బాబాయ్ కన్నా అబ్బాయే నయమట .. అడ్రస్ లేని కొందరు నేతలు ?

శ్రీకాకుళం జిల్లాలోని తెలుగుదేశంపార్టీ నేతల్లో చాలామంది అసలు అడ్రస్సే కనబడటం లేదట. ఎప్పుడైతే కరోనా వైరస్ మొదలైందో అప్పటి నుండే చాలామంది నేతలు పార్టీ క్యాడర్ కు కానీ జనాలకు కానీ అందుబాటులో ఉండటం లేదని ఆరోపణలు వినబడుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గాలి స్పష్టంగా కనబడినా సిక్కోలు జిల్లాలో మాత్రం ఓ ఎంపి+రెండు ఎంఎల్ఏ సీట్లను టిడిపి గెలుచుకుందంటే అర్ధమేంటి ? జిల్లాలోని పసుపు పార్టీ మీద జనాల్లో అక్కడక్కడ ఇంకా అభిమానం ఉందనే కదా.

మరి అభిమానంతో ఓట్లేసి గెలిపించిన జనాలను కష్టకాలంలో ఆదుకోవాల్సిన నేతలు జనాలకు దూరంగా ఉండటం ఎంత వరకూ భావ్యమని పార్టీలోనే చర్చలు జరుగుతోంది. జగన్ మీద రెగ్యులర్ గా ఆరోపణలు, విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విశాఖలో ఉంటున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. వైరస్ సమస్య మొదలైన దగ్గర నుండి ఆయన టెక్కలి నియోజకవర్గంలో పార్టీకి అందుబాటులో లేరట. అంటే విశాఖలోనే కూర్చుని జగన్ పై ట్వీట్లు పెడుతున్నాడట.

అయితే అబ్బాయ్, శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాత్రం శ్రీకాకుళంలోనే ఉంటున్నాట్లు చెప్తున్నారు. వీలైనంతలో పార్టీ నేతలు, క్యాడర్ తో టచ్ లో ఉంటున్నది ఒక్క శ్రీకాకుళం ఎంపి మాత్రమే అని అంటున్నారు. అలాగే మరో మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు చాలా రోజులుగా యాక్టివ్ గా లేరు. నియోజకవర్గం ఎచ్చెర్లలో కూడా ఎక్కడా కనబడటం లేదని సమాచారం. అలాగే ఇచ్చాపురం నుండి గెలిచిన రెండో ఎంఎల్ఏ బెందాళం అశోక్ కూడా జనాలకు అందుబాటులో ఉండటం లేదని ఆరోపణలు వినబడుతున్నాయి.

గెలిచిన ముగ్గురిలో ఇద్దరు ప్రజాప్రతినిధులు మరియు రాష్ట్ర అధ్యక్షుడే జనాలకు అందుబాటులో లేకపోతే ఇక సీనియర్ నేతలు ప్రతిభా భారతి, కోండ్రు మురళీ మోహన్ రావు, గుండ అప్పల సూర్యనారాయణ, గౌతు శివాజీ లాంటి వాళ్ళు అందుబాటులో లేకపోవటంలో ఆశ్చర్యమేమీ లేదని పార్టీలోనే చెప్పుకుంటున్నారు. మొత్తం మీద కరోనా వైరస్ దెబ్బకు చాలామంది సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోయినట్లే అనుమానిస్తున్నారు.

Show comments