iDreamPost
iDreamPost
కరోనా వైరస్ తాకిడి ఇప్పుడు మొత్తం వ్యవస్థనే తల్లకిందులు చేసింది. చాలామంది అంచనాలు, ఆలోచనలు, ప్రణాళికలు అన్నీ తారుమారయ్యాయి. అదే సమయంలో అన్ని చోట్లా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. లాక్ డౌన్ పాటిస్తున్నప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు మాత్రం తగ్గడం లేదు. ఎందుకు తగ్గడం లేదనేది ఎవరికీ అంతుబట్టని వ్యవహారంగా మారింది. తొలుత విదేశీ యాత్రికులు, ఆ తర్వాత మర్కజ్ నుంచి వచ్చిన వారు కారణాలుగా స్పష్టత ఉంది. కానీ ఇప్పుడు అలాంటి క్లారిటీ కూడా కనిపించడం లేదు. కొత్త కేసులు ఎందుకు వస్తున్నాయన్నది యంత్రాంగానికి కూడా అంటుబట్టకుండా ఉంది. ఈ నేపథ్యంలో అసలు కరోనా వైరస్ ఊహించినంత భయానకమా..లేక అంతగా భయపెట్టేశారా అన్నదే ఆలోచించాల్సిన అంశం.
కరోనా కారణంగా గడిచిన 50 రోజుల్లో ఏపీలో 1100, తెలంగాణాలో వెయ్యి కేసులు సుమారుగా నమోదయ్యాయి. ఇరు రాష్ట్రాల్లో కలిపి 60 మంది వరకూ ప్రాణాలు విడిచారు. ఈకాలంలో సాధారణ రోజుల్లో కూడా వివిధ కారణాలతో ప్రాణాలు విడిచిన వారి సంఖ్యతో పోలిస్తే ఈ సంఖ్య 60 ఏమాత్రం అన్నది ఆలోచించాలి. ఉదాహరణకు ఒక్క గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోజుకి నలుగురు తగ్గకుండా వివిధ కారణాలతో మృతులు ఉండేవారు. అంటే నెలకు స్వల్పంగా 120కి పైగా మృతులు ఆ ఒక్క ఆస్పత్రిలోనే నమోదయ్యేవి. అదే గుంటూరులో వివిధ ప్రైవేటు ఆస్పత్రులన్నీ కలిపి ఆ సంఖ్య మూడింతలుంటుంది. అంటే ఒక్క గుంటూరులోనే వివిధ ఆస్పత్రుల్లో 300కి పైగా మరణించేవారు. ఇక రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, ప్రధాన పట్టణాల్లోని ఆస్పత్రుల్లో మరణించేవారి సంఖ్య నెలకు వేలల్లో ఉండేది.
కానీ ప్రస్తుతం ఆసుపత్రులన్నీ మూతపడ్డాయి. వాహనాలు రోడ్డు మీదకు రాకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య దాదాపుగా తగ్గింది. ఈ నలభై రోజుల్లో ఏపీ మొత్తంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 20 మంది కూడా లేరు. అదే సాధారణ రోజుల్లో సగటున పది మంది ఉంటారు. అంటే కేవలం రోడ్డు ప్రమాదాల్లోనే ఈ కాలంలో మరణించేవారి సంఖ్య 800గా నమోదయ్యిది. కానీ కరోనా మృతులు ఇప్పటికీ 60 మంది మాత్రమే. అంటే రోడ్డు ప్రమాదాలతో పోల్చినా కరోనా మృతుల సంఖ్య స్వల్పమే. ఇతర సాధారణ రోగులతో పోల్చినా చాలా నామమాత్రమే. ఇక ఈ సీజన్ లో డెంగ్యూ ప్రభావం కొంచెం తక్కువే అయినప్పటికీ ఇతర విషజ్వరాలు వ్యాపించే అవకాశం ఉండేది. గతంలో చికెన్ గున్యా సహా వివిధ రోగాలతో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు సతమతం అయిన పరిస్థితులు చూశాం. కానీ ప్రస్తుతం కరోనా తో పోలిస్తే అలాంటి రోగాల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య చాలా ఎక్కువ.
అయినప్పటికీ ప్రస్తుతం ప్రజల్లో తీవ్ర ఆందోళన కనిపిస్తోంది. చివరకు లాక్ డౌన్ నుంచి కొన్ని చోట్ల ఉపశమనం ఉన్నప్పటికీ ఇంటి నుంచి బయటకు రావడానికి సంకోచిస్తున్నారు. గ్రీన్ జోన్లలో కూడా సాధారణ జీవనం కనిపించడం లేదు. అంటే ప్రజల్లో కరోనా పట్ల ఎంత భయాందోళనలు ఉన్నాయో స్పష్టం అవుతోంది. వాస్తవానికి ప్రపంచంలోని మిగిలిన దేశాల్లో ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాల పరిణామాలను భూతద్దంలో చూపడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చినట్టు కనిపిస్తోంది. నిజంగా మే 3 తర్వాత లేదా కొన్నాళ్లు పొడిగించి గానీ లాక్ డౌన్ ఎత్తివేసినప్పటికీ మళ్లీ సాధారణ పరిస్థితులు రావడానికి కనీసంగా ఆరు నెలలు పడుతుందేనే అంచనాలున్నాయి. నిజంగా అంతకాలం పాటు వ్యవస్థ స్తంభిస్తే జరిగే పరిణామాలు అనేక తరగతుల జీవితాలను ఛిన్నాభిన్నం చేసే ప్రమాదం ఉంటుందనడంలో సందేహం లేదు.
కరోనా కేసుల్లో చూసినా తెలుగు రాష్ట్రాల లెక్కలు పరిశీలిస్తే 2 వేల కేసుల్లో కేవలం 60 మందికి ప్రాణాల మీదకు వచ్చింది. వారికి కూడా కేవలం వైరస్ మూలంగానే కాకుండా ఇతర అనేక అంశాలు తోడయ్యాయి. ముఖ్యంగా వయసు, దీర్ఘకాలిక కాలిక వ్యాధుల ప్రభావం ఎక్కువ. వైరస్ లక్షణాలు గుర్తించడం, ట్రీట్మెంట్ అందించడానికి సకాలంలో అవకాశం లేకపోవడం కూడా తోడయ్యింది. మృతుల కేస్ హిస్టరీ పరిశీలిస్తే మద్యం, ధూమపానం వంటి దురలవాట్లు మూలంగా గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలు ఎదుర్కొంటున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. అంటే కేవలం వైరస్ వ్యాపించడంతోనే ఏదో ప్రమాదం ముంచుకొస్తోందని, దాని వల్ల కొంపలు మునిగినట్టేననే ప్రచారం వల్ల కలిగే ఆందోళన కూడా అలాంటి వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుందనడంలో సందేహం లేదు. ఇలాంటి అనేక అంశాలను పరిశీలిస్తే కరోనా వైరస్ ముప్పు మన అనుభవాల రీత్యా భారతీయులను భయపెట్టినంతగా ముప్పు తీసుకురావడం లేదని స్పష్టం అవుతోంది. నిజంగా వైరస్ కన్నా, లాక్ డౌన్ కారణంగానే పెద్ద నష్టం కలుగుతుందా అనే సందేహం వస్తోంది.
అదే సమయంలో అమెరికా, ఇటలీ సహా యూరప్ దేశాల్లో వైద్య ఆరోగ్య రంగం పరిస్థితి వేరు. ప్రభుత్వం కన్నా ప్రైవేటు కార్పోరేట్ ఆసుపత్రులదే హవా. కానీ ఇండియాలో కార్పోరేట్ ప్రభావం ఉన్నప్పటికీ నేటికీ ప్రభుత్వ వైద్యరంగానిదే పెద్ద పాత్ర. కాబట్టి ఒక్క సారిగా కేసులు పెరిగిపోయి, ఆ దేశాల మాదిరిగా అనూహ్య సంఖ్యలో కేసులు వచ్చేస్తే తప్ప, ప్రస్తుతం పెరుగుతున్న కేసులను ప్రమాదంగా భావించడానికి అవకాశం లేదు. మన పరిస్థితులకు కొంత కష్టమే అయినప్పటికీ ఇది పూర్తిగా ఇబ్బంది కరం గా మారే ప్రమాదం లేదు. కాబట్టి నిశ్చింతగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. కరోనా భయాందోళనలు మనకు అవసరం లేదని
తాజా పరిణామాలు చాటుతున్నాయి.