iDreamPost
android-app
ios-app

మధ్యప్రదేశ్ బీజేపీకి షాకిచ్చిన “కరోనా”..

మధ్యప్రదేశ్ బీజేపీకి షాకిచ్చిన “కరోనా”..

కరోనా వైరస్ కారణంగా ప్రపంచం వణుకుతుంటే దేశంలో రాజకీయాలు మాత్రం వేడెక్కుతున్నాయి. కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ ప్రకటించడంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల కమీషనర్ తీరుపై బహిరంగ విమర్శలు చేశారు. కాగా ఇప్పుడు కరోనా సెగ మధ్యప్రదేశ్ రాజకీయాలను కూడా తాకింది.

మధ్యప్రదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈరోజు మధ్యప్రదేశ్ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నేడు అసెంబ్లీలో కాంగ్రెస్ ను బలాన్ని నిరూపించుకోవాలని లాల్జీ టాండన్ సూచించారు. దీంతో బలనిరూపణ పరీక్షలో కమల్ నాథ్ సర్కారు కూలిపోతుంది కాబట్టి మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అందుకు అనుగుణంగా పావులు కదిపింది.

కానీ స్పీకర్ ప్రజాపతి అసెంబ్లీలో బలనిరూపణకు ఆదేశించకుండా కరోనా సాకు చూపిస్తూ ఈ నెల 26 కి మధ్యప్రదేశ్ అసెంబ్లీని వాయిదా వేయడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కలలు కన్న బీజేపీ షాక్ తగిలింది. నేడు సభలో బలనిరూపణ పరీక్ష నిర్వహించాలని మధ్య ప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ స్పీకర్ ప్రజాపతిని ఆదేశించారు. కమల్ నాథ్ కూడా స్పీకర్ ఆదేశిస్తే తాము బలపరీక్షకు సిద్ధమని ప్రకటించారు. కాగా నేటి మధ్యప్రదేశ్ అసెంబ్లీ షెడ్యూల్ లో బలపరీక్ష అంశాన్ని స్పీకర్ చేర్చలేదు. దీంతో ఈరోజు బాల పరీక్ష నిర్వహించే అవకాశం లేదని,మరుసటి రోజు జరిగే అవకాశం ఉందని ఊహాగానాలు చెలరేగాయి.

బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్‌ లాల్జీ టాండన్‌ బలపరీక్ష తక్షణమే చేపట్టాలని స్పీకర్‌ను కోరారు. మరోవైపు సభను గౌరవించాలని కాంగ్రెస్‌ సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేస్తుండగా సోమవారం బలపరీక్ష జరపాలని పట్టుపట్టిన గవర్నర్‌ అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు.

కాగా స్పీకర్ ప్రజాపతి అసెంబ్లీని 26 వరకూ వాయిదా వేయడంతో మరికొన్ని రోజులు కమల్ నాథ్ కు ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే సమయం మరింత దొరికింది. దీంతో స్పీకర్ నిర్ణయంపై బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేసారు. ఈ విధంగా కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికలు మాత్రమే కాదు ఈరోజు నిర్వహించాల్సిన మధ్యప్రదేశ్ బలపరీక్ష కూడా వాయిదా పడింది.