Idream media
Idream media
ఏడేళ్లుగా దేశంలో కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ద్వారా ఆ విషయం స్పష్టమైంది. పార్టీకి అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి కూడా వెనుకడుగు వేయాల్సిన దుస్థితి వచ్చింది. దీనికి తోడు కాంగ్రెస్ విధేయులు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన ముఖ్యులకు ప్రాధాన్యం ఇస్తోంది. పరిణామాలన్నీ కాంగ్రెస్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కూడా నాయకులలో అసంతృప్తి పెరుగుతూ పోతోంది. పంజాబ్‌లో పార్టీ రాష్ట్ర విభాగంలో అంతర్గత పోరు కొనసాగుతుండగానే.. అదే దారిలో ఇప్పుడు హరియానా కాంగ్రెస్ నడుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాకు ఒక కీలక పాత్ర కోసం లాబీయింగ్ చేస్తోన్న పార్టీ ఎమ్మెల్యేల గ్రూపు ఒకటి సోమవారం సీనియర్ నాయకుడు కె.సి.వేణుగోపాల్‌ను కలిసింది. రాష్ట్రంలో పార్టీకి ఒక ‘బలమైన నాయకత్వం’ కోరుతూ కొంతమంది ఎమ్మెల్యేలు దేశ రాజధానిలో మరొక కాంగ్రెస్ సీనియర్ నాయకుడిని కలిసిన కొన్ని రోజుల తర్వాత ఈ సమావేశం జరిగింది. దీంతో ఇప్పుడు ఆ రాష్ట్రంలోని అంతర్గత పోరును చక్కదిద్దే ప్రయత్నాల్లో అధిష్ఠానం ఉంది.
ఈ క్రమంలోనే మరికొద్ది నెలల్లో దాదాపు ఏడు రాష్ట్రాలలో శాసన సభల ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ ఎన్నికలను ఎదుర్కోవడం పార్టీకి కత్తిమీద సాము లాంటిదే. దీంతో సంస్థాగతంగా మరింత బలోపేతమయ్యేందుకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలకు అగ్ర నాయకత్వ బాధ్యతలు కట్టబెడుతూనే, ప్రాంతీయ స్థాయి నేతలకు పెద్ద పీట వేయబోతున్నట్లు సమాచారం. సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం లభించే విధంగా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
సంస్థాగతంగా బలోపేతమవడం కోసం సచిన్ పైలట్, మల్లికార్జున ఖర్గే, టీఎస్ సింగ్ దేవ్ వంటివారికి కీలక పదవులు ఇవ్వబోతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. సచిన్ పైలట్ వంటి యువ నేతలను జాతీయ రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు సమాలోచనలు జరుగుతున్నట్లు తెలిపాయి. పంజాబ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, యువ నేత సచిన్ పైలట్ మధ్య విభేదాలు ఉన్నాయి.
అదేవిధంగా పంజాబ్‌లో ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య విభేదాలు ఉన్నాయి. 23 మంది నేతలు గత ఏడాది సోనియా గాంధీకి రాసిన లేఖలో పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. ఈ లేఖ రాసినవారిలో ఐదుగురు మాజీ ముఖ్యమంత్రులు, సిట్టింగ్ ఎంపీలు శశి థరూర్, మనీశ్ తివారీ ఉన్నారు. ఈ నేపథ్యంలో యువ, వృద్ధ నేతల మధ్య సమతూకం పాటిస్తూ కాంగ్రెస్‌ను పటిష్టపరచాలని అధిష్ఠానం భావిస్తోందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ చర్యలన్నీ పార్టీకి కలిసొస్తాయా, లేదా చూడాలి.