దేశంలో ప్ర‌తి లక్ష జనాభాకు కేవ‌లం 0.2 మ‌ర‌ణాలు మాత్ర‌మే…అదే ప్ర‌ప‌చంలో అయితే 4.1 మ‌ర‌ణాలు

ప్రపంచ మొత్తం మీద ప్రతి లక్ష జనాభాకు కరోనా వల్ల మరణించిన వారి సంఖ్యతో పోల్చినప్పుడు ఇండియా పరిస్థితి మెరుగ్గా ఉంద‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి లక్ష జనాభాకు 4.1 మరణాలు సంభవించగా ఇండియాలో ప్రతి లక్ష జనాభాకు 0.2 మరణాలు నమోదయ్యాయి.

డ‌బ్ల్యుహెచ్ఒ నివేదిక ప్ర‌కారం వివిధ దేశాల్లో మ‌ర‌ణాల సంఖ్య‌
కోవిడ్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యుహెచ్ఒ) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 3,11,847 మంది మ‌ర‌ణించారు. ప్ర‌తి ల‌క్ష‌ జనాభాకు మరణాల సంఖ్య 4.1 న‌మోదు అయ్యాయి.

అమెరికాలో 87,180 ( ప్ర‌తి ల‌క్ష జ‌నాభాకు 26.6 మర‌ణాలు ), బ్రిటన్ లో 34,636 (52.1), ఇటలీలో 31,908 (52.8), ఫ్రాన్స్ లో 28,059 (41.9), స్పెయిన్ లో 27,650 (59.2), బ్రెజిల్ లో 15,633 (7.5), బెల్జియంలో 9,052 (79.3), జర్మనీలో 7,935 (9.6), ఇరాన్ లో 6,988 (8.5), కెనడాలో 5,702 (15.4), నెదర్లాండ్స్ లో 5,680 (33.0), మెక్సికోలో 5,045 (4.0), చైనా 4,645 (0.3), టర్కీలో 4,140 (5.0), స్వీడన్ లో 3,679 (36.1), ఇండియాలో 3,163 (0.2) మ‌ర‌ణాలు సంఖ్య ఉంది.

దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 24,25,742 మందికి ప‌రీక్ష‌లు
దేశంలో తక్కువ మరణాలు సంభవించడానికి గ‌ల‌ కారణం సమయానికి కేసులను గుర్తించి వైద్య చికిత్సలు జరపడమ‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 24,25,742 నమూనాలను పరీక్షించిన‌ట్లు వివ‌రించింది. దేశంలో కోవిడ్ -19 పరీక్షలు జరిపే ప్రయోగశాలలు జనవరిలో ఒకే ఒకటి ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య బాగా పెరిగింద‌ని తెలిపింది. ప్ర‌స్తుతం దేశంలో 385 ప్రభుత్వ, 158 ప్రైవేటు ప్రయోగశాలు అందుబాటులో ఉన్నాయ‌ని పేర్కొంది. ఇంకా ఎక్కువ సంఖ్యలో పరీక్షలు జరపడానికి ట్రూనాట్, సిబినాట్ వంటి పరీక్షలను ఉపయోగిస్తున్నారని తెలిపింది.

దేశంలో 2.9 శాతం మంది ఐసియులో ఉన్నారు

దేశంలో ఇప్పటి వరకు 39,174 మంది కోవిడ్ -19 వ్యాధి నుంచి బయటపడ్డారు. అంటే కోవిడ్-19 రోగులలో 38.73% మందికి నయమైంది. ఇండియాలో ప్రస్తుతం 58,802 మందికి చికిత్స కొనసాగుతోంది. వీరంతా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో 2.9 శాతం మంది ఐసియులలో ఉన్నారు.

Show comments