iDreamPost
iDreamPost
పుష్పలో సమంత చేసిన ఐటెం సాంగ్ ఊ అంటావా ఊహూ అంటావా పాట మీద పురుషుల సంఘం కోర్టుకు వెళ్లిందనే వార్త మీడియాలో గట్టిగానే చక్కర్లు కొడుతోంది. తమ మనోభావాలు దెబ్బతీశారని, మగాళ్ల బుద్ధే ఇంత అంటూ పదే పదే కించపరిచారని అందులో పేర్కొన్నారట. ఇది నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకోకుండానే వార్తలు వేసేస్తున్నారు. అసలు ఆ మగాళ్ల సంఘం ఎక్కడ ఉందో, రిజిస్టర్డ్ సంస్థ అవునో కాదో. ఏ ప్రాంతం కార్యాలయం నుంచి కేసు దాఖలు చేసారో లాంటి వివరాలు ఒక్కళ్ళు కూడా ఇవ్వలేదు. దీన్ని బట్టి అర్థమవుతోంది ఏంటంటే ఇదంతా వట్టి హంబక్ స్ట్రాటజీ తప్ప ఇంకే కారణం లేదు. ఎవరు సృష్టించారో మరి.
ఒకవేళ నిజమే అనుకుని న్యాయస్థానం మెట్లు ఎక్కినా క్షణాల్లో కేసుని డిస్మిస్ చేయడం ఖాయం. గతంలో రణం సినిమాలో అలీ క్యారెక్టర్ పాడే పాట ఒకటుంటుంది. నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్లను నమ్మొద్దు అంటూ. అప్పట్లో మహిళా సంఘాలు దీని మీద ఎలాంటి స్పందన వ్యక్తపరచలేదు. మణిశర్మ స్వరపరిచిన ఈ సాంగ్ బాగానే హిట్ అయ్యింది. మన్మథుడులో వద్దురా సోదరా అంటూ పెళ్లికి వ్యతిరేకంగా పాట రాయించినా అందులో అర్థం భార్య వచ్చాక జీవితం నాశనం అవుతుందనే ఉంటుంది. అప్పుడూ ఎవరూ అభ్యంతర పెట్టలేదు. కానీ ఇప్పుడు అంతగా ఆందోళన చెందే అవసరమే లేని పుష్ప గీతం మీద రచ్చ చేయడం కామెడీనే.
యూనిట్ ఇలాంటి వాటి మీద స్పందించేంత తీరికలో లేదు. చేతిలో కేవలం నాలుగు రోజులే ఉండటంతో ప్రమోషన్ల కోసం కిందా మీద పడుతున్నారు. అల్లు అర్జున్ ఇవాళ చెన్నై మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. పూర్తి తమిళంలో మాట్లాడి అక్కడి అభిమానులను ఆకట్టుకున్నారు. సుకుమార్ ఇంకా బయటికి రాలేదు. చివరి నిమిషం పనులు ఇంకా ఉన్నట్టున్నాయి. ఓవర్సీస్ తో పాటు హైదరాబాద్ లాంటి నగరాల్లో బుకింగ్స్ మంచి జోరు మీదున్నాయి. ఓపెనింగ్స్ రికార్డులు ఖాయమనే అంటున్నారు. అఖండ ఇచ్చిన ఊపుని ఇది కంటిన్యూ చేస్తుందనే నమ్మకం ట్రేడ్ లో ఉంది. సినిమా హైలైట్స్ లో ఊ అంటావా పాట కూడా ఉందంటున్నారు
Also Read : Maa Oori Polimera : మా ఊరి పొలిమేర రిపోర్ట్