డిజిటల్, ఎలక్ట్రానిక్ మీడియా విస్తృతమైన తర్వాత వార్తా పత్రికల పరిస్థితి రోజు రోజుకీ దిగజారుతోంది..! ఇలాంటి పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాటి పండు పడినట్లు కరోనా రూపంలో న్యూస్ పేపర్లు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే దక్కన్ క్రానికల్, ఆంద్రభూమి పత్రికలు ప్రచురణను తాత్కాలికంగా నిలిపివేయగా…ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలు పేజీల సంఖ్యను తగ్గించుకున్నాయి. రానున్న కాలంలో పరిస్థితి మరింతగా క్షీణిస్తే పేపర్లన్నీ నిలిచిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు….!
కరోనా అన్ని రంగాలను అతలాకుతలం చేస్తోంది. డిజిటల్, ఎలక్రానిక్ మీడియా పరిస్థితి ఒకింత బాగున్నప్పటికీ ప్రింట్ మీడియా మాత్రం ఎదురీదుతోందనే చెప్పాలి. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో న్యూస్ సేకరణ, పబ్లిషింగ్, పంపిణీ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో జాతీయ, స్థానిక పత్రికల సమీప భవిష్యత్ ఒకింత ఆందోళనకరంగా కనిపిస్తోంది.
పేపర్ల ద్వారా కరోనా వ్యాప్తి….! ఇది దినపత్రికలను బాగా దెబ్బతీసిన వదంతి..! న్యూస్ పేపర్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందనే ప్రచారంతో చాలా మంది తమ ఇంటికి పేపర్ వేయొద్దని నిక్కచ్చిగా చెప్పేస్తున్నారు…! పేపర్ ద్వారా లేదా పేపర్ బాయ్ ద్వారా కరోనా అంటుకుంటుందనే భయమే దీనికి ప్రధాన కారణం..! అదే సమయంలో హ్యాకర్స్(పేపర్ బాయ్స్) సైతం పేపర్ వేసేందుకు బయపడుతున్నారు. ఏ ఇంటికి వెళ్తే…ఏ వ్యక్తి ద్వారా కరోనా వస్తోందో అనే భయంతో పేపర్ డిస్ట్రిబ్యూషన్‌కు విముఖత చూపుతున్నారు. దీంతో రోజూ పెద్ద సంఖ్యలో పేపర్లు తిరిగి పబ్లిషింగ్ హౌజ్‌లకు చేరుతున్నాయి. పటిష్టమైన పంపిణీ వ్యవస్థ కలిగిన ఈనాడు సైతం దీనికి మినహాయింపు కాదంటే పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు.
కరోనా నేపథ్యంలో పత్రికా సంస్థలు న్యూస్ ప్రింట్ కొరతనెదుర్కొంటున్నాయి. దేశంలోని న్యూస్ పేపర్లు చైనా, దక్షిణ కొరియా తదితర దేశాల నుంచి న్యూస్ ప్రింట్‌ను దిగుమతి చేసుకుంటున్నాయి. కరోనా నేపథ్యంలో చైనా నుంచి దిగుమతులు కష్టంగా మారాయి. దీంతో ప్రస్తుతం దినపత్రిలక వద్ద ఉన్న న్యూస్ ప్రింట్ నిల్వలు క్షీణించాయి. ఓ వైపు న్యూస్ ప్రింట్ కొరత, లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో పత్రికలు పలు చర్యలకు ఉపక్రమించాయి. ఇందులో భాగంగా సాక్షి ఇప్పటికే స్కూల్ ఎడిషన్, జిల్లా టాబ్లాయిడ్‌లో వచ్చే విద్య పేజీలను నిలిపివేయగా, మెయిన్, ఫ్యామిలీ, జిల్లా టాబ్లాయిడ్ పేజీల సంఖ్యను తగ్గించింది. ఈనాడు సైతం 16 జిల్లా టాబ్లాయిడ్‌ను 8 పేజీలకు కుదించింది. ఆంధ్రజ్యోతి మెయిన్ పేజీల సంఖ్యను తగ్గించడంతోపాటు బుధవారం నుంచి జిల్లా పేజీలు మెయిన్‌లో ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
వర్క్ ఫ్రమ్ హోమ్…! సాధారణంగా ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల నుంచి ఈ పదం వింటుంటాం. కానీ, ఇప్పుడు పత్రికా సంస్థలు సైతం ఇదే జపం చేస్తున్నాయి. ఆఫీసుల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించే లక్ష్యంతో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలుచేస్తున్నాయి. కొన్ని విభాగాలకు సెలవులు ప్రకటిస్తున్నాయి. పైగా లాక్‌డౌన్ నేపథ్యంలో పోలీసులు మీడియా ప్రతినిధులపై దాడులకు పాల్పడుతుండటంతో జర్నలిస్టులు సైతం ఆఫీసులు, కార్యక్షేత్రాలకు వెళ్లేందుకు బయపడుతున్నారు. వీటన్నిటినీ చూస్తుంటే రానున్న రోజుల్లో పత్రికలు సైతం తాత్కాలికంగా మూతపడే అంశాన్ని కొట్టిపారేయలేం…!
తాజాగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలను యథాతథంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. అదే విధంగా న్యూస్ ప్రింట్ రవాణాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. దీంతోపాటు మీడియాను అత్యవసర సేవల విభాగంలో చేర్చి ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించేలా కృషి చేయాలని కోరింది. రాష్ట్రం, దేశంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేర్చి…వదంతులు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మీడియా తప్పనిసరని ప్రకటించింది. ఇది ఒక రకంగా సమర్థనీయమని చెప్పాలి. తాజాగా గాంధీ ఆస్పత్రిలో ఇతరత్రా కారణాలతో చనిపోయిన వ్యక్తిని కరోనా అనే భయంతో ఊరిలోకి రాకుండా అడ్డుకున్న సంఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. వార్తా పత్రికలు, న్యూస్ చానెళ్లు కనుక నిలిచిపోతే ఇలాంటి మరిన్ని వదంతులు వ్యాప్తి చెంది…జనాల్లో లేనిపోని భయాందోళనలు రేకెత్తే అవకాశం లేకపోలేదు.
న్యూస్ పేపర్లు కేంద్రంగా కరోనా వ్యాప్తిపై వస్తున్న వార్తలపై పత్రికా యాజమాన్యాలు సైతం స్పందిస్తున్నాయి. ఈ దిశగా వార్తలను ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి. నిన్న ఇదే అంశంపై ఈనాడు డాక్టర్ ద్వారా ఓ వార్తా కథనం ప్రచురించగా, పేపర్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందదనే డబ్ల్యూహెచ్‌వో ప్రకటనను ఆంధ్రజ్యోతి, సాక్షిలు ప్రముఖంగా ప్రచురించాయి. ఏదేమైనా ఈ పరిణామాలు చూస్తుంటే న్యూస్ పేపర్లకు గడ్డుకాలం ప్రారంభమైందా…అనే అనుమానం రేకెత్తుతోంది….!