iDreamPost
iDreamPost
ఓటీఎస్ పేదలను దోచుకునే దోపిడీ పథకం అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ పథకం అమలు చేయడానికి కింది స్థాయి సిబ్బంది మనోవేదనకు గురవుతున్నారని ఆరోపించారు. ఓటీఎస్ పథకం నుంచి రూ.5 వేల కోట్లు దోచుకుంటున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్‌కు పేదల పట్ల నిజంగా ప్రేమ ఉంటే ఈ పథకాన్ని ఉచితంగా అమలు చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.
స్వచ్ఛందం అయినప్పుడు దోపిడీ ఎలా సాధ్యం?
ఓటీఎస్ పథకం స్వచ్ఛందం అయినప్పుడు ప్రజలను దోచుకోవడం అనేది ఎలా సాధ్యమో తులసిరెడ్డి చెప్పాలని వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నిర్బంధం, బలవంతం చేయడం, లక్ష్యాలు నిర్దేశం అంటూ మాట్లాడుతున్న తులసిరెడ్డి రాజకీయ విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు (ఓటీఎస్) పథకం తెచ్చిందే పేదలకు వారి ఇంటిపై హక్కు కల్పించడానికి. ఎప్పటి నుంచో వారు ఆ ఇంట్లో ఉంటున్నా ఎటువంటి హక్కులు లేకపోవడంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు.
అత్యవసర సమయాల్లో కూడా క్రయవిక్రయాలకు అవకాశం లేకపోవడంతో ఆస్తి ఉండీ ప్రయోజనం లేని పరిస్థితి నెలకొంది. ఈ దుస్థితిని గమనించిన ప్రభుత్వం వారి ఇంటిపై సంపూర్ణ హక్కు కల్పించడానికి ఓటీఎస్‌ను తీసుకొచ్చింది. 52 లక్షల మందికి లబ్ధి చేకూర్చడానికి ఈ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబర్ 21న ప్రారంభించారు. గ్రామాల్లో రూ.10 వేలు, మున్సిపాల్టీల్లో రూ.15 వేలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో రూ.20 వేలు చెల్లిస్తే ఇంటిపై హక్కును ధ్రువీకరించి, ఉచితంగా రిజిస్ట్రేషన్‌ను చేసి పత్రాలు అప్పగిస్తున్నారు. దీనివల్ల క్రయవిక్రయాలకు అవకాశం ఉండడమే కాక వారసులకు ఆస్తిని చట్టబద్ధంగా వినియోగించడానికి అవకాశం ఏర్పడుతుంది.
రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన
ప్రతిపక్షాలు ఎంతగా దుష్ట్రచారం చేస్తున్నా ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే మూడున్నర లక్షల మందికి పైగా ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారు. పేదల సౌలభ్యం కోసం వారు చెల్లించాల్సిన మొత్తాన్ని రెండు వాయిదాలుగా కట్టేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. పేదల పక్షపాతిగా ప్రభుత్వం ఈ పథకం లబ్ధిని వారికి అందించాలనే ఉద్దేశంతో గ్రామ వలంటీర్లు, వీఆర్వోల ద్వారా అవగాహన కల్పిస్తుంటే ఒత్తిడి చేస్తున్నారని ప్రతిపక్షాలు ప్రచారం చేయడం దుర్మార్గమని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు. సొమ్ము చెల్లించాల్సిన ఈ పథకంలో ప్రభుత్వం ఒత్తిడి ఎలా చేస్తుంది? వారి నుంచి బలవంతంగా రూ.10 వేలు వసూలు చేయడం ఎలా సాధ్యమవుతుంది? అని ప్రశ్నిస్తున్నారు. లబ్ధిదారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినచోట్ల మాత్రమే ఓటీఎస్ అమలు చేస్తున్నారన్న సంగతి తులసిరెడ్డి వంటి వారు తెలుసుకోవాలని సూచిస్తున్నారు.
Also Read : చింతామణి నాటకంపై హైకోర్టు కీలక ఆదేశాలు