టాలీవుడ్ కు లాభమా నష్టమా – కరోనా

నిన్న తెలంగాణా ప్రభుత్వం అన్ని సినిమా థియేటర్లను మూసివేయాలని, సూపర్ మార్కెట్లు మినహాయించి మాల్స్ ని సైతం షట్ డౌన్ చేయాలని ఆదేశాలు జారీ చేయడం తెలిసిన విషయమే. దీని ప్రభావం ఏ మేరకు ఉండబోతుందన్న విశ్లేషణలో ట్రేడ్ పండితులు బిజీగా ఉన్నారు. మొన్న శుక్రవారం రిలీజైన నాలుగైదు చిన్న సినిమాలు దీని వల్ల విపరీతంగా నష్టపోనున్నాయి. అసలే టాక్ పాజిటివ్ లేక సతమతమవుతుంటే మరో వైపు గాయం మీద కారం చల్లినట్టు వాటి అవకశాలను కరోనా పూర్తిగా లాగేసుకుంది. నిజానికి ఇప్పుడీ చర్య వల్ల బడా నిర్మాతలకు క్రేజీ ప్రాజెక్టులకు ఎలాంటి నష్టం కాని ఇబ్బంది కాని లేదు.

గత నెల రోజులకు పైగా భీష్మ తప్ప బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసిన సినిమా ఏది లేదు. వచ్చినవి వచ్చినట్టే టపా కట్టేశాయి. పరీక్షల సీజన్ కావడంతో పెద్ద ప్రొడ్యూసర్లు తమ రిలీజులు ఉగాది నుంచి ప్లాన్ చేసుకున్నారు. అనుకోని ఉత్పాతంలా ఇప్పుడీ కరోనా దెబ్బ గట్టిగా పడింది. అయితే మార్చ్ 21 దాకా సినిమా హాళ్ళు మూసివేయడం వల్ల ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం భారీగా అయితే ఉండదు. కాకపోతే తెరచి ఉన్న టైంలో కనీసం నిర్వహణ ఖర్చులకైనా అంతో ఇంతో టికెట్ల డబ్బులు ఉపయోగపడేవి.

ఇప్పుడు జీతాలు చెల్లించాలి కాని ఒక్క రూపాయి ఆదాయం లేకుండా థియేటర్ల యజమానులు రెండు వారాలు గడపాలి. పైకి చూడడానికి తేలిగ్గా కనిపించినా దీనిలో సాధక బాధలు మాత్రం పెద్దవే. నాని లాంటి హీరోల సినిమాలు ఎప్పుడు వచ్చినా సమస్య లేదు కాని ఒరేయ్ బుజ్జిగా, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా లాంటివాటికి టైమింగ్ చాలా ముఖ్యం. అనవసరమైన పోటీకి పోలేవు. సరే పండగ కాబట్టి ధైర్యం చేసి నానితో ఫైట్ కి సై అన్నాయి కాని ఇకపై అది అంత ఈజీగా ఉండదు. మొత్తానికి కరోనా ప్రభావం పరిశ్రమ కంటే ఎగ్జిబిటర్ల మీద పడనుంది. ముఖ్యంగా వాటి యజమానులకు మూసివేత కాలంలో లీజు రూపంలో రావాల్సిన అద్దెలు రాకపోవచ్చు. మొత్తానికి గడ్డు పరిస్థితి తప్పదని మాత్రం అర్థమైపోయింది. ఆంధ్రప్రదేశ్ లోనూ ఇలాంటి చర్యల దిశగా ఆలోచనలు జరుగుతున్నాయని సమాచారం. ఏ క్షణమైనా బాంబు పేలవచ్చు.

Show comments