Idream media
Idream media
స్కూల్లో ఆఖరు పరీక్ష రాస్తున్నప్పుడు ఏదో తెలియని సంతోషం. బయట ఎండ పెటపెటలాడుతున్నా మనసులో చల్లదనం. ఎందుకంటే దాదాపు రెండు నెలల సెలవులు. స్కూల్ బెల్ శబ్దం గుండెల్లో వినపడదు. హోమ్‌వర్క్ అయ్యవార్లు ఉండరు (అయితే ట్యూషన్‌కి పంపాలనే దుష్టపన్నాగం ఆల్రెడీ ఇంట్లో సిద్ధమయ్యేది. ఆ ఉచ్చు నుంచి బయట పడే మార్గాలు కూడా మెదడులో ఉండేవి).
పరీక్ష రాసి బయటికి రాగానే ఐస్ క్రీం సాయిబు ఒక చెక్క పెట్టెలో పుల్ల ఐస్‌తో సిద్ధంగా ఉండేవాడు. జీవించడానికి ఆయన ఎన్నో పనులు చేసేవాడు. పగలంతా ఐస్ క్రీం, సాయంత్రం ఒక కావిడిలో సోన్ పాపిడి, ఉదయం నాన్‌రొట్టె. ఎప్పుడూ రోడ్‌మీదే, ఇంటికి ఎప్పుడు పోతాడో తెలియదు. ఐదు పైసలిస్తే చల్లటి పుల్ల ఐస్. పుల్ల కూడా కొరుక్కు తినేసేలా నాకే వాన్ని. భగభగ మండే నేల. ఎవడికీ చెప్పులుండేవి కావు. ఒకవేళ ఇంట్లో కొనిపెట్టినా , ఆ సాయంత్రానికే ఎక్కడో వదిలేసి ఉత్తకాళ్లతో ఇళ్లు చేరేవాళ్లం. సమ్మర్‌లో ఆడాల్సిన ఆటలు అప్పటికే డిసైడ్ అయ్యి ఉండేవి. ఇవి ఎవరు డిసైడ్ చేస్తారో ఎవడికీ తెలియదు. అజ్ఞాత వ్యక్తి ఆదేశించినట్టుగా కొన్నాళ్లు గోలీలు, చిల్లాకట్ట, బొంగరాలు నడిచేవి.
అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆ సాయంత్రం సినిమా చూడడం. ఎన్టీఆర్ కత్తితో పోస్టర్ మీద సిద్ధంగా ఉండేవాడు. ఉన్నవి రెండు థియేటర్లు, ఒక టెంట్. మూడు ప్రేక్షకునికి సినిమా చూపించేవే. పుష్కలంగా నల్లులు, మసక మసక తెర, కిర్రోం కిర్ అని అరిచే ఫ్యాన్లు. ప్యాలెస్ థియేటర్‌లో అయితే మూత్రశాలల కంపు. పోయడమే తప్ప కడగడం ఉండదు.
ఇంటికి దగ్గర కాబట్టి ప్యాలెస్‌కే వెళ్లేవాళ్లం. ఆ రోజు ఉదారంగా బెంచి టికెట్ 75 పైసలకి, శనక్కాయల ఖర్చు 25 పైసలు కలిపి ఒక రూపాయి నోటు. మేము కక్కుర్తి కొద్ది 40 పైసలతో నేల క్లాస్‌లో ల్యాండ్ అయ్యేవాళ్లం. కరెంట్ పోవడం ప్రకృతి నియమం కాబట్టి కరెంట్ పోయిన మరుక్షణం కన్ను మూసి తెరిచేలోగా బెంచీల్లోకి దూకేవాళ్లం. చీకట్లో ఎవడో ఒకడి మీద జంప్ చేస్తే వాడు గ్యారెంటీగా మన ఫ్రెండ్ అయ్యేవాడు. వాడు అసూయతో మనల్ని గేట్ కీపర్‌కి పట్టించే ప్రయత్నం చేసేవాడు. క్రీస్తునే పట్టించిన లోకం, మనల్ని వదులుతుందా?
బెంచి మీద సెటిల్ అయిన వెంటనే నల్లులు నిక్కర్లోకి యాత్రను ప్రారంభించేవి. జనమంతా ఉలిక్కి పడుతూ సినిమా చూసేవాళ్లు. రసవత్తరమైన సీన్స్‌లో ఇవి రక్తం తాగేవి. ఫ్యాన్లు తిరిగేవి కానీ, గాలి వచ్చేది కాదు. తెర మీద సైలెంట్ సీన్ వచ్చినపుడు “కిరాక్ కిరాక్” అని ఈ ఫ్యాన్లు సంగీతాన్ని అందించేవి. మధ్యలో శనక్కాయల వాళ్లు , సోడాల వాళ్లు మన కాళ్లని పచ్చడి కింద తొక్కుతూ వ్యాపారం చేసేవాళ్లు.
సినిమా అయిపోగానే కథ చెప్పుకుంటూ నడిచేవాళ్లం. రామశేఖర్ అని ఒకడుండే వాడు. ఏ సినిమాలో అయినా సగం సినిమా నిద్రపోయేవాడు. కుట్టికుట్టి నల్లులే అలిసిపోయేవి కానీ, వాడు మాత్రం నిద్రలేచే వాడు కాదు. శుభం పడిన తర్వాత వాడికి భారీగా కుదిపితే లేచేవాడు. నిద్రపోయిన తర్వాత జరిగిన కథంతా వాడికి చెప్పడం ఎగ్జామ్ రాయడం కంటే కష్టం.
సినిమాలు చూసి చూసి బోర్ కొట్టిన నల్లులు కుటుంబ సమేతంగా నిక్కర్లలోకి దూరి ఇళ్లకు వలస వచ్చేవి. నవారు మంచాల్లో నివాసం ఉండి పీక్కు తినేవి. కిరోసిన్‌తో సంహారం చేయడం అదో పెద్ద ఎపిసోడ్.
ఊరి బయట తోటల్లో బావులుండేవి. వెళ్లి దూకేసేవాళ్లం. ఈతరానివాళ్లు చాలా అరుదు. ఎండాకాలం అంటే జాతరల కాలం. రంగుల కళ్లద్దాలు, పిల్లంగోవి , బొరుగులు, బెండు బత్తాసులు. ఎన్ని కొన్నా రూపాయి ఖర్చు అయ్యేది కాదు.
ఎండలు మంటలు తీర్చడానికి హఠాత్తుగా వాన పడేది. ఇసుకలో గుడి వెలిసేది. చూస్తూ ఉండగానే జూన్ వచ్చేసేది. కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యేది. పుస్తకాల సంచి మెడకు తగులుకునేది. సినిమాల్లో ఎన్టీఆర్ కత్తిలా , అయ్యవారి బెత్తం సర్‌మని సౌండ్ చేసేది.
ఇళ్లలో మ్యాగీలు చేసే అమ్మలు లేరు. తినమని బతిమలాడే వాళ్లు లేరు. బ్రాండెడ్ బట్టలు లేవు. కాళ్లకి చెప్పుల్లేవు. అయినా బాల్యమనే సంతోషం ఉండేది.
ఇప్పటి పిల్లలకి చాలా ఉన్నాయి. బాల్యమే లేదు.