iDreamPost
android-app
ios-app

అందుకు ఇదే స‌మ‌యంగా భావిస్తున్న కాంగ్రెస్

అందుకు ఇదే స‌మ‌యంగా భావిస్తున్న కాంగ్రెస్

క‌రోనా దేశంలోకి ప్ర‌వేశించిన తొలి రోజులు.. దానిపై పూర్తిగా అవ‌గాహ‌న ఎవ‌రికీ లేదు. అంత‌టా అల్ల‌క‌ల్లోలం. భ‌యం.. భ‌యంగా దేశం. వెంట‌నే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తెర‌పైకి వ‌చ్చారు. ఎవ‌రూ భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు.. మీకు అండ‌గా కేంద్ర‌ ప్ర‌భుత్వం ఉంది.. అన్ని చ‌ర్య‌లూ తీసుకుంటున్నాం.. అంటూ ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇచ్చారు. యుద్ధ‌ప్రాతిప‌దిక‌న క‌ట్ట‌డి చ‌ర్య‌లు చేప‌ట్టారు. దీంతో దేశంలో మోదీ గ్రాఫ్ అమాంతం పెరిగింది. ప‌లు రాష్ట్రాల‌లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌య‌దుందుభి మోగించింది.

కరోనా రెండో ద‌శ‌లో కట్టడి విషయంలో ఘోరంగా విఫలమైపోయిన మోదీ.. అంటూ ఇంటా బయటా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నారు. పలు సర్వే సంస్థలు చేసిన సర్వేల్లో మోదీ గ్రాఫ్ త‌గ్గుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల వెల్ల‌డైన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల్లో బీజేపీ కి ఒక్క చోట మిన‌హా ఆశాజ‌న‌క‌మైన ఫ‌లితాలు రాలేదు. దీంతో దేశంలో బీజేపీ ప్ర‌భావం త‌గ్గుతుంద‌న్న సంకేతాలు వెలువ‌డుతున్నాయి. దీంతో ఇదే అదునుగా కాంగ్రెస్ త‌న గ్రాఫ్ పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. క‌రోనా కాస్త త‌గ్గుముఖం ప‌ట్టిన వెంట‌నే యాత్ర‌ల‌కు శ్రీ‌కారం చుట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది.

ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న దేశంగా భారత్ రికార్డులకెక్కిపోయింది. అంతేకాకుండా మృతుల విషయంలోనూ దేశంలో పరిస్థితి దారుణంగానే ఉందని చెప్పాలి. ఇలాంటి పరిస్థితిని కట్టడి చేసి… కరోనాను తొలి దశలో కట్టడి చేసిన మాదిరిగా ఇప్పుడు కట్టడి చేసే విషయంలో మోదీ సర్కారు ఘోరంగా విఫలమైన‌ట్లు విమ‌ర్ధ‌లు ఎదుర్కొంటోంది. ఈ చ‌ర్య‌ల వ‌ల్ల మోదీ గ్రాఫ్ క్రమంగా తగ్గిపోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నిక‌ల ఫ‌లితాల ప్ర‌తికూలంగా ఉండ‌డం దీనికి నిద‌ర్శ‌నంగా మారింది. ఇలాంటి స‌మ‌యంలోనే ప్ర‌జ‌ల దృష్టిలో ప‌డితే మేల‌న్న భావ‌న‌లో కాంగ్రెస్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆ ఫ‌లితాల్లో బీజేపీ ఓడినా కాంగ్రెస్ ఏమీ గెల‌వ‌లేదు. స్థానిక పార్టీలే స‌త్తా చాట్టాయి. కాక‌పోతే మోదీ గ్రాఫ్ త‌గ్గిన అవ‌కాశాన్ని అందుకుని త‌మ గ్రాఫ్ పెంచుకోవాల‌నే భావ‌న‌లో కాంగ్రెస్ వ‌ర్గాలు ఉన్నాయి.

ఎలాగూ కరోనా తగ్గేదాకా ఇటు బీజేపీ అయినా అటు కాంగ్రెస్ అయినా… పెద్దగా రాజకీయ యాక్టివిటీస్ మొదలయ్యే పరిస్థితి లేదు. అంటే… రాహుల్ గాంధీని జనాల్లోకి ఏ రీతిన పంపాలన్న దానిపై కాంగ్రెస్ పార్టీకి కొంత మేర సమయం అందుబాటులో ఉన్నట్లే లెక్క. ఈ సమయంలోనే దేశంలోని అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీలను ఆ పార్టీకి చెందిన సీఎంలను పిలిచి మాట్టాడాలని రాహుల్ కోసం ఓ యాత్రను ప్లాన్ చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ కీలక నేతల భావనగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని రాష్ట్రాలను టచ్ చేసేలా యాత్రను ప్లాన్ చేయడం ద్వారా… రాహుల్ గాంధీని నిత్యం జనాల్లో ఉండేలా చేయవచ్చని ఆ పార్టీ ప్లాన్. ఇదే జరిగితే… ప్రభ కరిగిపోతున్న మోదీకి ప్రత్యామ్నాయంగా రాహులే కనిపిస్తారని కూడా ఆ పార్టీ అంచనా వేస్తోంది. ఓ వైపు పార్టీని లేప‌డంతో పాటు, మ‌రోవైపు రాహుల్ ను బ‌ల‌మైన నేత‌గా మార్చే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. మ‌రి ఆ ప్ర‌య‌త్నాలు ఎప్పుడు మొద‌ల‌వుతాయో, ఎంత వ‌ర‌కూ ఫ‌లిస్తాయో చూడాలి.