iDreamPost
iDreamPost
గత రెండు రోజులుగా పేరున్న మీడియా సంస్థల ఛానళ్ళు, పత్రికల్లో కరోనా థర్డ్ వేవ్ గురించిన వార్తలు కాస్త గట్టిగానే వస్తున్నాయి. ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాయి తప్ప ఒకవేళ నిజంగా ఆ ప్రమాదం ముంచుకొస్తుందా లేదా అనే క్లారిటీ ఇవ్వడం లేదు. ఆ మాటకొస్తే దీని గురించి తలలు పండిన వైద్య శాస్త్రవేత్తలు కూడా ఏమి చెప్పలేని పరిస్థితి కాబట్టి గవర్నమెంట్ ని నిందించి లాభం లేదు. వ్యాక్సిన్ వేసుకోవడం, బయటికి వెళ్తే ఒళ్ళు దగ్గర పెట్టుకుని నిబంధనలు పాటించడం తప్ప ఎవరూ ఏమి చేయలేరు. ఇదంతా ఇప్పుడిప్పుడే తెరుచుకుని కోలుకుంటున్న థియేటర్ల వ్యవస్థను మరోసారి వణికిస్తోంది.
సినిమా హాళ్లు తెరిచి ఇవాళ్టికి అయిదో రోజు. ట్రెండ్ ని గమనిస్తే సరైన క్రౌడ్ పుల్లింగ్ మూవీ వస్తే హౌస్ ఫుల్ బోర్డులు పడటం ఖాయమని అర్థమైపోయింది. పర్వాలేదు అనుకున్న తిమ్మరుసుకే హైదరాబాద్ విజయవాడ లాంటి నగరాల్లో ఎనభై శాతం పైగా ఆక్యుపెన్సీ నమోదయ్యింది. అలాంటిది ఇమేజ్ ఉన్న హీరో బరిలో దిగితే ఆ కిక్ వేరుగా ఉంటుంది. ముఖ్యంగా బిసి సెంటర్లలో జనం బాగా వస్తారు. సీటిమార్, టక్ జగదీశ్, లవ్ స్టోరీ లాంటి బడా చిత్రాల నిర్మాతలు ఇంకా ఆలోచనలో ఉన్నారు తప్ప ఆగస్ట్ లో ఎలాగైనా రిలీజ్ చేసే మూడ్ సదరు ప్రొడక్షన్ హౌస్ లలో కనిపించడం లేదన్నది వాస్తవం.
ఒకవేళ దురదృష్టవశాత్తు థర్డ్ వేవ్ లాంటిది ముంచుకొస్తే అది మరికొద్ది రోజుల్లో స్టార్ట్ కావొచ్చు. లేదూ టైం బాగుండి రాలేదంటే మాత్రం థియేటర్లలు మునుపటి కళ వచ్చేస్తుంది. మహారాష్ట్రలో ఇప్పటికీ సినిమా హాళ్ల మూసివేత కొనసాగుతోంది. ఆగష్టు 19కి ప్లాన్ చేసుకున్న అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ మరోసారి కన్ఫ్యూజన్ లో పడింది. తెలుగు రాష్ట్రాల్లో అంత దారుణంగా పరిస్థితులు లేకపోయినా కూడా ఇమేజ్ ఉన్న సినిమాలు వస్తే తప్ప పబ్లిక్ పూర్తి స్థాయిలో థియేటర్లకు రారు. మరోవైపు తమిళ మలయాళంలో ఓటిటి రిలీజుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఎటొచ్చి కాస్త మెరుగ్గా ఉన్నది టాలీవుడ్డే అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు
Also Read : కీలక తేదీకి రిలీజుల అయోమయం