కరోన రెడ్‌ అలర్ట్‌ : రెడ్‌జోన్‌లో ఏపీలోని ఏడు జిల్లాలు

కరోన వైరస్‌ పాజిటివ్‌ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా పలు జిల్లాలో కరోన వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత నెల 25వ తేదీ నుంచి అమలవుతున్న లాక్‌డౌన్‌ ఈ నెల 14వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో కరోన పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై పునరాలోచన చేసే అవకాశం ఉంది.

దేశ వ్యాప్తంగా కరోన వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న 96 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం రెడ్‌జోన్లుగా ప్రకటించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు జిల్లాలు ఉండడం సర్వత్రా ఆందోళన నెలకొంది. ఏపీలోని విశాఖ, చిత్తూరు, తూర్పుగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కృష్ణ, గుంటూరు జిల్లాలను రెడ్‌జోన్లుగా ప్రకటించింది.

తెలంగాణలో మూడు జిల్లాలను దీని పరిధిలోకి తెచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలు రెడ్‌జోన్‌ పరిధిలో ఉన్నాయి. ఈ జిల్లాల పరిధిలో వైరస్‌ హాట్‌స్పాట్‌లను గుర్తించి నియంత్రణ చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ నుంచి వచ్చిన వారికి, వారి బంధువులకు వెంటనే వైద్య పరీక్షలు చేయాలని సూచించింది. వారందరినీ క్వారంటైన్‌ చేయాలని పేర్కొంది. ఆయా జిల్లాల్లో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.

Show comments