iDreamPost
iDreamPost
ఏపీ బీజేపీలో గ్రూపు తగాదాలు ఈనాటివి కాదు. అప్పట్లో వెంకయ్య నాయుడి హవా కారణంగా భిన్నస్వరాలు పైకి కనిపించేవి కాదు. కానీ పార్టీలో అంతర్గత విబేధాలు మాత్రం స్పష్టంగా ఉండేవి. ఇటీవల టీడీపీ నుంచి మరికొందరు నేతలు వచ్చి చేరిన నేపథ్యంలో ఈ వ్యవహారం మరింత ముదురుతోంది. అందులోనూ టీడీపీ నుంచి వలస వచ్చిన వారికి మింగుడుపడని రీతిలో సోము వీర్రాజు వ్యవహరించడం వారు సహించలేకోతున్నట్టు కనిపిస్తోంది. దాంతో సోము కి సెగ పెట్టాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. దానికి అనుగుణంగా కుట్రలకు తెరలేపారనే అభిప్రాయం బలపడుతోంది.
బీజేపీ ఏపీ శాఖకు అధ్యక్షుడిగా తొలి నెలలోనే సోము వీర్రాజు చెలరేగిపోతున్నారు. పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు చెబుతున్నారు. క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తున్నామని అంటున్నారు. అందుకు అనుగుణంగా వరుసగా సస్ఫెన్షన్లు, ఘాటు లేఖలతో హీటు పుట్టిస్తున్నారు. ఇది బీజేపీలో ఓ సెక్షన్ కి జీర్ణం కావడం లేదు. సుదీర్ఘకాలంగా బీజేపీలో చక్రం తిప్పుతున్న సామాజికవర్గానికి చెందిన నేతలు సహించలేని స్థితికి చేరుతున్నారు. కొత్త గా పార్టీలో చేరిన చంద్రబాబు అనుకూలురికి కూడా అంతుబట్టడం లేదు. దాంతో అధిష్టానం నుంచి సోము వీర్రాజుకి చెక్ పెట్టకపోతే తమకు మరిన్ని చిక్కులు తప్పవని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. దాంతో హస్తిన నుంచి తమ ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకు తగ్గట్టుగా బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదుల ప్రక్రియ ప్రారంభించారు.
బీజేపీలో తమకు గిట్టని నేతల మీద లేఖలు రాయడం, ఫిర్యాదులు చేయడం చాలాకాలంగా ఉంది. ఇప్పుడు మళ్లీ ఉధృతమవుతోంది. అందుకు తగ్గట్టుగా సోముకి సెగపెట్టాలనే లక్ష్యాలతో అధిష్టానానికి ఫిర్యాదుల పరంపర మొదలెట్టేసినట్టు కనిపిస్తోంది. అమరావతి విషయంలో పార్టీ వైఖరికి భిన్నంగా వ్యవహరించిన అధికార ప్రతినిధిని సస్ఫెండ్ చేయడం, ఆంధ్రజ్యోతిలో రాసిన ఆర్టికల్ తో మరో నాయకుడి మీద వేటు వేయడం వారికి రుచించడం లేదు. అన్నింటికీ మించి రాధాకృష్ణకు నేరుగా రాసిన బహిరంగ లేఖలో సోము వీర్రాజు స్పీడ్ ని ఆ సెక్షన్ తట్టుకోలేకపోతున్నట్టు చెప్పవచ్చు. ఈ పరిణామాలతో ఢిల్లీ బీజేపీ పెద్దల్లో తమకు అనుకూలంగా ఉన్న నేతలను సీన్ లోకి తీసుకొచ్చి సోము వీర్రాజుకి బ్రేకులు వేసే ఆలోచన చేస్తున్నారని సమాచారం.
ఇప్పటికే సోము వీర్రాజు అధ్యక్షుడయిన తర్వాత విష్ణు వర్థన్ రెడ్డి వంటి వారి స్వరంలో కూడా మార్పులు వచ్చాయని బీజేపీలో ఆ వర్గం భావిస్తోంది. ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా వారంతా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తోంది. దాంతో పలు అంశాలతో పదే పదే ఫిర్యాదుల ద్వారా అధిష్టానం వద్ద సోము వీర్రాజుకి చెక్ పెట్టాలనే లక్ష్యంతో సాగుతున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, అధ్యక్షుడి తీరుపై ఎప్పటికప్పుడు లేఖలు రాసే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఆ సెక్షన్ తీరుని సోము వీర్రాజు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. దాంతో ఇరు వర్గాల వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందనేది ఆసక్తికరమే. అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే బీజేపీ అధిష్టానం కూడా పెద్దగా ఇలాంటి ఫిర్యాదులను ఖాతరు చేసే అవకాశం లేదు. కానీ ఎక్కువ ఫిర్యాదులు చేయడం ద్వారా స్పందించేందుకు అవకాశం ఉంటుందని సోము వీర్రాజు వ్యతిరేకులు భావిస్తున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా పార్టీ విధానాలకు అనుగుణంగా బలపరిచే ప్రయత్నంలో ఉన్న తనకు పెద్దగా అడ్డంకులు కల్పించలేరని సోము ధీమాగా ఉన్నారు. దాంతో వీర్రాజు వ్యవహారం సజావుగా సాగనిస్తారా లేదా అన్నది వేచి చూడాలి. ఇలాంటి కుట్రలను చేధించడం పెద్ద సమస్య కాదని, ఏపీలో బీజేపీని బలోపేతం చేసే క్రమంలో ఆటంకాలన్నీ అధిగమిస్తామని సోము వీర్రాజు వర్గీయులు చెబుతున్నారు.