iDreamPost
android-app
ios-app

ఎన్నికల కోసం వచ్చిన వారితోనే మళ్లీ కరోనా విస్తరణ, ప్రభుత్వ అంచనా తప్పలేదు..

ఎన్నికల కోసం వచ్చిన వారితోనే మళ్లీ కరోనా విస్తరణ, ప్రభుత్వ అంచనా తప్పలేదు..

కరోనా విషయంలో ప్రారంభం నుంచి ముఖ్యమంత్రి జగన్ అంచనాలు నిజమవుతున్నాయి. గత ఏడాది మార్చి 15నాడే పత్రికాముఖంగా ఆయన చెప్పిన రీతిలో కరోనా సమస్య వెంటాడుతోంది. ఆనాడు వాస్తవాన్ని విశ్లేషించి చెబితే ట్రోల్ చేసిన వాళ్లే తర్వాత సీఎం మాటలు నిజమయ్యాయని అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. అంతా జరిగి ఏడాది పూర్తయ్యేలోగా స్థానిక ఎన్నికల మూలంగా సమస్యలు వస్తాయని అధికార పార్టీ మొత్తుకుంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సమంజసం కాదని చెప్పింది. కరోనా వ్యాక్సిన్ ప్రక్రియకు ప్రాధాన్యతనివ్వాలని చెప్పింది.

కానీ రాజ్యాంగ బద్ధ సంస్థల ఆదేశాల మేరకు అనివార్య పరిస్థితుల్లో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించి చిత్తశుద్ధిని చాటుకుంది. ప్రత్యర్థి పార్టీలు పోటీకి భయపడి ఎన్నికలు వద్దంటున్నారని ఎద్దేశా చేసినా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యం అంటూ పాలకపార్టీ కదిలింది. అక్కడ జరుగుతున్నాయి..ఇక్కడ జరగడం లేదా అంటూ అనేక ప్రశ్నలు సంధించిన వారంతా ఇప్పుడు మళ్లీ సైలెంట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది.

కొంతకాలంగా కరోనా కేసుల విషయంలో ప్రతీ రోజూ వంద లోపు కనిపించే కేసులు ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. నెల్లూరు , తూగో జిల్లా, శ్రీకాకుళం వంటి చోట్ల ఇటీవల వెలుగు చూసిన కేసులన్నీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకునేందుకు ముంబై, హైదరాబాద్ ప్రాంతీయులే కావడం గమనార్హం. స్థానిక ఎన్నికల్లో పోటీ కారణంగా దూర ప్రాంతాల్లో ఉన్న వారిని కూడా తరలించిన తరుణంలో అనేక చోట్ల సమస్యలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా కరోనా ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి వచ్చిన వారి మూలంగా మరోసారి మహహ్మారి వ్యాప్తికి ఆస్కారం ఏర్పడింది. అమలాపురంలోని ఓ మెడికల్ షాపులో ఇద్దరికి కరోనా సోకింది. తీరా చూస్తే అందులో ఒకరి ఇంటికి ఎన్నికల కోసం వచ్చిన బందువులుండడం విశేషం. అక్కడి నుంచి ఒక్క కోనసీమలోనే శుక్రవారం నాడు 15 కేసులు వెలుగులోకి వచ్చాయి. మలికిపురంలో ఒక మహిళ మరణించింది.

కరోనా ఇప్పటికే మహారాష్ట్ర, పంజాబ్, కేరళ వంటి రాష్ట్రాల్లో పంజా విసురుతోంది. నాగపూర్ లో లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వం సమర్థవంతంగా చేసిన యత్నాలన్నీ ఎన్నికల మూలంగా నీరుగారిపోతున్నట్టు ఆందోళన చెందుతున్నారు. సరిగ్గా గత ఏడాది మార్చి మధ్య నాటికి ఉన్న పరిస్థితి మరోసారి పునరావృతం కావడం పట్ల కలవరపడుతున్నారు. తాజాగా రెండు వందలు దాటి నమోదవుతున్న కేసులు అక్కడితో పరిమితం అయ్యేందుకు అనుగుణంగా సర్కారు చర్యలు తీసుకుంటోంది. అయితే ఇప్పటికే ఎన్నికల్లో రాకపోకలు తీవ్రమయిన తరుణంలో పరిస్థితి ఎటు దారితీస్తుందోననే చర్చ మొదలయ్యింది. మొత్తంగా ఏపీ ప్రభుత్వం అంచనా వేసిన రీతిలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఆనాడు పలు లాజిక్కులు మాట్లాడి ఎన్నికలకు సిద్ధపడిన వాళ్లంతా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.