iDreamPost
android-app
ios-app

Telangana congress -కాంగ్రెస్ మార‌దేంట‌య్యా..!?

Telangana congress -కాంగ్రెస్ మార‌దేంట‌య్యా..!?

కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద లోపం కుమ్ములాట‌లు. అన్ని పార్టీల్లోనూ ఇవి సాధార‌ణ‌మే అయినా కాంగ్రెస్ లో కాస్త ప్ర‌త్యేకంగా క‌నిపిస్తాయి. అంత‌ర్గ‌తంగా ఎలాగున్నా.. బ‌య‌ట‌కు బ‌లీయంగా క‌నిపించేందుకు ఇత‌ర పార్టీలు ప్ర‌య‌త్నిస్తుంటే, కాంగ్రెస్ మాత్రం ఇంటా, బ‌య‌టా అదే ర‌చ్చ‌. గ‌ల్లీలో అయినా ఢిల్లీలో అయినా ఒక‌టే గొడ‌వ‌. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక జ‌రిగిన ర‌చ్చ అంద‌రికీ తెలిసిందే. పార్టీతో ద‌శాబ్దాల అనుభ‌వం ఉన్న కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి అదే పార్టీపై ఓ రేంజ్ లో బ‌హిరంగంగా ఫైర్ అయ్యారు. ఏకంగా పార్టీ ఇన్ చార్జిపైనే అవినీతి ఆరోప‌ణ‌లు చేశారు. ఇటువంటి సంఘ‌ట‌న‌లు కాంగ్రెస్ లో కోకొల్ల‌లు. అలాగే పార్టీలో గెలుపోట‌ములు స‌హ‌జం. వాటిపై స‌మీక్ష‌లూ స‌హ‌జ‌మే. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓట‌మికి గ‌ల కార‌ణాల‌ను విశ్లేషించుకోవాల్సింది పోయి.. ఒక‌రిని మ‌రొక‌రు నేత‌లు తూల‌నాడుకోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఏంద‌య్యా ఇదీ.. కాంగ్రెస్ మార‌దేంట‌య్యా.. అని అనుకునే ప‌రిస్థితి వ‌చ్చింది.

మేమింతే మా తీరు మార‌దంతే అన్న‌ట్లుగా తెలంగాణ‌లోని కాంగ్రెస్ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాష్ట్రంలో వాదులాడుకోవ‌డ‌మే కాదు.. ఏకంగా ఢిల్లీలో కూడా అధిష్ఠానం ముందే దుమ్మెత్తిపోసుకుంటున్నారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం సంగ‌తి అటుంచితే, దానిపై జ‌రుగుతున్న స‌మావేశంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న వైనం విచిత్రంగా ఉంది. ఇప్పటికే హుజూరాబాద్‌ ఫలితంపై అధ్యయనం చేసేందుకు కమిటీ వేసిన అధిష్టానం.. ఘోర ఓటమిపై నేతలతో చర్చిస్తున్నారు. 2018 ఎన్నికల్లో 60 వేలకు పైగా ఓట్లు వస్తే.. ఉపఎన్నికలో 3 వేల ఓట్లకే పరిమితం కావడంపై సమీక్షించారు. కేవలం 1.46 శాతం ఓట్లకు పరిమితం కావడంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా ఉంది. అంద‌రినీ ఢిల్లీకి పిలిపించింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స‌హా వర్కింగ్ ప్రెసిడెంట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ త‌దిత‌రులు ఢిల్లీకి వెళ్లారు.

ప‌ద‌మూడు మంది ముఖ్యనేతలతో అధిష్టానం దూత కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారు. ఢిల్లీ సమావేశంలోనూ టీ కాంగ్రెస్ నేతలు అదే తీరుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఒకరిపై మరొకరు ఆరోపణలకు తోడు పాత పంచాయితీలను తోడుకున్నట్లు సమాచారం. అధిష్టాన దూత ముందే ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకున్నట్లు వార్త‌లు రావ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హుజురాబాద్ ఓటమికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైఖరే కారణమని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు గట్టిగా వాదించార‌ట‌. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం కోసం రేవంత్ పనిచేశారని వారు హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు హుజురాబాద్ ఉపఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కనీసం సహకరించలేదని రేవంత్ వర్గం గుర్తు చేస్తోంది.

మ‌రో అంశం ఏంటంటే.. ఢిల్లీ వేదికగా ఒక వైపు వార్‌ రూమ్‌లో హాట్‌ హాట్‌ డిస్కషన్‌ నడుస్తుంటే… మరోవైపు జగ్గారెడ్డి లేఖ దుమారం రేపుతోంది. పార్టీ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌కి లేఖ రాశారు జగ్గారెడ్డి. హుజూరాబాద్‌ రివ్యూకి తనను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. కరీంనగర్‌ పార్లమెంటు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నానని, అభ్యర్థిని మూడు నెలల ముందు ఎందుకు నిర్ణయించలేదని ప్రశ్నించారు. అభ్యర్థి దగ్గర డబ్బులు లేకపోయినా.. పీసీసీ అధ్యక్షుడు పట్టించుకోలేదని లేఖలో పేర్కొన్నారు జగ్గారెడ్డి. నామినేషన్లకు ముందురోజు అభ్యర్థిని నిర్ణయిస్తారా అని ప్రశ్నించారు. ఇలా ప్ర‌తీ అంశంపైనా నేరం నాది కాదు.. త‌న‌దే అంటూ ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం, ఒక‌రిని మ‌రొక‌రు నిందించుకునే పార్టీ అధికారంలోకి రావ‌డం సాధ్య‌మా అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

Also Read : T.Congress – తెలంగాణ కాంగ్రెస్ కు హుజురాబాద్ తలనొప్పి..!