Idream media
Idream media
ఈయనే తెలంగాణ పీసీసీ చీఫ్.. ఇక అధికారిక ప్రకటనే తరువాయి.. కొద్ది నెలలుగా ఇటువంటి ప్రకటనలు మామూలు అయిపోయాయి. అప్పట్లో జీవన్ రెడ్డి, కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి మొదలుపెడతారట. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాలు జారీ చేసినట్లుగా పీసీసీలో చర్చ జరుగుతోంది.
తెలంగాణ కాంగ్రెస్ లో తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. గడిచిన కొద్ది కాలంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త రథసారధిని నియమించేందుకు భారీగా కసరత్తు జరుగుతోంది. రాష్ట్ర పార్టీ బాధ్యుడిగా వ్యవహరిస్తున్న మాణిక్యం ఠాగూర్.. ఆ మధ్యలో భారీ ఎత్తున కసరత్తు చేసి.. పలువురు నేతలతో మాట్లాడిన తర్వాత తన ప్రయారిటీ లిస్టును అధిష్ఠానం ముందు పెట్టినట్లుగా చెబుతారు. ఈ క్రమంలోనే సాగర్ ఉప ఎన్నికకు రంగం సిద్ధం కావటంతో.. ఎన్నికల ఫలితం వెల్లడైన తర్వాత కొత్త రథసారధి పేరు ప్రకటిస్తారని భావించారు.
అందుకు భిన్నంగా తాజాగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు జరిగిన కసరత్తును పక్కన పెట్టి.. తాజాగా మరోసారి అధ్యయనం చేయాలని.. రథసారధిగా ఎవరిని నియమించాలన్న విషయంపై నివేదిక ఇవ్వాలని ఆమె కోరినట్లు చెబుతున్నారు.
పెద్ద ఎత్తున నేతలు పీసీసీ చీఫ్ పదవికి పోటీ పడుతున్న వేళ.. సరైన నిర్ణయాన్ని తీసుకోవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఉంది. ఈ క్రమంలోనే తాజా అధ్యయనమని చెబుతున్నారు. మరోవైపు టీపీసీసీ చీఫ్ పదవి తమకే వస్తుందని రేవంత్ రెడ్డి బ్యాచ్ ఇప్పటికే దావత్ లకు సిద్ధమైన వేళ.. అనూహ్యంగా మరోసారి అధ్యయనం చేయాలని.. అందుకు సీనియర్ నేత ఒకరికి బాధ్యత అప్పజెప్పినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు తాజాగా రాష్ట్ర పీసీసీ ( టీపీసీసీ) అధ్యక్షుడి రేసులో తాను కూడా ఉన్నానని నిజామాబాద్ మాజీ ఎంపీ మధు యాష్కీ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలలోనే పీసీసీ అధ్యక్షుడి ప్రకటన ఉంటుందన్నారు. దీనికి సంబంధించిన కసరత్తు ఢిల్లీలో మొదలైందని తెలిపారు. కానీ అందరూ ఊహించినట్టు అది ట్వంటీ ట్వంటీ స్థాయిలో లేదని ఆయన పేర్కొన్నారు. పీసీసీ పగ్గాలను బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాలని కోరుతున్నామని ఆయన అన్నారు.