iDreamPost
iDreamPost
దేశాన్ని ఏకఛత్రాధిపత్యంతో అర్థ శతాబ్దం పాటు శాసించిన పార్టీ ఇప్పుడు శిథిల స్థితికి చేరుతోంది. కాంగ్రెస్ కోటలు కూలుతున్నాయి. ఎంతో కష్టపడిన తర్వాత దక్కిన విజయం కూడా నిలబెట్టుకోలేని దశలో ఆపార్టీ కనిపిస్తోంది.
తాజాగా మధ్యప్రదేశ్ ఓ ఉదాహరణ అయితే ఆ తర్వాత రాజస్తాన్ కూడా అదే బాటలో సాగే ప్రమాదం దాపురిస్తోంది. అంతకుముందే ఆంధ్రప్రదేశ్ , అరుణాచల్ ప్రదేశ్ అనుభవాలు కూడా ఉన్నాయి. దేశంలో కాంగ్రెస్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోవడానికి అసలు కారణం ఆపార్టీ అధిష్టానం స్వయంకృతాపరాధంగా చెప్పవచ్చు. ముఖ్యంగా అధినేతలకు అనుంగు అనుచరులుగా వ్యవహరించిన కీలక నేతల వారసలు పట్ల వ్యవహరించిన తీరు మూలంగానే ఇలాంటి పరిస్థితి ఎదురవుతున్నట్టుగా భావిస్తున్నారు. యాధృశ్ఛికంగా ఈ నాలుగు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన నేతల వారసులు ఇప్పుడు చక్రం తిప్పే స్థితిలో ఉండగా వారి తండ్రులంతా దాదాపుగా ఒకే రీతిలో ప్రాణాలు కోల్పోవడం కూడా ఆశ్చర్యకరమే.
సింధియాల విషయంలో చిన్నచూపు!
మధ్యప్రదేశ్ లో వరుసగా మూడు సార్లు బీజేపీ అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఎట్టకేలకు శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీని ఓడించి అధికారాన్ని అందుకోవడంలో జ్యోతిరాదిత్య సింధియాది కీలకపాత్ర. అయినప్పటికీ అధికారం దక్కగానే కమల్ నాథ్ ని కుర్చీలో పెట్టి, సింధియాకి మొండిచేయి చూపడంతో ఇప్పుడు ఆయన వర్గం బీజేపీ బాట పడుతున్నట్టు కనిపిస్తోంది. సోనియా గాంధీ తన కోటరీలో కొందరు నేతలకే ప్రాధాన్యతనిస్తూ పార్టీ కోసం పాటుపడుతున్న నేతలను పక్కన పెట్టడంతోనే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతున్నట్టు కనిపిస్తోంది. అంతకుముందు జ్యోతిరాదిత్య తండ్రి మాధవరావు సింధియా తండ్రి విషయంలో కూడా కాంగ్రెస్ అదే రీతిలో వ్యవహరించింది. ముఖ్యంగా రాజీవ్ గాంధీ సన్నిహితుడిగా ఉన్న మాధవరావుకి రాజీవ్ మరణం తర్వాత సమస్యలు ఎదురయ్యాయి. చివరకు ఆయన 2001లో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఆయన వారసుడిగా రంగ ప్రవేశం చేసిన గ్యాలియర్ యువరాజు జ్యోతిరాదిత్య కి కాంగ్రెస్ లో తగిన ప్రాధాన్యత దక్కలేదనే కారణంతో తండ్రి విడిచిపెట్టిన జనసంఘ్ వారసులతో నిండిన బీజేపీకి చేరువవుతున్నట్టు కనిపిస్తోంది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కోరి కష్టాలు తెచ్చుకుంటున్నట్టు స్పష్టం అవుతోంది.
అరుణాచల్ ప్రదేశ్ లో అనుభవం కూడా అదే..
ఆ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. ఆపార్టీ తరుపున ప్రేమ్ ఖండూ సీఎంగా ఉన్నారు. వాస్తవానికి ప్రేమ్ కుటుంబం కరడుగట్టిన కాంగ్రెస్ నేపథ్యం నుంచి వచ్చింది. ఆయన తండ్రి దుర్జీ ఖండు కాంగ్రెస్ లో కీలక నేతగా ఎదిగారు. 2011 వరకూ సీఎంగా కూడా ఉన్నారు. చివరకు అనూహ్యంగా 2011లో హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆయన వారసుడిగా సీన్ లోకి వచ్చిన ప్రేమ్ కుటుంబానికి కాంగ్రెస్ లో తగిన ప్రాధాన్యత దక్కలేదు. దాంతో ప్రేమ్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ ని వీడడం, బీజేపీ కండువా కప్పుకోగానే సీఎం కావడం కూడా జరిగిపోయాయి. చివరకు ఒకనాటి పెట్టని కోట లాంటి రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పునాదులు కోల్పోయిన దుస్థితిని ఎదుర్కొంటోంది.
ఆంధ్రప్రదేశ్ చరిత్ర కూడా అదే…
ఇందిరా, రాజీవ్, సోనియా వరుసగా కాంగ్రెస్ గాంధీ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా మెలిగిన వైఎస్సార్ కూడా చివరకు హెలికాప్టర్ ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. 2009లో వైఎస్సార్ మరణం తర్వాత జగన్ తో కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరించిన తీరు పలువురిలో వ్యతిరేకతకు కారణం అయ్యింది. సొంత పార్టీతో జగన్ సత్తా చాటడానికి ఆ పరిణామాలు పునాది అయ్యాయి. ఆఖరికి అనుకున్న రీతిలో జగన్ ఏపీ సీఎంగా పదవిలో ఉండగా, ఆయన్ని దూరం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు కనీసం అడ్రస్ కూడా లేని దుస్థితిని ఎదుర్కొంటోంది. మొత్తంగా ముగ్గరు కీలక నేతల ప్రాణాలు గాలిలో జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోగా వారి వారి వారసులు ముగ్గురూ ఇప్పుడు కాంగ్రెస్ ని వీడారు. వారిలో ఇప్పటికే ఒకరు బీజేపీ తరుపున సీఎంగా ఉన్నారు. సీఎం కూడా బీజేపీకి చేరువవుతున్నారు. జగన్ మాత్రం సొంత పార్టీతో స్వయంకృషితో సీఎంగా సక్సెస్ అవుతున్నారు.
రాజస్తాన్ కూడా అంతేనా?
మాధవరావు సింధియా, వైఎస్సార్, దుర్జీ ఖండు కన్నా ముందే మరణించిన రాజేష్ పైలట్ కూడా రాజీవ్ గాంధీ కి అత్యంత సన్నిహితుడు. అయితే ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన వారసుడు సచిన్ పైలట్ పట్ల కూడా కాంగ్రెస్ నాయకత్వం తగిన రీతిలో వ్యవహరించలేదనే అభిప్రాయం ఉంది.గత ఏడాది రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బాధ్యతలన్నీ నెత్తిన మోసి విజయతీరాలకు చేరిస్తే చివరకు అశోక్ గెహ్లట్ ని సీఎం చేసి సచిన్ కి మొండి చేయి చూపడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మధ్యప్రదేశ్ పరిణామాల తర్వాత రాజస్తాన్ కూడా అదే బాటలో సాగుతుందని, దానికి సచిన్ పైలట్ సారధ్యం వహిస్తారనే ప్రచారం సాగుతోంది. అదే జరిగితే ఇక కాంగ్రెస్ కోలుకోలేని దశకు చేరడం ఖాయం. పార్టీకి అండగా ఉన్న వారంతా చేజారిపోతున్న దశలో చివరి దశకు చేరుకుందనే అభిప్రాయం బలపడుతుంది. తద్వారా పార్టీకి లోయల్ గా ఉన్న వారిని విస్మరిస్తే ఎవరికైనా కష్టాలు తప్పవనే చారిత్రక అనుభవాన్ని మిగల్చబోతున్నట్టు చెప్పవచ్చు.