iDreamPost
android-app
ios-app

క‌రోనా ఎఫెక్ట్ : మున్సిసిపోల్స్ పై నేడు ఈసీ క్లారిటీ!

క‌రోనా ఎఫెక్ట్ : మున్సిసిపోల్స్ పై నేడు ఈసీ క్లారిటీ!

రాష్ట్రంలో అచ్చంపేట, సిద్ధిపేట, నకిరేకల్‌, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాల్టీలతో పాటు తెలంగాణలో ఖమ్మం, వరంగల్‌ మహా నగర పాలక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల దాఖలు ప్రక్రియ కూడా పూర్తయింది. దీంతో తాజా మాజీ కార్పొరేటర్లతో పాటు, పార్టీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్సీల అనుచరులు, గతంలో టికెట్‌ ఆశించి భంగపడ్డ వారు, గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పక్షాన పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన వారు, డాక్టర్లు, న్యాయవాదులు.. ఇలా చాలా మంది నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి పెరుగుతుండడం, సీఎం కేసీఆర్‌ సైతం కరోనా బారిన పడడంతో మునిసిపల్‌ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీనిపై ఇప్ప‌టికే ఎస్ఈసీ ప్ర‌భుత్వ వివ‌ర‌ణ కోరింది. క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ ఎన్నిక‌ల‌కు వెళ్తామ‌ని ప్ర‌భుత్వం చెప్పింది. ఈ నేప‌థ్యంలో ఎస్ఈసీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై నేడు క్లారిటీ ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయి.

కార్పొరేషన్‌, మున్సిపల్‌ సాధారణ ఎన్నికలతోపాటు రాష్ట్రంలో వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న 9 మునిసిపల్‌ వార్డులకు ఈనెల 30న ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్‌ జారీ అయ్యింది. నామినేషన్ల దాఖలు, పరిశీలన సోమవారంతో ముగిసింది. ఈనెల 22న ఉపసంహరణ గడువు కూడా ముగిసి, పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా వెలువడనున్నది. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో 11 లక్షలకు పైగా ఓటర్లున్నారు.కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మునిసిపల్‌ ఎన్నికల నిలిపివేతకు హైకోర్టు నిరాకరించింది. ఎన్నికల నోటిఫికేషన్‌లో తాము జోక్యం చేసుకునేది లేదని, దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ), రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కూడా హైకోర్టు సూచించింది. దీంతో, కరోనా కట్టడి చర్యల విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కీలకం కానున్నది.

ఎన్నికల్లో జోక్యం చేసుకోలేమని చెప్పిన న్యాయస్థానం ‘వారాంతపు లాక్‌డౌన్‌, రాత్రిపూట కర్ఫ్యూపై 48 గంటలలో నిర్ణయం తీసుకోండి. లేదంటే మేమే ఆదేశాలిస్తామని’ రాష్ట్ర సర్కారును ఆదేశించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా ఉండబోతోంది? మునిసిపల్‌ ఎన్నికల పరిస్థితి ఏమిటి? ఎన్నికలు వాయుదా పడతాయా? తీవ్ర కట్టడి మధ్య ఎన్నికలు జరుగుతాయా? అన్న విషయాలు చర్చనీయాంశంగా మారాయి. కరోనా కట్టడిలో భాగంగా కేవలం రాత్రి వేళ కర్ఫ్యూ/లాక్‌డౌన్‌ అమలు చేయడం వంటివి లేదా వారాంతంలో(శని, ఆదివారాలు) పూర్తిగా లాక్‌డౌన్‌ విధించడం వంటివి చేపడితే… మునిసిపల్‌ ఎన్నికలు వాయుదా పడకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది. అయితే, ప్రచారానికి పరిమితులు పెంచడంతోపాటు కరోనా కట్టడి చర్యలను పక్కాగా అమలుచేయవచ్చంటున్నారు. ఒక వేళ ఢిల్లీ తరహాలో వరుసగా వారం లేదా పది రోజులు పూర్తి లాక్‌డౌన్‌ విధిస్తే… అనివార్యంగా ఎన్నికల ప్రక్రియ నిలిపి వేయవచ్చన్నది మరో వాదనగా ఉంది.