Idream media
Idream media
తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో కరోనా తీవ్ర స్థాయిలో కలకలం రేపుతోంది. ప్రధానంగా టీఆర్ఎస్ నేతల్లో వణుకుపుట్టిస్తోంది. తాజాగా తెలంగాణకు చెందిన డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయన కుటుంబంలోని మరో నలుగురికి కూడా కరోనా సోకినట్లు తెలిసింది. పద్మారావు గౌడ్ కు కరోనా లక్షణాలు ఉండడంతో, ఆయనకు, కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితాల్లో పాజిటివ్ గా తేలింది. ఆదివారం నుంచే ఆయన హోం క్వారంటైన్ లో ఉండగా.. సోమవారం వారందరూ చికిత్స నిమిత్తం యశోధ ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది. మిగతా కుటుంబ సభ్యులందరూ హోం క్వారంటైన్ లోనే ఉండాల్సిందిగా వైద్యులు సూచించారు.
కరోనా నిర్ధారణ కావడంతో హోమ్ మంత్రి మహమూద్ అలీ కూడా ఆదివారం అర్థరాత్రి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన తో పాటు మనవడు కూడా కరోనా బారిన పడ్డాడు. గతంలోనే ఆయన ఎస్కార్ట్ వాహనం లోని ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. అలాగే కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కు కూడా వైరస్ సోకిందని తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన నేతలు వరుసగా కరోనా బారిన పడుతుండడం టీఆర్ఎస్ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, జనగామఎమ్మెల్యే ముతిరెడ్డి యాదగిరి రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఏదేమైనా కరోనా… రాజకీయ వర్గాలను కూడా కుదిపేస్తోంది. క్షేత్ర స్థాయిలో కూడా విజృంభిస్తోంది. ఎక్కడ తమను కాటు వేస్తుంది అని ప్రముఖులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వల్ల కుటుంబ సభ్యులకు కూడా వైరస్ సోకుతుండడంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. డిప్యూటీ స్పీకర్ తో పాటు ఆ కుటుంబంలో మనవళ్లు, మనవరాళ్లు కూడా మహమ్మారి బారిన పడ్డట్లు తెలిసింది.