Idream media
Idream media
కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ రాజకీయాలు మరో దశకు చేరుకున్నాయి. నిన్న సీఎం అశోక్ గెహ్లాత్ అధ్యక్షతన ఆయన నివాసంలో జరిగిన సీఎల్పీ భేటీకి 106 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొనసాగేందుకు అవసరమైన బలం 101 సీట్ల కన్నా మరో ఐదు సీట్లు ఎక్కువగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ తన గేమ్‌లో స్పీడ్‌ను పెంచింది. నిన్నటి వరకూ తిరుగుబావుటా ఎగురవేసిన పీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్.. గెహ్లాత్‌తోపాటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ముచ్చెమటలు పట్టించారు.
ఇప్పుడు కాంగ్రెస్ వంతు వచ్చినట్లుంది. సచిన్‌తో ఆ పార్టీ ముఖ్యనేతలు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా చర్చలు జరిపినట్లు వార్తలొచ్చాయి. సమస్య పరిష్కారం కాకపోవడంతో పాటు ప్రభుత్వానికి ఢోకా లేదని తేలడంతో సచిన్‌పై చర్యలకు పూనుకుంది. మంత్రివర్గం నుంచి సచిన్ పైలెట్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా పీసీసీ పదవి నుంచి కూడా తొలగించింది. సచిన్ స్థానంలో నూతన పీసీసీ అధ్యక్షుడుగా సీనియర్‌నేత గోవింద్ సింగ్‌ను నియమించింది. సచిన్‌తోపాటు ఆయన వర్గంలోని ఇద్దరు మంత్రులను కూడా తొలగించారు. దీంతో రాజస్థాన్‌లో రాజకీయాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. సచిన్‌తన తర్వాత స్టెప్ ఏం తీసుకోబోతున్నాడన్న దానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
నిన్నటి వరకూ తనకు 30 మంది ఎమ్మెల్యేల బలం ఉందని లీకులు ఇస్తున్న సచిన్ పైలెట్.. నిన్న రాత్రి తన వర్గం ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తున్నట్లుగా ఓ పది సెకన్ల వీడియోను విడుదల చేశారు. అందులో 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు చెబుతున్నారు. అటు బీజేపీకి రాం రాం చెప్పిన సచిన్ పైలెట్ కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ పేరు ప్రగతిశీల కాంగ్రెస్ అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. సచిన్‌పై వేటుతో ప్రస్తుతం కాంగ్రెస్ తన ఆటను ముగించింది. తర్వాత సచిన్ వంతు. ఆయన ఏం చేయబోతున్నారు..? అనేది రాజస్థాన్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.