iDreamPost
android-app
ios-app

70 వసంతాల రాజ్యాంగం

70 వసంతాల రాజ్యాంగం

బ్రిటీష్ వలస పాలనలో ఉన్న భారతదేశంలోని రాష్ట్రాల శాసనసభలకు తొలుత ఎన్నికలు నిర్వహించి, ప్రతి పది లక్షల జనాభాకు ఒక ప్రతినిధి చొప్పున బ్రిటిష్ ఇండియా రాష్ట్రాల నుండి 296 మంది, స్వదేశీ సంస్థానాల నుండి 93 మంది, మొత్తం 389 మంది సభ్యులతో రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచన కోసం ఏర్పడింది.

రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం 9 డిసెంబర్ 1946 పార్లమెంట్ లోని సెంట్రల్ హాల్లో జె.బి.కృపలానీ ఆధ్వర్యంలో జరిగింది. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హా ఎంపిక కాగా, తమకు ప్రత్యేక దేశం, ప్రత్యేక రాజ్యాంగ పరిషత్ కావాలని డిమాండ్ చేస్తూ ముస్లింలీగ్ ఈ సమావేశాన్ని బహిష్కరించింది.రాజ్యాంగ పరిషత్ లో 82 శాతం మంది కాంగ్రెస్ సభ్యులే ఉన్నప్పటికీ భిన్న దృక్పథాల కలిగిన వ్యక్తులు కూడా ఉండటంతో రాజ్యాంగ నిర్మాణాన్ని పార్టీ వ్యవహారంగా చూడకుండా రాజ్యాంగపరమైన అంశాలలో విశేషానుభవం కలిగిన ప్రముఖులకు రాజ్యాంగ పరిషత్ లో సముచిత స్థానమును భారత జాతీయ కాంగ్రెస్ కల్పించింది. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే డాక్టర్. బిఆర్ అంబేద్కర్ కు రాజ్యాంగ ముసాయిదా రచన కమిటీ సారథ్యాన్ని అప్పగించడం నాటి కాంగ్రెస్ నాయకుల దార్శనికతకు మచ్చుతునక.

భారత రాజ్యాంగ రచనకు కోసం ఏర్పడిన రాజ్యాంగ పరిషత్ వివిధ అంశాల పరిశీలనకు 22 కమిటీలు మరియు 7 ఉప కమిటీలు ఏర్పాటు చేసినప్పటికీ, వీటిలో అత్యంత ప్రాముఖ్యమైన కమిటీ “డ్రాఫ్టింగ్ కమిటీ”.

29 ఆగస్టు 1947న డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ అధ్యక్షుడిగా ఆరుగురు సభ్యులతో ఏర్పాటైన రాజ్యాంగ ముసాయిదా కమిటీ భారతదేశంలో ఉన్న భిన్న భౌగోళిక పరిస్థితులు, జాతులు, మతాల వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని తయారు చేయటం నిజంగా కమిటీకి కత్తిమీద సాములా ఉండేది రాజ్యాంగ పరిషత్ 11 సార్లు సమావేశమై సభ్యులు ఇచ్చిన లిఖిత మౌలిక సూచనలను ముసాయిదా కమిటీ క్రోడీకరించి రాజ్యాంగ పరిషత్ లో చర్చకు పెట్టేది ప్రతి ప్రతిపాదన మరియు సమస్యపై సుదీర్ఘంగా చర్చించి సర్దుబాటు ధోరణితో సమన్వయ పరుచుకుని ఏకాభిప్రాయం సాధించేవారు. అంతేగానీ రాజ్యాంగ పరిషత్ లో రాజ్యాంగంలో ఏ అంశంపై ఓటింగ్ జరపక చర్చ ద్వారా ఏకాభిప్రాయం సాధించడం అనేది సభ్యుల ఔన్నత్యానికి ప్రతీక.రాజ్యాంగ ముసాయిదా తయారీ కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దాదాపు 60 దేశాలకు చెందిన రాజ్యాంగాలను చదివి, వాటిలోని ఉన్నత అంశాలను సంగ్రహించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు కష్టించి సుదీర్ఘ చర్చల తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ హిందీ,ఆంగ్ల భాషలలో రెండు ముసాయిదా ప్రతులను తయారుచేసింది రాజ్యాంగ పరిషత్లో ముసాయిదాపై 115 రోజులు చర్చించి 2473 సవరణలతో రాజ్యాంగాన్ని “26 నవంబర్ 1949” న ఆమోదించారు.

దేశ విభజన అనంతరం రాజ్యాంగ పరిషత్ లో లోని 299 మంది సభ్యులలో 284 మంది రెండు రాజ్యాంగ ప్రతులు పై సంతకాలు చేశారు. రాజ్యాంగ తయారీకి కేవలం 64 లక్షలు మాత్రమే. రాజ్యాంగ అసలు ప్రతిని ఆంగ్లంలో ప్రేమ్ బీహారీ నారాయణ్ రైజదా తన అందమైన దస్తూరితో రాసినప్పటికీ ఇందుకోసం ఎటువంటి పారితోషికం తీసుకోకుండా తీసుకోలేదు రాజ్యాంగం తొలి ప్రతిని సర్వే ఆఫ్ ఇండియా సమకూర్చిన ఫోటోలతో డెహ్రాడూన్ లో ప్రచురించారు. విశిష్ట లక్షణాల సమూహమే భారత రాజ్యాంగం:

395 అధికరణలు, 12 షెడ్యూళ్లతో ఆమోదం పొందిన రాజ్యాంగం 26 జనవరి 1950 నుండి అమల్లోకి వచ్చింది.70 వసంతాలు నిండిన మన రాజ్యాంగం ప్రపంచంలో భారతదేశం గొప్ప ప్రజాస్వామ్యదేశంగా వర్ధిల్లటానికి కారణం. ప్రాథమిక హక్కులు, సర్వస్వతంత్ర న్యాయవ్యవస్థ భారతీయులు స్వేచ్ఛగా జీవించుటకు దోహదపడుతున్నవి. ఆసియా ఖండంలోనేగాక ప్రపంచంలోనే బహుళ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థతో అత్యంత ప్రజాస్వామిక వాతావరణం ఉన్నదేశం మనది.1951లో రాజ్యాంగం అమలులోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే చేసిన భూ సంస్కరణలు, 1976 లో చేసిన 42 వ రాజ్యాంగసవరణ ఒక “మినీ రాజ్యాంగం” రూపకల్పనే అనిచెప్పవచ్చు. అందులో అనేక విషయాలు ఉన్నా సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే మూడు పదాలు మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటుతున్నాయి. భిన్నత్వంలో ఏకత్వం ను కాపాడటంలో భారత రాజ్యాంగం విజయం సాధించినట్లే.

73,74,రాజ్యాంగసరణలు స్థానిక సంస్థలకు ప్రాణం పోశాయి.61 వ రాజ్యాంగ సవరణ యువకులందరికి ఓటు హాక్కు ఇవ్వటం,86వ రాజ్యాంగ సవరణ 14 సంత్సరాల బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్యను ప్రసాదించింది. ఉపాధిహామీ పథకం, సమాచారహక్కు చట్టం , మన ప్రజాస్వామ్య పునాదులను పటిష్టం చేస్తున్నాయి. అయితే భారత రాజ్యాంగంలో అత్యంత వివాదాస్పదమై, రాష్ట్రాలకు మరణశాసనం రాస్తున్నా ఆర్టికల్ 356 వంటి అంశాలను సంస్కరించే వలసిన ఆవశ్యకత ఉంది.

అధికారమే పరమావధిగా విలువలను గాలికి వదిలేసి సర్కస్ ఫీట్లు చేస్తున్నా రాజకీయ పార్టీలు,నాయకులు అధికార కాంక్షను సక్రమ మార్గంలో నడిచే విధంగా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని సమీక్షించి, ప్రక్షాళన గావించి భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను కూడా ఈ సందర్భంగా మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్లు “ఎంత మంచి రాజ్యాంగమైన దానిని అమలు పరిచేవారు చెడ్డవారయితే దాని ఫలితం చెడుగాను, చెడ్డ రాజ్యాంగమైన అమలు పరిచేవారు మంచి వారైతే దాని ఫలం మంచిగా ఉంటుందని” అనే మాటలు గుర్తెరిగి రాజకీయ నాయకులు బాధ్యతగా ప్రవర్తించినప్పుడు మాత్రమే భారత రాజ్యాంగ ఆశయాలు నెరవేరుతాయి.

–Written By Srinivas Racharla