iDreamPost
android-app
ios-app

తట్టుకోలేకపోతున్న అధిష్ఠానం.. ఢిల్లీకి రావద్దని ఆదేశం..!

తట్టుకోలేకపోతున్న అధిష్ఠానం.. ఢిల్లీకి రావద్దని ఆదేశం..!

టీపీసీసీ కోసం ఆ రాష్ట్ర నేతలు చేస్తున్న విన్నపాలు, పైరవీలు, ఆ పదవికి ఆయన అర్హుడు కాదని ఒకరు.. ఈయన అర్హుడు కాదని ఇంకొకరు, ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఫిర్యాదులు చేసుకోవడం.. ఒకరు తర్వాత మరొకరు ఢిల్లీక రావడం, పోవడంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడిని నియమించే వ్యవహారం తమకు తలనొప్పిగా మారినట్లు భావిస్తోంది. అధిష్ఠానంపై రకరకాల ఒత్తిళ్లు తేవడం, ఢిల్లీ యాత్రలు చేపట్టడం పార్టీ పెద్దలకు చికాకుగా మారింది. ఒక దశలో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఈ విషయంపై తమతో మాట్లాడేందుకు ఢిల్లీ రావద్దని నాయకులను కూడా హెచ్చరించినట్లు తెలిసింది.

ఈ పరిస్థితిలో ఇదేం తీరు..?

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎన్నిక ఏదైనా పరాజయం పాలవుతోంది. వరుసగా ఘోర పరాజయాలు, ఫిరాయింపులు, కుమ్ములాటల నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్‌ భవిష్యత్తు అంధకారబంధురమైనా.. పార్టీ నేతలు తమ స్వభావాన్ని మార్చుకోకుండా పీసీసీ పీఠాన్ని చేజిక్కించుకునేందుకు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంపై అధిష్ఠానం అయోమయానికి గురవుతోంది. పీసీసీ పీఠాన్ని ఆశిస్తున్న వారిలో ప్రధానంగా రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్‌బాబు, మధుయాష్కీ ఉన్నా.. వి.హనుమంతరావు, మర్రి శశిధర్‌ రెడ్డి వంటి సీనియర్లు కూడా రంగంలోకి దిగడం అధిష్ఠానానికి ఆశ్చర్యం కలిగిస్తోంది. పార్టీని తిరిగి గాడిన పెట్టేందుకు నిర్మాణాత్మక సూచనలు చేయకుండా.. తమ పదవుల కోసం వీరందరూ ఒత్తిడి చేస్తున్నట్లుగా అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి కూడా కొందరు నేతలు రంగంలోకి దిగి తెలంగాణ నాయకుల తరఫున పైరవీలు చేయడం ఢిల్లీ పెద్దలకు మింగుడు పడడం లేదు. విచిత్రం ఏమిటంటే, పీసీసీ పదవికి సంబంధించి తమను సంప్రదించిన వారిలో కొందరు నాయకులు ఇటీవల చేసిన వ్యాఖ్యలు వారిని నోరెళ్లబెట్టేలా చేస్తున్నాయట. ఇటీవల దుబ్బాక అసెంబ్లీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత.. తెలంగాణలో కాంగ్రెస్‌ ఇక ఒంటరిగా పోరాడలేదని, కేసీఆర్‌తో పొత్తు పెట్టుకోవడమే గత్యంతరమని సదరు నాయకులు వాదించడంపై ఢిల్లీ పెద్దలు విస్మయంతో ఉన్నారు. చివరకు ఢిల్లీకి రావద్దు బాబోయ్‌ అనే పరిస్థితి వచ్చిందంటే కాంగ్రెస్‌ నేతల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.