సినిమాకు కరోనా – అబ్ క్యా కర్నా

ప్రపంచవ్యాప్తంగా తన గురించి తప్ప ఇంకో టాపిక్ లేకుండా చేసిన కరోనా వైరస్ అసలు ఎప్పుడు పూర్తిగా కనుమరుగవుతుందో పేరు మోసిన డాక్టర్లు, శాస్త్రవేత్తలు సైతం చెప్పలేకపోతున్నారు. ఇప్పటికే తెలంగాణతో పాటు అన్ని ప్రధాన రాష్ట్రాల్లోనూ అధికారిక బంద్ కొనసాగుతోంది. థియేటర్లు, మాల్స్, స్కూల్స్ అవి ఇవి అనే తేడా లేకుండా అన్ని మూతబడ్డాయి. బాలన్స్ ఉన్న స్టేట్స్ కూడా రేపో ఎల్లుండో ఈ బాట పట్టక తప్పదు. మరోవైపు నిర్మాతలు, దర్శకులు, హీరోలు తమ ఆఫీసులకు తాళాలు వేసి సందర్శకులకు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. చాలా అవసరమైతే తప్ప గడప దాటి బయటికి రావడం లేదు.

పూరి జగన్నాధ్ లాంటి వర్క్ హాలిక్ సైతం ఎవరూ తన కార్యాలయం క్లోజ్ అని అఫీషియల్ నోట్ ఇచ్చేశాడు. అందరికీ ఇదే పరిస్థితి. ఇప్పటికిప్పుడు సినిమా హాళ్ళు తెరిచినా జనం భయంతో రాలేరు. కాబట్టి విడుదలలు వాయిదా వేస్తూ పోవడం తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడు పోస్ట్ పోన్ అయిన షూటింగులతో పాటు రిలీజ్ వాయిదా పడిన సినిమాలను రీ షెడ్యూల్ చేయడం కత్తి మీద సాములా మారబోతోంది. ఇప్పటిదాకా టాలీవుడ్ కు జోష్ ఇచ్చిన సినిమాలు చాలా తక్కువ. అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, హిట్ లాంటి నాలుగైదు తప్ప బయ్యర్లకు డబ్బిలిచ్చినవి తక్కువే.

ఇప్పుడు విడుదల క్యులో నాని వి, అనుష్క నిశబ్దం, రానా అరణ్య, వైష్ణవ్ తేజ్ ఉప్పెన వెంటనే ఉన్నాయి. వీటి డేట్లు మారిస్తే ఆపై ప్లాన్ చేసుకున్న రామ్ రెడ్, కీర్తి సురేష్ మిస్ ఇండియాల ప్లాన్స్ కిందామీదా అయిపోతాయి. ఇవి చాలదన్నట్టు నిర్మాణం ఫినిషింగ్ స్టేజిలో ఉన్న అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, నాగ చైతన్య లవ్ స్టోరీ, రవితేజ క్రాక్, సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటరూ లాంటివీ పునరాలోచనలో పడాలి. వీటిదాకా ఎందుకు ఎప్పుడో ఆగస్టుకు అనుకున్న చిరంజీవి ఆచార్య సైతం చిక్కుల్లో పడిపోయింది. అన్ని సినిమాలకు ఆర్టిస్టుల కాల్ షీట్స్ రెండు వారాల పాటు వృధా అయ్యాయి. అన్నిసర్దుబాటు చేసి ఒకేతాటిపైకి తీసుకొచ్చే లోపల ప్రొడక్షన్ మేనేజర్లకు చుక్కలు కనిపించేలా ఉన్నాయి. మొత్తానికి కరోనా వైరస్ అందరిని క్యా కర్ణా(తెలుగులో ఏం చేయాలి)అనిపించేలా చేసింది. దీనికి ఎప్పుడు శుభం కార్డు పడుతుందో చూడాలి.

Show comments