌న్ మీద ఆధార‌ప‌డిన క‌ళ్యాణ మండ‌పాలు, డెక‌రేట‌ర్స్ , క్యాట‌రింగ్‌, మంగ‌ళ వాయిద్యాలు, ఫొటో, వీడియో అంద‌రికీ బ‌తుకు క‌ష్టంగా మారింది. నాయిబ్రాహ్మ‌ణుల‌కి నాలుగు డ‌బ్బులు సంపాదించే కాల‌మిది. ఇపుడు వాయిద్యాల‌కు పిలిచే వాళ్లు లేరు. సెలూన్‌లు మూత‌ప‌డి దిగులు ప‌డిపోయారు.

విషాదం ఏమంటే వీళ్లెవ‌రికీ ఇంకో ప‌నిరాదు. ఇంకో ప‌ని చేద్దామంటే ఏమీ లేదు కూడా. స్ట్రీట్ ఫుడ్ అమ్ముకునే కొంద‌రు , కూర‌గాయ‌లు, పండ్లు అమ్మ‌డానికి సిద్ధ‌మైనా, అక్క‌డ కూడా లాభ‌సాటిగా ఏమీ లేదు. కార‌ణం జ‌నం ద‌గ్గ‌ర డ‌బ్బుల్లేవు.

అనంత‌పురంలో బ‌జ్జీలు అమ్ముకుని బ‌తికే కుటుంబాలే దాదాపు వెయ్యికి పైగా ఉన్నాయి. మూడు నెల‌ల నుంచి ఉపాధి లేదు. రోజుకి వెయ్యి కిలోల‌కి పైగా శ‌న‌గ పిండి వినియోగం ఉండేది. ఇది ప‌రోక్షంగా శ‌న‌గ‌రైతుని దెబ్బ తీసింది.

క‌రోనాతో ఎవ‌రి బాధ వాళ్ల‌వి. పిల్ల‌ల్ని బ‌య‌టికి పంప‌లేక‌, ఇంట్లో క‌ట్ట‌డి చేయ‌లేక త‌ల్లిదండ్రులు ఇబ్బంది ప‌డుతున్నారు. ఖాళీగా ఉండ‌డంతో చిరుతిళ్లు తిని పిల్ల‌లు, పెద్ద‌లు అంతా ఒబెసిటి బారిన ప‌డుతున్నారు.

లాక్‌డౌన్ ఎత్తివేత‌తో ఆటో వాళ్లు కొంత ఉత్సాహ ప‌డ్డారు కానీ, ప్ర‌యాణం చేసేవాళ్లే లేక‌పోతే ఎక్కేవాళ్లు ఎక్క‌డ‌? రైల్వే స్టేష‌న్లో అనౌన్స్‌మెంట్ విని వంద రోజులు దాటింది. స్విగ్గీ , జొమాటో నిరుద్యోగ యువ‌కుల‌కి ప‌ని క‌ల్పించేవి. ఇప్పుడు వాళ్లంతా ఏం ప‌ని చేయాలో తెలియ‌క దిక్కులు చూస్తున్నారు.

టీ అంగ‌డి ద‌గ్గ‌ర గుంపులు గుంపులు కూచుని పేప‌ర్ చ‌దివే వాళ్లు. అంగ‌డీ లేదు , పేప‌ర్లు లేవు.

అన్నిటిక‌న్నా ద‌రిద్రం ఏమంటే ముక్కు మూసుకు పోయినా, పొడి ద‌గ్గు వ‌చ్చినా మ‌న‌కు మ‌న‌మే క‌రోనా ఏమో అని భ‌య‌ప‌డి చ‌స్తున్నాం.

క‌రోనాకి మందు వ‌చ్చేసింద‌ని అంటున్నారు కానీ, అవ‌న్నీ ఏ మాత్రం ప‌నిచేస్తాయో తెలియ‌దు. నిద్ర‌పోయే ముందు హ‌మ్మ‌య్య ఈ రోజు క‌రోనా రాలేదు అని సంతోషించే స్థితి. మంచి కాలం ఒక‌టి వ‌స్తుంద‌నే పాజిటివ్‌నెస్ మంచిదే కానీ, క‌రోనాలో కూడా పాజిటివ్ ఉంది. అదే డేంజ‌ర్‌.

Show comments