iDreamPost
android-app
ios-app

జస్టిస్ రాకేశ్ కుమార్ ఎవరు, ఆయన చుట్టూ ఎందుకీ వివాదాలు?

  • Published Dec 22, 2020 | 5:22 AM Updated Updated Dec 22, 2020 | 5:22 AM
జస్టిస్ రాకేశ్ కుమార్ ఎవరు, ఆయన చుట్టూ ఎందుకీ వివాదాలు?

ఇటీవల ఏపీ హైకోర్టు నుంచి వెలువడిన రెండు ఉత్తర్వులు దేశమంతా చర్చనీయాంశమయ్యాయి. చివరకు సుప్రీంకోర్ట్ లో తిరస్కరణకు గురయ్యాయి. వాటిలో ఒకటి గ్యాగ్(GAG) ఆర్డర్ కాగా రెండోది ఏపీలో రాజ్యాంగ సంక్షోభం అంటూ ప్రారంభమయిన విచారణ.

మొదటిది అమరావతి భూ కుంభకోణంలో సుప్రీంకోర్ట్ జడ్జి ఎన్ వి రమణ కుమార్తెలతో పాటు మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కి సంబంధించి ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. దమ్మాలపాటి గ్యాగ్ ఆర్డర్ కోరితే వాటిని మిగిలిన అందరికీ వర్తింపజేస్తూ కోర్టుని ఆశ్రయించిన వారికి కూడా అవకాశం ఇచ్చిన తీరు మీద సుప్రీంకోర్ట్ విస్మయం వ్యక్తం చేసింది. చివరకు గ్యాగ్ ఆర్డర్ చెల్లదని స్పష్టం చేసింది.

రెండో అంశం కొందరు పోలీసులు తమను అక్రమంగా నిర్బంధించారంటూ నమోదయిన హెబియస్ కార్పస్ పిటీషన్ కి సంబంధించినది. ఆ విచారణ సందర్బంగా జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ ఉమాదేవితో కూడిన బెంచ్ రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందంటూ అభిప్రాయపడడమే కాకుండా, దానిపై విచారణ కూడా ప్రారంభించారు. అలాంటి విషయాలు హైకోర్టు పరిధిలో లేనివంటూ ఏపీ ప్రభుత్వం అభ్యంతరం పెట్టినా ససేమీరా అంటూ రాజ్యాంగ సంక్షోభానికి సంబంధించి అంశాన్ని విచారణకు స్వీకరించింది. ఏపీలో రాజ్యాంగం అమలవుతుందో లేదో తేల్చి చెబుతామంటూ విచారణకు పూనుకున్న ఏపీ హైకోర్టు తీరుపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్లింది. చివరకు అక్కడ మథ్యంతర ఉత్తర్వులు ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ హైకోర్టు తీరుపై ఆందోళన కూడా వ్యక్తం చేసింది.

అదే సమయంలో జస్టిస్ రాకేశ్ కుమార్ ని విచారణ నుంచి వైదొలగాలంటూ వివిధ కేసులలో ఏపీ ప్రభుత్వం పిటీషన్లు వేసింది. తన పరిధిలో లేని అంశాలను కూడా విచారణకు స్వీకరించి, ఏపీ ప్రభుత్వంపై ఘాటుగా స్పందించిన నేపథ్యంలో ప్రభుత్వం అనివార్యమైన స్థితిలో ఇలాంటి కేసుల్లో ఆయన వైదొలగాలని కోరినట్టు చెబుతోంది. ఇప్పటికే రెండు కేసులలో ఆయనపై ఇలాంటి పిటీషన్లు దాఖలు చేయగా తాజాగా ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేసే కేసుకి సంబంధించిన విచారణ సందర్భంగా కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఊపిరి ఉన్నంతవరకూ న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడుతానంటూ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ రిక్విజేషన్ పిటీషన్లపై ఆవేదన వ్యక్తం చేస్తూ తన కెరీర్ చివరిలో ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోయారు.

ఈనెలాఖరుతో పదవీ విరమణ చేయబోతున్న జస్టిస్ రాకేశ్ కుమార్ తీరు ఇప్పుడు ఆసక్తిగా మారింది. అసలు ఆయన ఇంతకీ ఎవరు అనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. బీహార్ కి చెందిన రాకేశ్ కుమార్ 1983 నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్నారు. పట్నా హైకోర్టులో 26 ఏళ్ల పాటు పనిచేశారు. సీబీఐ తరుపున స్టాండింగ్ కౌన్సిల్ గా 12 ఏళ్ల పాటు విధులు నిర్వహించారు. పాట్నా హైకోర్టులోనే 2009లో తాత్కాలిక జడ్జిగా బాధ్యతలు స్వీకరించి, 2011లో పూర్తి కాల న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. గత ఏడాది నవంబర్ లో ఏపీ హైకోర్టు కి బదిలీపై వచ్చారు. ఈ నేపథ్యంలో రాకేశ్ గత ఏడాది కాలంగా వివిధ కేసుల విచారణ సందర్భంగా ప్రభుత్వ తీరు మీద తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇటీవల సీఎం జగన్ నేరుగా సుప్రీంకోర్ట్ సీజేకి చేసిన ఫిర్యాదులో అలాంటి అంశాలను కూడా ప్రస్తావించిన విషయం గమనార్హం.

ఈ నేపథ్యంలో రాకేశ్ కుమార్ వ్యవహారశైలి చర్చనీయాంశం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా సాగకపోతే దానికి అడ్డుకట్ట వేయాల్సిన హైకోర్టు దానికి భిన్నంగా ఏకంగా రాజ్యాంగమే అమలుకావడం లేదని భావించడం విశేషంగా మారింది. హైకోర్టు కూడా అదే రాజ్యాంగ పరిధిలో ఉన్నప్పటికీ హద్దులు మీరినట్టుగా పలువురు న్యాయనిపుణులు భావించే పరిస్థితి వచ్చింది. గవర్నర్ ప్రతిపాదనతో, రాష్ట్రపతి నిర్ణయం మేరకు ఏ రాష్ట్రంలోనయినా రాజ్యాంగ సంక్షోభానికి సంబంధించిన అంశాలు ప్రస్తావనలోకి వస్తాయి. కానీ ఏపీలో మాత్రం ఏకంగా హైకోర్టు అందులో తలదూర్చడం అభ్యంతరకరంగా మారింది. అలాంటి నిర్ణయాలకు ఆద్యుడిగా ఉన్న రాకేశ్ కుమార్ వ్యవహారం వివాదాస్పదమయ్యింది. చివరకు ఆయన తమ కేసులు విచారించవద్దని కోరాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది.