Idream media
Idream media
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రజల జీవన విధానాన్ని పూర్తిగా మార్చి వేసింది. రోజులో అధిక సమయం వారిని ఇళ్లకే పరిమితం చేస్తోంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ భారత దేశంలో నడుస్తోంది. థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వైరస్ కట్టడికి ప్రభుత్వాలు తమ పరిధిలో ఉన్నతంగా పని చేస్తున్నాయి. ఇటీవల వరకు కరోనా సెకండ్ వేవ్ భారత్‌ను ఓ కుదుపుకుదిపింది. మొదటి వేవ్‌కన్నా రెండో వేవ్‌లో నాలుగు రెట్లు ఎక్కువగా కేసులు, మరణాలు చోటుచేసుకోవడం అందరినీ కలవరపెట్టింది. మొదటి వేవ్‌లో కన్నా రెండో వేవ్ బలంగా, ప్రమాదకరంగా ఉంది.
కట్టడికి అదే మార్గం…
మొదటి వేవ్ అయినా, రెండో వేవ్ అయినా కరోనా కట్టడికి లాక్‌డౌన్ ప్రధాన మార్గంగా నిలుస్తోంది. వైరస్ సోకిన వారికి చికిత్స, మందులు వాడడం, వ్యాక్సినేషన్ కార్యక్రమం ఒక ఎత్తు అయితే.. అసలు వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం మరో ఎత్తు. మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వాల ముందు లాక్‌డౌన్ అనే ఏకైక మార్గం ఉంది. లాక్‌డౌన్ విధించడం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం, ఉపాధి కోల్పోవడం, పేదరికం పెరగడం వంటి అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నా.. వైరస్ వ్యాప్తికి ఇంతకు మంచి మరో మార్గం కనిపించడం లేదు. అందుకే అన్ని సమస్యలను బేరీజు వేసుకున్న తర్వాత.. నష్టమైనా ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వాలు లాక్‌డౌన్లు విధిస్తున్నారు.
అదుపులోకి వస్తున్న వైరస్..
లాక్‌డౌన్ పెట్టడం వల్ల దేశంలో కరోనా వైరస్ అదుపులోకి వస్తోంది. గత మూడు రోజుల నుంచి రోజు వారీ కేసులు రెండు లక్షల లోపు నమోదవడమే ఇందుకు నిదర్శనం. ఈ నెల ప్రారంభంలో వైరస్ వ్యాప్తి ఉధృతి మొదలై.. ఉచ్ఛ స్థితికి చేరుకుంది. రోజుకు నాలుగు లక్షల కేసులు నమోదయ్యాయి. మొదటి వేవ్‌లో గరీష్టంగా రోజుకు 98 వేల కేసులు నమోదవగా.. సెకండ్ వేవ్‌లో ఆ సంఖ్య నాలుగు లక్షల మార్క్‌ను చేరుకుంది. అక్రమంగా కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం ప్రారంభించాయి. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1.65 లక్షల కేసులు వెలుగులోకి వచ్చాయి. జూన్ 30వ తేదీ వరకు కంటైన్మెంట్ చర్యలు కొనసాగించాలనే కేంద్ర ప్రభుత్వం సూచనలతో.. రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని మినహాయింపులతో లాక్‌డౌన్‌ను కొనసాగించే అవకాశం ఉంది. ఫలితంగా వచ్చే నెలాఖరు నాటికి దేశంలో వైరస్ వ్యాప్తి పూర్తిగా నియంత్రణలోకి వస్తుందని ఆశిస్తున్నారు. నిపుణుల అంచనాల మేరకు జూలై మధ్య నాటికి దేశంలో సెకండ్ వేవ్ తగ్గుతుందనేలా పరిణామాలు చోటు చేసుకుంటుండడం ఊరట కలిగించే అంశం.
Also Read : సంకట స్థితిలో సీపీఐ నేతలు